కేరళ నుంచి దుబాయ్ కు బయల్దేరి వెళ్లిన బోయింగ్-777ఎమిరేట్స్ విమానం ఎలా క్రాష్ అయిందో పైలట్లు వివరించారు. పైలట్లు ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను పై అధికారులకు అందించారు. రిపోర్టులో పైలట్లు ఇచ్చిన సమాచారం మేరకు.. గాలి వేగం ఎక్కువగా ఉండటంతో విమానం రన్ వేపై దిగడం కష్టమని పైలట్లకు అర్ధమైంది. ఎంచుకున్న స్పాట్ లో విమానాన్ని రన్ వే మీద ల్యాండ్ చేయలేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువని ముందే గుర్తించారు. దీంతో పైలట్లు విమానాన్ని ల్యాండ్ చేయకూడదని భావించారు.
ఇదే సమయంలో ఒక్కసారిగా గాలి వీచే వాలు మారింది. అయితే విమానానికి ఉన్న సిస్టంలు దీన్ని గుర్తించలేకపోయాయి. దాంతో గాలిలోనే చక్కర్లు కొట్టాలనే నిర్ణయం వర్క్ అవుతున్నట్లు పైలట్లు భావించారు. మొదట్లో విమానం ఎత్తుకు వెళ్తున్నట్లు కనిపించినా గాలివాలు విపరీతంగా పెరిగిపోవడంతో అదుపుతప్పే ప్రమాదం ఏర్పడింది. ఎమర్జెన్సీ కండిషన్ ను హ్యాండిల్ చేసేందుకు వారు ప్రయత్నించే లోపే విమానం ఒక్కసారిగా ఎత్తు నుంచి కిందకు పడిపోవడం ప్రారంభమైంది.
విమానాన్ని ల్యాండ్ చేసే లోపే రన్ వేను ఢీ కొన్నట్లు పైలట్లు పేర్కొన్నారు. గాలి కారణంగా ల్యాండింగ్ ను ఆపే పైలట్లు కచ్చితంగా రెండు ఇంజన్లను ఫుల్ పవర్ తో నడిపితేనే విమానం తిరిగి గాల్లోకి ఎగురుతుందని బోయింగ్-777 కమాండర్ ఒకరు తెలిపారు. ఎమిరేట్స్ విమానాన్ని ఫుల్ పవర్ తో ఆపరేట్ చేసిన దాఖలాలేవి కనిపించడం లేదని అన్నారు. ఇంజన్లు ఫుల్ పవర్ అందుకోవడానికి 8 సెకన్ల సమయం పడుతుందని అంతలోనే దుర్ఘటన జరిగిపోయిందని తెలిపారు.