మావోయిస్టులు దాచిన 7,500 కోట్లు ఏమవుతాయి?
రాయ్పూర్: పెద్ద నోట్ల రద్దు కష్టాలు సమాజంలో మార్పు కోసం పోరాడుతున్న మావోయిస్టులకు కూడా తప్పడం లేదని, వారు ఆదివాసీలు, గిరిజనులను పట్టుకొని చెల్లని నోట్లను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసు ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడి మావోయిస్టుల వద్ద డబ్బుంది? ఎంతుంది? వారు ఆ డబ్బును ఎక్కడ దాచారు? అన్న ప్రశ్నలు తలెత్తక మానవు.
చత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల పరిధిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మావోయిస్టుల వద్ద దాదాపు 7,500 కోట్ల రూపాయల డబ్బుందని, పాత 500, 1000 రూపాయల నోట్ల రూపంలో ఉన్న ఆ డబ్బును మావోయిస్టులు ఈ మూడు రాష్ట్రాల పరిధిలోని రెడ్కారిడార్గా పిలిచే దట్టమైన అటవి ప్రాంతంలో భూమిలో దాచారని ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. ఆ డబ్బును మావోయిస్టులు తప్పకుండా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారని, అప్పుడు వారిని పట్టుకోవచ్చనే ఉద్దేశంలో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో అడవిలోకి దారితీసే అన్ని దారుల్లో నిఘా కొనసాగిస్తున్నారు.
గనుల వ్యాపారుల నుంచి, తునికాకు, ఇతర కాంట్రాక్టుల నుంచి వసూళ్లు చేయడం ద్వారా మావోయిస్టులు ఇంత మొత్తాన్ని సమకూర్చుకున్నారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల బలగాలకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మావోయిస్టులు ఇలా ఏటా 140 కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నారని దేశ రక్షణ అధ్యయనం, విశ్లేషణ సంస్థ 2013లో విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది. అయితే ఒక్క చత్తీస్గఢ్ నుంచే వారు ఏటా 1500 కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నారని ప్రత్యేక బలగాలకు చెందిన ఉన్నతాధికారి తెలిపారు.
తమకూ సమాంతర ఆర్థిక వ్యవస్థ ఉందని 2007లో పట్టుబడిన మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడు మిసిర్ బెస్రా వెల్లడించిన విషయం ఇక్కడ గమనార్హం. ఆ తర్వాత 2009లో బీహార్ పోలీసులపై మావోయిస్టులు దాడి జరిపి బెస్రాను విడిపించుకుపోయారు. అటవుల్లో ఎక్కడెక్కడ డబ్బు డంపులు ఉన్నాయో కేంద్ర కమిటీలోని అగ్ర నాయకులకు మాత్రమే తెలుసునని నాటి విచారణలో బెస్రా వెల్లడించారని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మోదీ తీసుకున్న అనూహ్య నిర్ణయం కారణంగా డబ్బు డంపులను వెలికి తీసేందుకు మావోయిస్టు నాయకులు విశ్వాసపాత్రులైన తమ సభ్యులను అక్కడికి పంపిస్తారని పోలీసు బలగాలు కాచుకుకూర్చున్నాయి.