కిడ్నీలు, కాలేయాలు.. తీసి దాచేస్తున్నారు!! | vital organs being theft from chinese political prisoners | Sakshi
Sakshi News home page

కిడ్నీలు, కాలేయాలు.. తీసి దాచేస్తున్నారు!!

Published Thu, Apr 9 2015 7:57 PM | Last Updated on Sun, Sep 3 2017 12:05 AM

vital organs being theft from chinese political prisoners

చైనాలో రాజకీయ ఖైదీలను దారుణంగా చిత్రహింసలు గురిచేస్తారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. బతికున్నవారి నుంచి వేలాది కిడ్నీలు, కాలేయం, కార్నియా లాంటి అవయవాలను తొలగించి వాటిని ట్రాన్స్‌ప్లాంట్ కోసం భద్రపరుస్తున్నారట. నొప్పి తెలియకుండా ఉండేందుకు కనీసం ఎనస్తీషియా కూడా ఇవ్వడం లేదని, పనికొచ్చే అవయవాలను తొలగించిన తర్వాత సజీవంగా ఉన్నవారిని ఆస్పత్రిల్లోని బాయిలర్ గదుల్లో వెట్టికి పడేస్తున్నారట. గగుర్పొడిచే ఈ దారుణాలు చైనా ప్రభుత్వ, సైనిక ఆస్పత్రుల్లో జరుగుతున్నాయని 'ఎస్‌బీఎస్ డేట్‌లైన్' మంగళవారం రాత్రి ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.

ఎనిమిదేళ్లపాటు శ్రమించి ఈ పరిశోధనాత్మక డాక్యుమెంటరీని రూపొందించారట. ఏటా దాదాపు 11 వేల మానవ అవయవాలను సజీవంగా ఉన్న రాజకీయ ఖైదీల నుంచి సేకరిస్తున్నారని, ముఖ్యంగా నిషేధిత రాజకీయ సంస్థ 'ఫాలున్ గాంగ్' ఖైదీలను టార్గెట్ చేసి ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆ డాక్యుమెంటరీ వెల్లడించింది. చైనా ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. తాము అవయవదానం కోసం స్వచ్ఛందంగా ముందుకొస్తున్న వారి నుంచి వాటిని సేకరిస్తున్నామని చెబుతోంది.

అవయవాల కోసం తాను ఓ వ్యక్తి దేహాన్ని కోసినప్పుడు ఆ శరీరం నుంచి రక్తస్రావం ఎలా జరిగిందో డాక్యుమెంటరీలో ఓ మాజీ మెడికల్ విద్యార్థి వివరించారు. దాదాపు 2వేల మంది సజీవంగా ఉన్న మనుషుల నుంచి తన భర్తే స్వయంగా కార్నియాలను తొలగించిన విషయాన్ని ఓ హెల్త్ వర్కర్ తెలియజేసింది. 'అవయవాల కోసమే కొంత మంది రాజకీయ ఖైదీలను చంపేశారు. ఏం జరుగుతుందో ఇంతకుమించి నేను వివరించలేను' అని మానవహక్కుల న్యాయవాది, నోబెల్ బహుమని నామినీ డేవిడ్ మాతాస్ డాక్యుమెంటరీకి తెలిపారు. ముఖ్యంగా అరెస్టయిన ఫాలున్ గాంగ్ ఆధ్యాత్మిక సంస్థ అనుచరులనే ఎక్కువ లక్ష్యంగా చేసుకున్నారని ఆయన చెప్పారు. ప్రపంచంలో అవయవాల మార్పిడి కోసం రోగులు నెలలు, సంవత్సరాల పాటు నిరీక్షిస్తుంటే, చైనాలో మాత్రం కొన్ని రోజుల్లోనే అవయవాలు ఎలా దొరుకుతున్నాయని ఆయన ప్రశ్నించారు.

రెడ్‌క్రాస్ అంచనాల ప్రకారం చైనాలో అవయవాల దానం చేయడానికి పేర్లు నమోదు చేసుకున్న వారి సంఖ్య కేవలం 37 మాత్రమే. అలాంటి పరిస్థితుల్లో అవయవాల మార్పిడిలో చైనా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండటం  ఆశ్చర్యకరమైన అంశం. ఓ మెడికల్ స్టూడెంట్ ఓ వ్యక్తి నుంచి 30 నిమిషాల్లోనే ఓ కాలేయం, రెండు కిడ్నీలు ఎలా తీశాడో డాక్యుమెంటరీలో వివరించారు. చైనా అధికారులు మాత్రం తాము అవయవదానం కోసం ముందుకొచ్చిన వారి నుంచే వాటిని సేకరించామని చెప్పినట్టు 'సిడ్నీ మార్గింగ్ హెరాల్డ్' తెలిపింది. 'మరణ శిక్ష పడిన ఖైదీల నుంచే అవసరమైన అవయవాలనుతీసి భద్రపరుస్తాం' అంటూ చైనా ఆరోగ్య మంత్రి జీఫు హుహాంగ్ ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాన్ని డాక్యుమెంటరీ చూపింది. ఈ దారుణాలకు బాధ్యులెవరో, వారిని హేగ్‌లోని అంతర్జాతీయ కోర్టు ముందు నిలబెడతామని మానవ హక్కుల సంఘాల న్యాయవాదులు చెబుతున్నారు.

ఫాలున్ గాంగ్ ఎవరు?
ఆధ్యాత్మిక బోధనలు, యోగా ద్వారా ఈ సంస్థ చైనా ప్రజల్లోకి పాకిపోయింది. 1992లో బహిరంగంగా తమ కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆకట్టుకోగలిగింది.  ప్రజల ఆరోగ్యం కోసం యోగా లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం వల్ల ఆ సంస్థకు చైనా ప్రభుత్వం మద్దతు పలికింది. రానురాను ఆ సంస్థ అనుచరులు దేశంలో ఏడు కోట్లకు చేరుకోవడం, తమ సంస్థకు అధికారిక గుర్తింపు కావాలంటూ వారు వీధుల్లో మౌన ప్రదర్శనలు నిర్వహిస్తుండడంతో, అది బలమైన శక్తిగా ఎదిగే ప్రమాదం ఉందన్న విషయాన్ని చైనా ప్రభుత్వం గ్రహించింది. 2000  సంవత్సరంలో ఆ సంస్థను నిషేధించింది. 2006లో అరెస్టు చేసిన ఆ సంస్థ వేలాది మంది అనుచరులను చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారనే ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.

Advertisement

పోల్

Advertisement