
టీ బిల్లు గడువు వారం చాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై అభిప్రాయం తెలిపేందుకు నాలుగు వారాల గడువు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నివేదనపై రాష్ట్రపతి నిర్ణయం ఇంకా వెలువడలేదు.
రాష్ట్రపతికి హోం శాఖ నివేదన
న్యాయ సలహా కోరిన ప్రణబ్ ముఖర్జీ
గడువుపై నేడు నిర్ణయం వెలువడే అవకాశం..
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై అభిప్రాయం తెలిపేందుకు నాలుగు వారాల గడువు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నివేదనపై రాష్ట్రపతి నిర్ణయం ఇంకా వెలువడలేదు. దీనిపై రాష్ట్రపతి న్యాయసలహా కోరినట్టు హోంశాఖ వర్గాల సమాచారం. కాగా రాష్ట్ర ప్రభుత్వం కోరినవిధంగా నాలుగు వారాల గడువు ఇస్తే బిల్లు ఆమోదానికి సమయం సరిపోదని, వారం నుంచి పది రోజుల్లోపు గడువు ఇస్తే తమకు తగిన సమయం ఉంటుందని హోంశాఖ రాష్ట్రపతికి నివేదించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నిర్ణయం బుధవారం వెలువడే అవకాశం ఉందని, దీనిని నేరుగా స్పీకర్ అసెంబ్లీలో ప్రకటించవచ్చని హోంశాఖ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు...
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మంగళవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని కలిశారు. బిల్లుపై చర్చ జరుగుతున్న తీరును వివరించారు.
బిల్లుపై జరుగుతున్న చర్చను అంశాలవారీగానా లేక సభ్యుల వారీగా క్రోడీకరించాలా? అన్న వివరాలు తెలుసుకున్నారు. దానికి ప్రత్యేకమైన నమూనా ఏమీ లేదని... గతంలో ఇతర రాష్ట్రాలు పంపిన నివేదికలను హోంశాఖ కార్యదర్శి చూపినట్టు తెలిసింది.
మహంతి మంగళవారం ఉదయం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కూడా కలిసి 20 నిమిషాలసేపు మాట్లాడారు. అయితే ఇది బిల్లుకు సంబంధించిన అంశంపై కాదని, తాను రాసిన ‘అర్బనైజింగ్ ఇండియా’ అనే పుస్తకం కాపీని ఇచ్చేందుకు మాత్రమే కలిశారని సమాచారం.