
'రాష్ట్రపతి పాలనపై రేపు కేంద్ర కేబినెట్ నిర్ణయం'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రేపు వెలువడనుంది. శుక్రవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రపతి పాలనపై నిర్ణయం తీసుకునే అవకాశముందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. అపాయింటెడ్ డేట్ వెలువడేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశముందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. విలీనం విషయంలో కేసీఆర్ను నమ్ముతున్నామని చెప్పారు.
అయితే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనకే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించడం మంచిదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి దిగ్విజయ్, సుశీల్ కుమార్ షిండే సూచించినట్టు తెలిసింది. వీరి అభిప్రాయంతో సోనియా ఏకీభవించినట్టు తెలిసింది. కేంద్ర కేబినెట్ సమావేశం రేపు ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకానుంది.