ఆల్మట్టి పాపం మీదే! : వాసిరెడ్డి పద్మ
* కడుతుంటే దద్దమ్మలా కూర్చుంది మీరే కదా?
* చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ ధ్వజం
* కృష్ణా నదిపై ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కట్టింది మీ హయాంలోనే
* సాక్ష్యాలుగా టీడీపీ అధికారిక గెజిట్ ‘ఈనాడు’ పత్రిక కథనాలివిగో
* ఎగువన ప్రాజెక్టులు కడుతోంటే మీరు దద్దమ్మలా కూర్చున్నారు
* ఇప్పుడు వైఎస్ హయాంలోనే ఆ ప్రాజెక్టులు కట్టారని పచ్చిఅబద్ధాలా?
* మోడీ మొహం చూడనని ఆయనతో వేదిక ఎలా పంచుకున్నారు?
* జగన్‌కు బెయిల్ ఇవ్వటంపై న్యాయస్థానాలకు దురుద్దేశాలు ఆపాదిస్తారా?
* చంద్రబాబు కోర్టు ధిక్కార వ్యాఖ్యలపై సుమోటోగా విచారణ జరపాలి
* అధికారంలోకి రాబోయే మా పార్టీకి వేరొక పార్టీతో కలవాల్సిన పనేంటి?
సాక్షి, హైదరాబాద్: ‘‘చంద్రబాబు నిజాలు మాట్లాడితే ఆయన తల వెయ్యి ముక్కలవుతుంది’ అని దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు అంటుండేవారు.. అది నూరుపాళ్లూ నిజం. కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో ఆల్మట్టితో పాటు పలు ప్రాజెక్టులను వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కట్టారంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు.. సత్యానికి మారు పేరైన గాంధీ జయంతి నాడే ఆ పచ్చి అబద్ధాలను పత్రికల్లో చదవాల్సివస్తోంది’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘టీడీపీ అధికారిక గెజిట్ అయిన ఈనాడు పత్రిక’ అని పేర్కొంటూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆ పత్రికలో వచ్చిన పలు వార్తల క్లిప్పుంగులను పద్మ మీడియా ప్రతినిధులకు చూపించారు.
2003 జూలై 18వ తేదీన ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన వార్తతో పాటు.. ఆంధ్ర నెత్తిన కర్ణాటక ‘బండ’ (జూలై 5, 2003), కర్ణాటకలో పది బ్యారేజీల నిర్మాణం (జూలై 23, 2003) అనే శీర్షికలతో ‘ఈనాడు’ ప్రచురించిన వార్తల క్లిప్పింగ్‌లను చూపుతూ ‘‘ఇవన్నీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కట్టిన ప్రాజెక్టులు కావా చంద్రబాబూ..?’’ అని ఆమె సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు వెర్రివాళ్లు, తేలిగ్గా మర్చిపోతారనే చంద్రబాబు అబద్ధాలు చెప్పారని, అందుకే వాటిని గుర్తు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. గాంధీ జయంతికి ముందు రోజే సత్యం వధ - ధర్మం చెర కార్యక్రమాన్ని బాబు ప్రారంభించారని విమర్శించారు. పద్మ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణంపై టీడీపీ అధినేత చంద్రబాబు చెప్తున్న పచ్చి అబద్ధాలను సాక్ష్యాలతో సహా ఎండగట్టారు.
అప్పుడు దద్దమ్మలా చూస్తుండిపోయారుగా?
ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు నిర్మించుకుంటుంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మాత్రం ఆ ఊసే లేకుండా దద్దమ్మలాగా కళ్లప్పగించి చూస్తూండిపోయారని ధ్వజమెత్తారు. ‘‘మీరు సీఎంగా ఉన్నపుడు పులిచింతల ఎందుకు కట్టలేదు? పోలవరం నిర్మించాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? ప్రాజెక్టులు కట్టొద్దని మిమ్మల్ని ఎవరైనా ఆదేశించారా? ఎగువ రాష్ట్రాలు బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను గడువు లోపుగా వినియోగించుకోవాలని తొందరగా ప్రాజెక్టులు నిర్మించుకుంటే మీరెందుకు ఏమీ చేయలేక పోయారు?’’ అని ఆమె నిలదీశారు. ‘‘ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు కృష్ణా డెల్టాకు ఆయన హయాంలో తొలి పంటకు కూడా నీరెందుకు ఇవ్వలేకపోయారు? సీఎంగా ఉండి కూడా చోద్యం చూస్తూ ఉండిపోయింది కాకుండాఇప్పుడు వైఎస్ హయాంలోనే ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు నిర్మించుకున్నాయని అబద్ధాలు చెప్తారా?’’ అని దుయ్యబట్టా రు. బీజేపీ నేత నరేంద్రమోడీ సీఎం పదవికే అర్హుడు కాడని, ఆయన వల్లే తాను బీజేపీతో సంబంధాలు తెగదెంపులు చేసుకున్నానని, మళ్లీ మోడీ మొహం చూడనని చెప్పిన చంద్రబాబు ఈ రోజు ఢిల్లీలో ఆయనతో ఒకే వేదికను ఎలా పంచుకున్నారని పద్మ ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలు తన అబద్ధాలు నమ్మరని తెలిసి ఢిల్లీ వెళ్లి అక్కడి మీడియాను బుట్టలో వేసుకోవడానికి బాబు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.
బెయిల్ ఎవరిస్తారో తెలియని అజ్ఞానివా?
జగన్‌మోహన్‌రెడ్డికి బెయిలు ఇచ్చింది న్యాయస్థానం అనే బుద్ధీ జ్ఞానం లేకుండా తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, తొమ్మిదిన్నరేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు పదే పదే కుమ్మక్కు అని మాట్లాడుతున్నారంటూ పద్మ తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. మూడు నెలలకు రావాల్సిన బెయిలు 16 నెలల తరువాత వస్తే చంద్రబాబు న్యాయస్థానాలకు దురుద్దేశాలను ఆపాదిస్తున్నారని విమర్శించారు. న్యాయస్థానాలను ధిక్కరించే విధంగా బాబు చేసిన వ్యాఖ్యలను కోర్టులు నేరుగా (సుమోటోగా) పరిగణనలోకి తీసుకుని విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్‌కు బెయిల్ నిరాకరించినపుడు న్యాయస్థానాలను తమ పార్టీ పల్లెత్తు మాట అనలేదని, మౌనం వహించి న్యాయపోరాటమే చేశామని గుర్తుచేశారు. నిజంగా చంద్రబాబుకు రాజకీయ సత్తా ఉంటే జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలని ఆమె సవాల్ చేశారు. జగన్‌ను ప్రజా క్షేత్రంలోనే ఎదుర్కొంటానని అనడానికి బాబు 35 ఏళ్ల రాజకీయ జీవితం సరిపోవడం లేదని.. అసలా మాట అనడానికే బాబు కాళ్లు వణికి పోతున్నాయని పద్మ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌కు మీరు ప్రత్యర్థి కాదని ఒప్పుకున్నట్లే కదా!
రాజకీయ ప్రత్యర్థుల మీద సీబీఐని ఒక ఆయుధంగా ప్రయోగిస్తారని, లాలూచీ పడితే కేసులు ఉండవని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పద్మ ప్రస్తావిస్తూ.. ఈ వ్యాఖ్యల ద్వారా బాబు ఏం చెప్పదల్చుకున్నారని ప్రశ్నించారు. ‘‘ప్రత్యర్థులపై సీబీఐని ప్రయోగిస్తారు అంటే జగన్ ప్రత్యర్థి, మీరు ప్రత్యర్థి కాదని మీరే ఒప్పుకుంటున్నట్లే కదా..? అవినీతిపరులను కాపాడుతున్నారంటే మీమీద సీబీఐ కేసు వేయకపోవడం ద్వారా, ఈడీ విచారణలు లేకుండా చేయడం ద్వారా మిమ్మల్ని, మీ అనుచరులు, ఫైనాన్షియర్లు, బినామీలను ఏ ఒక్కరి మీద ఈగ వాలకుండా కేంద్ర ప్రభత్వం కాపాడుతోందని మీరు ఒప్పుకుంటున్నట్లే కదా!’’ అని పద్మ నిలదీశారు. చంద్రబాబుపై ఐఎంజీ-భారత, ఎమ్మార్ ప్రాపర్టీస్‌తో పాటుగా పలు ఈడీ, ఆదాయపు పన్నుకు సంబంధించిన కేసులు ఉన్నా సీబీఐ దర్యాప్తు లేకుండా కాపాడుతున్నారంటే కాంగ్రెస్ వారికి ఆయన ఎంత మిత్రులుగా ఉన్నారో అర్థం అవుతోందన్నారు.
నీ బతుకంతా పొత్తులు, ఎత్తులు, జిత్తులే కదా...
జగన్ రాజకీయ ప్రత్యర్థి కాబట్టే ఆయన మీద సీబీఐ కేసులు పెట్టారని, ఆయన ఏ తప్పూ చేయలేదని పద్మ స్పష్టంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలను భూస్థాపితం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు మరొక పార్టీతో కలవాల్సిన అవసరం ఏముందన్నారు. రేపో మాపో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాబోయే పార్టీ.. ఇతర పార్టీలతో కలవదని స్పష్టంచేశారు. రెండున్నరేళ్ల క్రితం పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 17 అసెంబ్లీ సీట్లను, 2 లోక్‌సభ సీట్లను ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా గెల్చుకుందని ఆమె గుర్తు చేశారు. ‘‘ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన తరువాత జరిగిన ఏ సాధారణ ఎన్నికల్లోనైనా సరే ఒక్కడిగా ఒక్క ఎన్నికల్లోనైనా పోటీ చేసిన చరిత్ర మీకుందా? మీ జీవితం అంతా పొత్తులు, ఎత్తులు, జిత్తులే కదా!’’ అని ఆమె చంద్రబాబును కడిగిపారేశారు. ‘‘డీల్ కుదిరిందని అడ్డదిడ్డంగా బాబు మాట్లాడుతున్నారు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని విప్ జారీ చేసి మరీ కాపాడిన చంద్రబాబుకు కుమ్మక్కుల గురించి మాట్లాడే అర్హత లేదు’’ అని మండిపడ్డారు.
ఈ జీవోలేమిటి బాబూ...?
చంద్రబాబుకు ఏ వ్యవస్థపై కూడా నమ్మకం లేదని పద్మ విమర్శించారు. న్యాయవ్యవస్థ విషయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చేసిన నిర్వాకానికి సంబంధించిన జీవోలను ఆమె బయట పెట్టారు. రాష్ట్రంలోని ఏ దేవాలయానికి కూడా దీపం వెలిగించడానికి నూనెను గానీ, వత్తిని గానీ ఇవ్వని చంద్రబాబు ఎక్కడో తమిళనాడులో ఉండే ఒక దేవాలయానికి పది లక్షల రూపాయలు మంజూరు చేస్తూ జీవోలు ఇచ్చారని, దాని ప్రతులను అప్పటి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా పంపారని ఆమె వివరించారు. వ్యవస్థలను ప్రభావితం చేయడంలో చంద్రబాబుది అందె వేసిన చేయని పేర్కొన్నారు. తమిళనాడులోని దేవాలయానికి నిధులు ఎందుకు మంజూరు చేశారు? జీవో కాపీలను అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎందుకు పంపారు? అనే విషయాలను ఆయన విజ్ఞతకే వదలి వేస్తున్నామన్నారు.