ఎంతెంత దూరం! | When was the step on the red star! | Sakshi
Sakshi News home page

ఎంతెంత దూరం!

Published Sun, Oct 4 2015 3:34 AM | Last Updated on Tue, May 29 2018 12:54 PM

ఎంతెంత దూరం! - Sakshi

ఎంతెంత దూరం!

 అరుణతారపై అడుగు పడేదెపుడు!
 
 ఉందా... లేదా? అన్న సందేహాలకు తావులేదిప్పుడు! అరుణగ్రహం నేలగర్భంలోనే కాదు... పైనా రూఢిగా నీరుంది! అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఇటీవలి ప్రకటనతో... దశాబ్దాల శషభిషలకు తెరపడినట్లే. అయితే ఇంకెందుకు ఆలస్యం..? తట్టాబుట్టా సర్దేసుకుని ఛలో మార్స్ అనేద్దామా? ఊహూ అస్సలు సాధ్యం కాదు. నీరు ఉంటే జీవం ఉన్నట్టేనా? ఈ  ప్రశ్నకు సమాధానం దొరికితే... ఎప్పటికైనా మనిషి అంగారకుడిపై నివాసం ఏర్పరచుకోగలడా? ఇప్పుడున్న సాంకేతికత ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు పనికొస్తుందా? అన్నీ సవ్యంగా జరిగి ఆ గ్రహాన్ని చేరుకున్నా... అక్కడ మనిషి ఏం తినాలి? నివాసం ఎలా? ఇవన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలే... తీరని సందేహాలే! కానీ మానవ మేథస్సు సాధించిన అద్భుతాలతో పోలిస్తే... ఇదికూడా సాధ్యమే అనిపిస్తుంది! ఎంత కాలానికి అన్నది మాత్రం... ఇప్పటికైతే శేష ప్రశ్నే!!!
 
 40 ప్రయోగాలు
 1960 నుంచి గత ఏడాది సెప్టెంబర్ నాటికి అంగారకుడిపైకి మొత్తం 40 అంతరిక్ష ప్రయోగాలు జరగ్గా కేవలం 18 మాత్రమే విజయవంతమయ్యాయి. 2012లో క్యూరియాసిటీ, గత ఏడాది భారత్ ప్రయోగించిన మామ్, అమెరికా ప్రయోగించిన మావెన్ తాజాగా అరుణగ్రహం చేరిన అంతరిక్ష నౌకలు.
 1. వికింగ్-1, వికింగ్-2: అరుణ గ్రహంపై దిగిన తొలి రెండు వ్యోమనౌకలు. నాసా వీటిని తయారుచేసింది. 1975 ఆగస్ట్ 20న వికింగ్-1, సెప్టెంబర్ 9న వికింగ్-2లను ప్రయోగించారు.
 2. సోజర్నర్: నాసా ప్రయోగించిన మార్స్ పాథ్‌ఫైండర్ రోవర్ ఇది. 1997 జూలై 4న దీనిని ప్రయోగించారు. సురక్షితంగా గ్రహంపై దిగి సమాచారాన్ని భూమిపైకి చేరవేసింది.
 3. స్పిరిట్, ఆపర్చునిటీ: నాసా 2003 జూన్ 10న స్పిరిట్ రోవర్‌ను, జూలై 7న ఆపర్చునిటీ రోవర్‌ను ప్రయోగించింది. రెండూ గ్రహంపై దిగి పరిశోధనలు చేపట్టాయి. ఆపర్చునిటీ ప్రస్తుతం పనిచేస్తోంది.
 4. ఫీనిక్స్: నాసా శాస్త్రవేత్తలు 2007 ఆగస్ట్ 4న దీనిని ప్రయోగించారు. గ్రహంపై దిగాక చిన్నపాటి త్రవ్వకాలు చేపట్టింది. ప్రధానంగా నీటి జాడ తెలుసుకునేందుకు, సూక్ష్మజీవులకు అనువైన వాతావరణం ఉందా లేదా తెలుసుకునేందుకు దీనిని పంపించారు.
 5. క్యూరియాసిటీ రోవర్: తాజాగా 2011, నవంబర్ 26న నాసా దీనిని ప్రయోగించింది. మనిషి జీవించేందుకు వీలైన వాతావరణం జాడ కనుక్కునేందుకు దీనిని పంపించారు. గాలా లోయ ప్రాంతంలో ఇది ల్యాండ్ అయింది.
 
 ఎన్నెన్నో ప్రయత్నాలు....
 నాసాతోపాటు కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా అంగారకుడిని జయించేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. 2030 నాటికి అరుణ గ్రహంపైకి మానవుడిని పంపాలన్న ప్రణాళికతో నాసా పనిచేస్తోంది. ఇప్పటికే అరుణగ్రహంపై ఉన్న క్యూరియాసిటీ రోవర్‌కు తోడుగా వచ్చే ఏడాది ఇన్‌సైట్ పేరుతో మరో రోవర్‌ను పంపనుంది. ఈ రెండు రోవర్లు గ్రహపు జియాలజీపై అధ్యయనం చేయనున్నాయి. దీంట్లో ఉండే ఓ థర్మామీటర్ అక్కడి నేలగర్భం ఉష్ణోగ్రత వివరాలు సేకరించనుంది. అక్కడ భూకంపాలు సంభవిస్తూంటాయా? అరుణగ్రహపు మట్టిలో ఆక్సిజన్ ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం జరుగుతుంది.

ఆ తరువాత 2020లో పంపే రోవర్‌తో అక్కడి వాతావరణం, ఖనిజాల మేళవింపులపై మరిన్ని పరిశోధనలు జరపనుంది. అదే ఏడాది ఓ గ్రహశకలంపైకి మానవుడిని పంపనుంది. ఈ ప్రయోగాల ఫలితాలనుబట్టి 2030 నాటికి అంగారకుడిపైకి తొలి మానవుడిని పంపాలని నాసా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మధ్యకాలంలో అరుణగ్రహంపై కూడు, గూడు వంటి ప్రశ్నలకూ సమాధానం వెతికేందుకు నాసా కొన్ని వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో హవాయిలోని అగ్నిపర్వత ప్రాంతం వద్ద ఇలాంటి ఓ ప్రయోగం మొదలైంది కూడా. నలుగురు అమెరికన్లు, ఫ్రెంచ్, జర్మనీ దేశస్తులు ఇద్దరు ఓ కృత్రిమ నిర్మాణంలో ఏడాదిపాటు ఒంటరిగా గడపనున్నారు.

సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాల్లో మనిషి మానసిక పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని అంచనా. అంతేకాకుండా.. నలుగురు వ్యోమగాములను గ్రహాంతరాళాలకు మోసుకెళ్లేందుకు వీలుగా నాసా ఓరియన్ పేరుతో సరికొత్త అంతరిక్ష నౌకను సిద్ధం చేస్తోంది. రష్యన్ అంతరిక్ష నౌక సోయుజ్ తరహాలో ఉండే ఓరియన్‌ను మళ్లీమళ్లీ వాడుకునే అవకాశముంటుంది. 2021 నాటికి నిర్మాణం పూర్తి చేసి ముందుగా గ్రహశకలంపైకి, ఆ తరువాత అంగారకుడిపైకి మనిషిని పంపేందుకు దీన్ని ఉపయోగించుకోవాలని నాసా యోచిస్తోంది.
 
 తొలి అడుగు మాత్రమే...

 సుదూర భవిష్యత్తులోనైనా అంగారకుడిని చేరుకోవాలన్న మనిషి లక్ష్యం సాకారమయ్యేందుకు నీటిజాడ స్పష్టం తొలి అడుగు మాత్రమే. నాసా ఇటీవలి ప్రకటన కూడా తాము నేరుగా నీరున్నట్లు చెప్పడం లేదు. ఇటీవలి కాలంలో నీటిలో మునిగిన లవణాలను పెద్దమోతాదులో గుర్తించాము అని మాత్రమే చెబుతోంది. రెంటికీ చాలా తేడా ఉంది. మనిషి మనుగడకు అత్యంత కీలకమైన అంశం నీరన్నది మనకు తెలిసిందే. అంగారకుడిపై నీరు ఉంది అని స్పష్టంగా తెలిసినా? ఎంత మోతాదులో ఉంది? మనం ఉపయోగించుకునేందుకు అనువుగానే ఉంటుందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోకుండా అక్కడ అడుగుపెట్టడం వీలుకాదు.

మరెన్నో చిక్కుముడులూ వీడిపోవాలి. గతంలో ఎప్పుడైనా అక్కడ జీవం మనగలిగిందా? అన్న ప్రశ్నకు సమాధానం లభించాలి. ప్రస్తుతం అక్కడ ఏ రూపంలోనైనా జీవం ఉందా? అన్నదీ తేలాలి. దీంతోపాటు అక్కడి వాతావరణ పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవడమెలా? అన్నింటికంటే ముఖ్యంగా 14 కోట్ల మైళ్ల దూరాన్ని వీలైనంత వేగంగా అధిగమించేందుకు అవసరమైన అత్యాధునిక అంతరిక్ష నౌకను తయారు చేసుకోవడమూ ముఖ్యమే అవుతుంది. నిజమే... ఇవన్నీ సవాళ్లే మరి మనమేం చేస్తున్నాం? అన్న ప్రశ్న వేసుకుంటే...
 
 సరిగ్గా వారం రోజుల క్రితం అమెరికా అంతరిక్షఛ పరిశోధన సంస్థ (నాసా) నీటి ప్రవాహాలు ఉన్నట్లు ప్రకటించింది మొదలు ప్రపంచవ్యాప్తంగా అరుణ గ్రహం మరోసారి చర్చల్లో నిలిచింది. నిజానికి ఈ గ్రహంపై ఆసక్తి కొత్తదేమీ కాదు. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి అటు సోవియట్ యూనియన్, ఇటు అగ్రరాజ్యం అమెరికాలు పోటాపోటీగా ఉపగ్రహాలను పంపుతూనే ఉన్నాయి. కొత్తకొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాయి. ఈ ఆసక్తికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. కొన్ని లక్షల ఏళ్ల క్రితం ఆ గ్రహంపై జీవం ఉండేదన్న ప్రాథమిక అంచనాలు ఒక కారణమైతే... మనుగడకు భూమి తరువాత మానవాళికి ఇదే మరో ప్రత్యామ్నాయమన్న వాదన మరో కారణం.
 
 వాతావరణ మార్పులిలా..
 ముందుగా చెప్పుకున్నట్లు అంగారకుడిపై మనిషి ఆవాసం అంత సులభమైన విషయమేమీ కాదు. అక్కడికి చేరుకోవడం ఓ మహా ప్రయత్నమైతే... అక్కడి వాతావరణాన్ని జయించి నివాసం ఉండటమూ అంతే కష్టసాధ్యం. ఎందుకంటే అక్కడి భూమి మాదిరిగా అక్కడి గాలిలో ఆక్సిజన్ ఎక్కువ ఉండదు. దాదాపు 95 శాతం బొగ్గుపులుసు వాయువే. పైగా అక్కడి ఉష్ణోగ్రతలూ మనిషి నివసించేందుకు ఏ మాత్రం సహకరించేవి కావు. ఈ నేపథ్యంలో మనిషి అక్కడ నివసించేందుకు దశలవారీగా అక్కడి వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా అక్కడున్న నీటిని వెలికితీయాల్సి ఉంటుంది.

ధ్రువప్రాంతాల్లో పొడిమంచు రూపంలో ఉన్న నీటిని ద్రవంగా మార్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడి నేలలో దాదాపు 60 శాతం హెచ్2ఓ అదేనండి... మంచినీరు అని అంచనా. ఈ నీటినీ పిండుకోగలిగితే.... మనిషికి ప్రాణవాయువుతోపాటు హైడ్రోజన్ రూపంలో ఇంధనమూ లభిస్తుంది. ఈ ఆలోచనలేవీ పనిచేయకపోతే వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మరో ఐడియాతో సిద్ధంగా ఉన్నారు. అక్కడి వాతావరణంలో నుంచి నీటిని సిద్ధం చేయగల రియాక్టర్ ఒకదాన్ని వీరు సిద్ధం చేశారు. ఇది బొగ్గుపులుసు వాయువు నుంచి ఆక్సిజన్‌న్‌ను వేరు చేస్తుంది.

 వేడెక్కించడం...
 అంటార్కిటికా కంటే తక్కువ ఉష్ణోగ్రతలుండే అంగారకుడిపై మనిషి బతకలాంటే గ్రహం మొత్తాన్నిగానీ, మానవ ఆవాసాలు ఏర్పరచుకోవాలనుకుంటున్న ప్రాంతాలను గానీ వెచ్చపెట్టుకోవడం తప్పనిసరి. ఇందుకోసం రకరకాల పద్ధతులను అవలంబించవచ్చు. సూర్యకిరణాలను భారీసైజు అద్దాల ద్వారా నేలపై ప్రతిబింబింపజేయడం వీటిల్లో ఒకటి. హైడ్రోజన్ లాంటి ఇంధనాలను మండించడం మరో పద్ధతి. ఏదోవిధంగా అక్కడి ఉష్ణోగ్రతలు పెరిగేలా చేయగలిగితే అప్పటివరకూ శీతల ఉష్ణోగ్రతలతో గడ్డకట్టిపోయి ఉన్న రసాయన వాయువులు విడుదలవుతాయి. ఫలితంగా భూ వాతవరణం కంటే చాలా పలుచగా ఉండే అక్కడి వాతావరణం మారిపోతుంది. పెరిగిన ఉష్ణోగ్రతలు బయటకు పోకుండా వాతావరణంలోని 95 శాతం బొగ్గుపులుసు వాయువు నిరోధిస్తుంది.
 
 త్రీడీ ప్రింటింగ్‌తో ఇళ్లు..
 అంగారకుడిపై మానవ ఆవాసం కోసం శాస్త్రవేత్తలు ఇప్పటికే కొన్ని ఆలోచనలు చేశారు. అక్కడి రేడియో ధార్మికతను దృష్టిలో ఉంచుకుంటే నేలగర్భంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం మేలన్న అంచనాలున్నాయి. మరోవైపు ఇటీవలి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో అక్కడికక్కడే నివాస సముదాయాలను ఏర్పరచుకోవచ్చునని కొందరు భావిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా అక్కడి మట్టి, ఇతర వనరులను వాడుకుంటూ నిర్మాణాలు చేపట్టవచ్చునని, అన్నీ భూమి నుంచి మోసుకెళ్లే అవసరం ఉండదని అంచనా. ఈ నేపథ్యంలో నాసా అంగారకుడిపై త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్లు ఎలా నిర్మించవచ్చో చూపండి అంటూ ఇటీవల ఒక పోటీ పెట్టింది. ఫొటోలో కనిపిస్తున్నది ఈ పోటీలో నెగ్గిన ఓ మోడల్. ప్లాస్టిక్, నీటితోపాటు అత్యంత తేలికైన పదార్థం ఏరోజెల్‌ల సాయంతో దీన్ని నిర్మిస్తామని దీన్ని తయారుచేసిన ఐస్‌హౌస్ సంస్థ తెలిపింది.
 
 అణుబాంబు వేస్తే సరి...
 అంగారకుడిని మానవ ఆవాసానికి వీలుగా మార్చేందుకు ఎలన్ మస్క్ ఓ వినూత్నమైన ఆలోచనను ప్రతిపాదించారు. అమెరికాలోని టెస్లా ఎలక్ట్రిక్ మోటర్స్ అధినేత అయిన మస్క్ నాసా కోసం అంతరిక్ష నౌకలను తయారు చేస్తున్నారు కూడా. మనిషి వీలైనంత త్వరగా అంగారకుడిపై ఓ కాలనీ ఏర్పాటు చేసుకోవాలని గట్టిగా ప్రచారం చేస్తున్న మస్క్ అందుకు తగిన ప్రణాళిక కూడా తన వద్ద ఉందని అంటున్నారు. అక్కడి వాతావరణాన్ని మనకు అనుకూలమైందిగా మార్చేందుకు అణుబాంబులను మించిన దగ్గరి మార్గం లేదని ఆయన గత ఏడాది ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే ఈ అణుబాంబులను అక్కడి నేలపై కాకుండా ధ్రువప్రాంతాల వద్ద గాల్లో కేవలం రెండు మూడు సెకన్లపాటు పేలేలా చేస్తే చాలని ఇటీవలే ఓ వివరణ కూడా ఇచ్చారు. సౌరకుటుంబంలో అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్ మన సూర్యుడేనన్నది అందరికీ తెలిసిందేనని, దీని మాదిరిగానే అంగారకుడి ధ్రువ ప్రాంతాల్లో రెండు మినీ సూర్యుళ్లను సృష్టించి సెకన్లపాటు పనిచేయించగలిగితే ఆ గ్రహం క్రమేపీ వెచ్చబడుతుందని ఆయన అంటున్నారు.
 
 భూమితో దగ్గరి పోలికలు..
 ►భూమిపై ఒక రోజులో 23 గంటల 56 నిమిషాలు ఉంటే అరుణగ్రహంపై ఇది మరో 43 నిమిషాల 35 సెకన్లు ఎక్కువ.
 ►భూమి ఆక్సియల్ టిల్ట్ 23.44 డిగ్రీలు కాగా...  అంగారకుడిది 25.19 డిగ్రీలు మాత్రమే. ఈ ఒంపు భూమిపై రుతువులు ఏర్పడేందుకు కారణమన్నది తెలిసిందే.
 ►సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగేందుకు భూమికి 365 రోజులు పడితే అంగారకుడికి దాదాపు రెట్టింపు సమయం పడుతుంది. కచ్చితంగా చెప్పాలంటే ఆ గ్రహంపై ఒక ఏడాది 1.88 భూమి సంవత్సరాలకు సమానం.
 ►అంగారక గ్రహ వ్యాసార్థం భూమి కంటే సగం తక్కువ.

