టీటీడీఎల్పీ విలీనంపై తీర్పు వాయిదా | TTDLP merge into TRS: Hearing in High court has been postponed | Sakshi
Sakshi News home page

టీటీడీఎల్పీ విలీనంపై తీర్పు వాయిదా

Published Wed, Aug 24 2016 3:09 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

TTDLP merge into TRS: Hearing in High court has been postponed

- హైకోర్టులో ముగిసిన వాదనలు

- ఏజీ, న్యాయమూర్తి మధ్య వాడి వేడి సంభాషణలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం (టీటీడీఎల్‌పీ) టీఆర్‌ఎస్‌లో విలీనమైనట్లు అసెంబ్లీ కార్యదర్శి ఈ ఏడాది మార్చి 10న జారీ చేసిన బులెటిన్ అమలును నిలిపేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు.

పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేపై దాఖలైన ఫిర్యాదులను పరిష్కరించకుండానే టీఆర్‌ఎస్‌లో టీటీడీఎల్‌పీ విలీనమైనట్లు అసెంబ్లీ కార్యదర్శి బులెటిన్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని కొట్టేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలేదాకా బులెటిన్ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ అనుబంధ పిటిషన్‌పై ఈ నెల 8న విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు.. ప్రతివాదులుగా ఉన్న అసెంబ్లీ కార్యదర్శికి, 10వ షెడ్యూల్ కింద ఫిరాయింపులపై విచారణ జరిపే ట్రిబ్యునల్‌కు చైర్మన్ హోదాలో స్పీకర్‌కు, పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.

ఈ వ్యాజ్యం మంగళవారం మళ్లీ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్, న్యాయమూర్తి మధ్య వాడివేడిగా సంభాషణలు జరి గాయి. స్వరాన్ని పెంచొద్దని ఏజీని ఉద్దేశించి న్యాయమూర్తి, వాదనలు చెప్పకుండా తనను అడ్డుకోజాలరంటూ ఏజీ వ్యాఖ్యానించేంత వరకు వెళ్లాయి. చివరకు ఏజీ తాననుకున్న వాదనలనే వినిపించారు. అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఫిరాయింపులు, అనర్హత, విలీనం తదితర అంశాలపై స్పీకర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోజాలరన్నారు.

 

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద వీటిపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో నిర్ణ యం తీసుకునే స్పీకర్‌కు, శాసనసభ కార్యకలాపాలను నిర్వహించే స్పీకర్‌కు మధ్య స్పష్టమైన తేడా ఉందన్నారు. ట్రిబ్యునల్ చైర్మన్‌గా స్పీకర్ ముందు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని తేల్చకుండా విలీనంపై నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందేనని ట్రిబ్యునల్ తేలిస్తే అప్పుడు విలీనమన్నదే ఉత్పన్నం కాదన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement