వీల్‌చైర్‌లోని కొడుకు చదువు కోసం ఓ అమ్మ..
ఆరేంజ్ (కాలిఫోర్నియా): పక్షవాతం వచ్చి వీల్‌చైర్‌కు పరిమితమైన కన్నకొడుకు చదువు కోసం ఓ మాతృమూర్తి చూపిన అకుంఠిత దీక్షకు ఘనమైన సత్కారం లభించింది. కొడుకుతోపాటు ప్రతిరోజూ తరగతులకు హాజరై.. ఉపాధ్యాయులు చెప్పిన నోట్స్ తీసుకొని.. అతను ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) పూర్తిచేయడంలో అడుగడుగునా అండగా నిలిచింది ఆమె.. ఆ కొడుక్కే కాదు కన్నతల్లి దీక్షకు సైతం సత్కారం లభించింది. కొడుకుతోపాటు ఆ మాతృమూర్తికి కూడా ఓ అమెరికన్ యూనివర్సిటీ ఎంబీఏ పట్టాను అందజేసింది.
ప్రాథమిక పాఠశాల రిటైర్డ్ టీచర్ అయిన జ్యూడీ ఓ కానర్ వీల్‌ఛైర్‌లోని తన కొడుకు మార్టిను స్నాతకోత్సవ వేదికపైకి తీసుకురాగా.. మార్టికే కాదు, జ్యూడీకి కూడా ఎంబీఏ పట్టాను అందజేస్తున్నట్టు ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తింది యూనివర్సిటీ. కాలిఫోర్నియా లాస్‌ఏంజిల్స్‌లోని చాప్‌మన్ యూనివర్సటీ ఈ అరుదైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ అనూహ్య ప్రకటనతో ఆనందంతో భావోద్వేగానికి లోనైన జ్యూడీ ‘స్కూల్‌లో ఉండటం తనకు ఇష్టమని, తరగతి గదిలో గడిపిన ప్రతి నిమిషాన్ని తాను ఆస్వాదించినట్టు పేర్కొంది.
మార్టి ఓ కానర్ కొలరాడో యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. 2012లో ఓ ప్యాకేజింగ్ కంపెనీలో పనిచేస్తుండగా మెట్లమీద నుంచి జారిపడి పక్షవాతానికి గురయ్యాడు. అప్పటినుంచి వీల్‌చైర్‌లో ఉన్న కొడుకు చదువు కోసం అన్నీ తానై కష్టపడింది జ్యూడీ. ఫ్లోరిడాలో నివాసముండే జ్యూడీ కొడుకు చదువు కోసం దక్షిణ కాలిఫోర్నియాకు మకాం మార్చింది. వీల్‌చైర్‌లో ఉండే జ్యూడీ ఐప్యాడ్, లాప్‌ట్యాప్, వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ తదితర పరికరాలను ఉపయోగించగలడు. కానీ సొంతంగా నోట్స్ రాసుకోలేడు. ఆ పని చేసేందుకు తల్లి జ్యూడీ కూడా తరగతులకు హాజరయ్యేది.