 తేడాలూ ఉన్నాయి...
 ►అరుణగ్రహపు గురుత్వాకర్షణ శక్తి భూమిలో మూడో వంతు కంటే కొంచెం ఎక్కువ మాత్రమే.
 ►భూమి కంటే మార్స్‌పై ఉష్ణోగ్రతలు చాలా తక్కువ. అక్కడి సగటు ఉష్ణోగ్రత - 87 డిగ్రీ సెల్సియస్‌ల నుంచి - 5 డిగ్రీ సెల్సియస్‌ల మధ్య ఉంటుంది. ఇంకోలా చెప్పాలంటే అంటార్కిటికాలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత (- 93 డిగ్రీ సెల్సియస్) ఉంటుందన్నమాట.
 ►అరుణ గ్రహ ఉపరితలంపై కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే నీరు ఏర్పడుతుంది. నదులు, చెరువులు, సముద్రాల వంటివి లేవన్నమాట!
 ►సూర్యుడి నుంచి మనకంటే ఎక్కువ దూరంలో ఉండటం వల్ల అక్కడికి అందే సౌరశక్తి మోతాదు కూడా 43 శాతం వరకూ తక్కువ.
 ►ఏడాది పొడవునా చెలరేగే ధూళి తుపానుల కారణంగా అంగారకుడిపై కొన్ని వారాలపాటు సూర్యుడు సైతం కనిపించని పరిస్థితులు ఉంటాయి.
 ►భూమి మాదిరిగా అయస్కాంతక్షేత్రం ఏదీ లేకపోవడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకర అతినీలలోహిత, పరారుణ కిరణాలు నేరుగా అరుణగ్రహాన్ని తాకుతాయి.
 ►వాతావరణ పీడనం ఆర్మ్‌స్ట్రాంగ్ లిమిట్ కంటే చాలా తక్కువ. అందువల్ల అక్కడ కట్టే నివాస సముదాయాలు కృత్రిమ పీడనంతో కూడి ఉండాలి.
 ►అంగారకుడి గాలిలో ఉండే ఆక్సిజన్ మోతాదు 0.4 శాతం కంటే తక్కువ. దాదాపు 95 శాతం కార్బన్ డై ఆకై ్సడ్, 3 శాతం నైట్రోజెన్, 1.6 శాతం ఆర్గన్‌లు ఉంటాయి.
 
 అతిపెద్ద పర్వతం...
 మౌంట్ ఎవరెస్ట్ దాదాపు 8000 మీటర్ల ఎత్తుంటుందని అంటే... మనం అబ్బో ఎంత ఎత్తో అనుకుంటాం. మరి అంగారకుడిపై ఉండే ఓలింపస్ మూన్ గురించి వింటే ముక్కన వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే దాదాపు 21 కిలోమీటర్ల ఎత్తు, 600 కిలోమీటర్ల వ్యాసముండే ఈ పర్వతం సౌరకుటుంబం మొత్తమ్మీద అతిపెద్ద పర్వతం మరి!

 నీరున్నా ముట్టుకోలేరు...
 అంగారకుడిపై నీరు ఉన్నట్లు స్పష్టంగా తెలి సినా... నాసా గానీ మరే ఇతర సంస్థ గానీ ఆ నీరున్న ప్రాంతం దగ్గరకు కూడా వెళ్లలేదు తెలుసా? ఎందుకంటా రా? 1957లో ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం దీనికి కారణం. ఔటర్ స్పేస్ ట్రీటీ అని పిలిచే ఈ ఒప్పందానికి ప్రపంచదేశాలన్నీ ఆమోదిం చాయి. దీని ప్రకారం.. ఏ దేశం, సంస్థ కూడా చంద్రుడితోపాటు ఇతర గ్రహాలపై నీటి వనరులన్న ప్రాంతంలో ఎలాంటి పరిశోధనలు చేపట్టకూడదు.

భూమి నుంచి ఆయా గ్రహాలకు చేరిన సూక్ష్మజీ వులు నీటిని కలుషితం చేయకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు. అంగారకుడి విషయాన్నే తీసుకుంటే అమెరికా కొన్నేళ్ల క్రితమే అక్కడికి క్యూరియాసిటీ రోవర్‌ను పంపింది. నీరున్న ప్రాంతానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ శోధక నౌక అక్కడికి మా త్రం వెళ్లదు. కోటానుకోట్ల మైళ్ల ప్రయాణంలో ఏదైనా తెలియని సూక్ష్మజీవి  క్యూరియాసిటీకి అంటుకుని ఉంటే అది నీటిని కలుషితం చేస్తుందన్న అనుమానంతో ఈ జాగ్రత్త తీసుకున్నారు.
 - గిళియార్ గోపాలకృష్ణమయ్యా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement