అసహనం ఎందుకు బాబూ...! | vasiReddy Padma fires on chandrababu | Sakshi
Sakshi News home page

అసహనం ఎందుకు బాబూ...!

Published Fri, Nov 27 2015 3:28 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

అసహనం ఎందుకు బాబూ...! - Sakshi

అసహనం ఎందుకు బాబూ...!

సాక్షి, హైదరాబాద్ : మీడియాను భ్రష్టు పట్టించిందీ, జర్నలిజాన్ని పెయిడ్ జర్నలిజంగా దిగజార్చిందీ ముఖ్యమంత్రి చంద్రబాబాబేనని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ విమర్శించింది. జర్నలిజంలో విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఆ పార్టీ ఘాటుగా వ్యాఖ్యానించింది.చంద్రబాబుకు రోజురోజుకూ మీడియాపై అసహనం పెరిగిపోతోందని పార్టీ అధికారప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సాక్షి పత్రిక, చానెల్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వారు స్పందించారు.

గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మీడియాను ఎవరు భ్రష్టు పట్టించారో, ఎవరు దిగజార్చారో తెలుసుకోవడానికి బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబుకు సవాలు విసిరారు. సాక్షి టీవీని చూడొద్దు, సాక్షి పత్రిక చదవొద్దు అనే స్థాయికి ఒక సీఎం దిగజారారంటే ఆయన మానసిక ఆరోగ్యం ఎంతగా చెడిపోయిందో అర్థం అవుతోందన్నారు.

పాకిస్తాన్‌లో మాదిరిగా ఒక పత్రిక చదవొద్దు, ఒక చానెల్ చూడొద్దు అని ఫత్వా జారీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, ఇసుక మాఫియా పై ఒక్క సాక్షిలోనే కాదని, ‘ఈనాడు’లో కూడా ‘ఇసుకాసురులు’ అనే కథనాలు వచ్చాయన్నారు. డ్వాక్రా మహిళలను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలా అక్రమాలకు పాల్పడుతున్నదీ మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు.

హైకోర్టు కూడా చివాట్లు పెట్టిందని ఆమె గుర్తు చేశారు.తమ అధినేత జగన్ ప్రతి వారం కోర్టు చుట్టూ తిరుగుతున్నారని చంద్రబాబు చెప్పడాన్ని పద్మ ప్రస్తావిస్తూ ‘అందుకు కారణం ఎవరు? మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసి చేసిన కుట్ర ఫలితంగానే కదా జగన్‌పై కేసులు వచ్చింది?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  శ్వేత పత్రాల విడుదల పేరుతో అన్నీ అబద్ధాలే చెబుతున్నారన్నారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే తన ఆస్తులు, భార్య, కొడుకు, కోడలి ఆస్తులు హెరిటేజ్ వ్యవహారాలపైన విచారణకు సిద్ధం కావాలన్నారు.
 
నిజాలు రాస్తున్నారనే  అక్కసు: అంబటి
ఇసుక మాఫియా, పట్టిసీమ అంశాల్లో జరిగిన అవినీతి బట్టబయలు చేస్తున్నందునే సాక్షి దినపత్రికపై చంద్రబాబు విరుచుకుపడుతున్నారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లే పత్రికలపై చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.

అనేక అవినీతి కార్యక్రమాలకు నాంది పలికిన చంద్రబాబు.. వాటిని ఎండగడుతున్నందునే మండిపడుతున్నారా అని ప్రశ్నించారు. కేవలం తమకు వ్యతిరేకంగా వ్యవహరించారనే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు ఒక చానల్‌ను సంవత్సరంపాటు నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై అవాకులు చవాకులు పేలితే సహించబోమని హెచ్చరించారు. చంద్రబాబు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పత్రికలే కాదు.. రాజకీయ పార్టీలు కూడా సహించబోవన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement