ప్రపంచ నగరాలు విస్తరించిన వైనం
న్యూయార్క్: ప్రపంచంలో తొట్టతొలి నగరం ఏదీ? ఎక్కడ పుట్టింది. ఆ తర్వాత నగరాలు ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించాయి? అన్న అంశాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ ఆరువేల సంవత్సరాల్లోనే అంటే, క్రీస్తు పూర్వం 3,700 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 2,000 సంవత్సరం మధ్య ప్రపంచవ్యాప్తంగా నగరాలు విస్తరించాయంటూ శాస్త్రవేత్తలు సూత్రీకరించి మ్యాపింగ్ కూడా చేశారు.
ప్రపంచ నగరాల విస్తరణపై తాజాగా జరిపిన అధ్యయన వివరాల ఆధారంగా ‘మ్యాక్స్ గాల్కా’ బ్లాగర్ డిజిటల్ ద్వారా వీడియో మ్యాపింగ్‌ను రూపొందించారు. ప్రాచీన మెసపటోనియా నాగరికతకు చెందిన సుమరియన్లు నివసించిన ‘ఇరిదు’, దాని పక్కనే ఉన్న ‘ఉరుక్’ నగరాలను ప్రపంచంలోనే తొలి నగరాలుగా పిలుస్తారు. ఉరుక్ తొలి నగరం అని చెప్పడానికి డాక్యుమెంట్ ఆధారాలు ఉన్నాయని, అంతకుముందే ఇరిదు నగరం ఉన్నట్లు కూడా చారిత్రక ఆధారాలు ఉన్నప్పటికీ అది నగరం స్థాయికి ఎదగలేదనే వాదన ఉండేది. అయితే శాస్త్రవేత్తలు తాజా అధ్యయంలో ప్రపంచ తొలి నగరంగా ఇరిదుకే ఓటేశారు.
నగరం అంటే ఏమిటీ
భారత్ లాంటి దేశాల్లో పట్టణాలని పిలిచే వాటిని తొలినాళ్లలో నగరాలని పిలిచేవారు. ఎల్తైన భవనాలుండడమే కాకుండా, జనాభాతోపాటు జన సాంద్రత ఎక్కువ ఉండి, పారిశుద్ధ్య సౌకర్యాలు, పాలనా వ్యవస్థలు, ప్రజలందరికి వర్తించే చట్టం అమల్లో ఉన్న పెద్ద గ్రామాలను నగరాలని పిలుస్తారు. ప్రపంచంలో బిబ్లోస్, జెరిచో, డమస్కస్, అలెప్పో, జెరూసలెం, సిడాన్, ల్యూయాంగ్, ఏథెన్స్, ఆర్గోస్, వర్సాని తొలినాళ్లలో ఏర్పడిన నగరాలు. తొలినాళ్లలో మెసపటోమియా, నైలునది పరిసర ప్రాంతాలకే నగరాలు పరిమితమయ్యాయి.
ఆ తర్వాత నగరాలు క్రమంగా చైనాకు, భారత్‌కు, లాటిన్ అమెరికా ప్రాంతాలకు విస్తరిస్తూ పోయాయి. 19వ శతాబ్దానికి పట్టణీకరణ అన్నది ప్రపంచీకరణగా మారిపోయింది.