
జయలలిత వారసులు ఎవరు?
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో చేరి పక్షం రోజులు గడచిపోవడం, ఆమె అనారోగ్య పరిస్థితిపై ఊహాగానాలు తీవ్రం కావడంతో ఆమె రాజకీయ వారసులు ఎవరనే విషయమై ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. ఏఐఏడిఎంకే వ్యవస్థాపక నాయకుడు ఎంజీ రామచంద్రన్ చనిపోయాక 1989లో పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి జయలలిత ఎదురులేని నాయకురాలిగా ఏక ఛత్రాధిపత్యంతో పార్టీని నడుపుతూ వచ్చారు. తన ముందు సాగిలపడే కార్యకర్తలకు అమ్మగా, ఓ దేవతగా పూజలందుకుంటూ పాలన సాగించిన ఆమె తనకు ప్రత్యామ్నాయంగా రెండో స్థానంలో ఎవరిని ఎదగనీయలేదు.
జయలలితకు వారుసులు ఎవరనే అంశం ఇప్పుడే కొత్తగా చర్చకు రాలేదు. 18 ఏళ్ల అవినీతి కేసులో ఆమెకు కోర్టు నాలుగేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ 2014లో తీర్పు చెప్పడం, పర్యవసానంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో మొదటిసారి చర్చకు వచ్చింది. అప్పుడు ఆమె తన ముందు అస్తమానం సాగిలపడి నమస్కారం చేసే పరమ విధేయుడు ఓ. పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారు. ఆమె తరఫున బాధ్యతలు స్వీకరించిన ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలోకి కూడా అడుగుపెట్టకుండా తన మంత్రిత్వ కార్యాలయం నుంచే విధులు నిర్వహించారు. 2015లో జయలలితపై అవినీతి ఆరోపణలను పైకోర్టు కొట్టివేయడంతో పన్నీరు సెల్లం సీఎం కుర్చీ తక్షణమే ఖాళీచేసి మళ్లీ అమ్మకు అప్పగించారు. ఇప్పుడు కూడా అమ్మ వారసురాలని అమ్మనే నిర్ణయించాలి.
దేశంలో ఏకఛత్రాధిపత్యంగా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నవారు జయలలిత ఒక్కరే కాదు. వన్ విమెన్, వన్ మేన్ పార్టీలు అనేకం ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌లో మమతా బెనర్జీ, బహుజన సమాజ్ పార్టీలో మాయావతి, బిజూ జనతాదళ్‌లో నవీన్ పట్నాయక్‌లు ఆ కోవకు చెందిన వారే. మూడుసార్లు పార్టీని విజయపథంలో నడిపించిన నవీన్ పట్నాయక్ కూడా పలుసార్లు అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. ఆయన మేనల్లుడు అరుణ్ పట్నాయక్ ఆయనకు రాజకీయ వారసుడు అవుతారని ఊహాగానాలు చెలరేగాయి. అయితే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని 2015లో ఆయనే స్వయంగా ప్రకటించడంతో ఊహాగానాలకు తెరపడింది.
మాయావతి 2008లో ఒకసారి తన వారసుడి గురించి మాట్లాడారు. తనను ఎవరో హత్య చేయడానికి కుట్ర పన్నారని, తన తర్వాత వారసుడెవరో తాను ఎంపిక చేశానని చెప్పారు. ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఆమె తన వారసుడి పెరును వెల్లడించలేదు. తృణమూల్ యువ విభాగానికి అధ్యక్షులుగా తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని 2011లో మమతా బెనర్జీ నియమించడంతో ఆమె వారసుడు ఆయనే అవుతారని పార్టీలో పలువురు భావించారు. 2014లో లోక్‌సభకు పోటీ చేసి గెలిచిన 29 ఏళ్ల అభిషేక్ బెనర్జీనే ఆమె వారసుడిని వారు ఇప్పటికీ అనుకుంటున్నారు. అయితే ఆయనకు ఇంకా రాజకీయ పరిణతి రాలేదని పార్టీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు.
సమాజ్‌వాది పార్టీలో ములాయం సింగ్ యాదవ్‌కు కుమారుడు అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ పార్టీలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌కు కుమారుడు సుఖ్‌బీర్ బాదల్, నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఫరూక్ అబ్దుల్లాకు కుమారుడు ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలో దివంగత నేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్‌కు మెహబూబా ముఫ్తీ వారసులుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. జనతాదళ్ (సెక్యులర్) పార్టీలో దేవెగౌడ, మహారాష్ట్ర శివసేనలో థాకరే కుటుంబ వారసులు కొనసాగుతున్నారు. ఇక దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబమే పార్టీకి వారసులనే విషయం తెల్సిందే.