మంత్రి గారికి కోపం వచ్చింది..
ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన స్పీడు యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన మంత్రివర్గంలోని ఒక మంత్రికి కోపం వచ్చింది. వెంటనే ఆయన ఒక చీపురు తీసుకుని, తన కార్యాలయాన్ని, కారిడార్‌ను కూడా చకచకా తుడిచి శుభ్రం చేసేశారు. ఆయన పేరు ఉపేంద్ర తివారీ. కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర అసెంబ్లీలోని తన కార్యాలయంలో పరిశుభ్ర పరిస్థితులను చూసి ఆయనకు ఒక్కసారిగా ఒళ్లు మండిపోయింది. అధికారులు అందరూ చూస్తుండగానే ఆయన స్వయంగా చీపురు పట్టుకుని మొత్తం ఊడ్చేశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ (44) తన కేబినెట్ సహచరులు అందరితో సోమవారం నాడు ఒక ప్రమాణం చేయించారు. అందులో తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుతామన్న ప్రతిజ్ఞ కూడా ఉంది. ఇందుకోసం ఏడాదిలో కనీసం 100 గంటలు కేటాయించాలని వాళ్లను కోరారు. స్వయంగా ఓ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినప్పుడు అక్కడ గుట్కా మరకలు చూసిన ఆయన.. తక్షణం ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో గుట్కాలు, పాన్ మసాలాల వాడకాన్ని నిషేధించారు. తక్షణం కార్యాలయాల గోడలు, నేల మీద ఉన్న పాన్ మసాలా మరకలను శుభ్రం చేయాలని ఆదేశించారు. ఆయన బాటలోనే మంత్రి ఉపేంద్ర తివారీ కూడా స్పందించి, చీపురుతో తన కార్యాలయాన్ని స్వయంగా శుభ్రం చేసుకున్నారు.