
భర్తను హత్య చేసి శవంతో రెండు రోజులు..
►రోజూ తాగి వచ్చి కొడుతుండటంతో భరించలేక హత్య
►గుండెపోటు వచ్చిందని చుట్టుపక్కల వారిని నమ్మించే యత్నం
►అనుమానంతో పోలీసులకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి
న్యూఢిల్లీ: పైసా సంపాదించకపోగా తన సంపాదనతో తాగి తననే కొడుతున్న భర్త దుశ్చర్యలను భరించలేక ఓ భార్య అతన్ని హతమార్చింది. అయితే శవాన్ని ఏం చేయాలో తెలియక గదిలో దాచిపెట్టి రెండురోజులు గడిపింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని కాపస్ హేడాలో గురువారం వెలుగు చూసింది. కానీ అంతిమ సంస్కారాల సమయంలో ఓ వ్యక్తికి అనుమానమొచ్చి పోలీసులకు ఫోన్ చేయడంతో అసలు విషయం బయటపడింది.
పోలీసుల ఎదుట ఆమె తన నేరాన్ని అంగీకరించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మిడ్నాపూర్‌కు చెందిన శిల్పి అధికారి(32) రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్‌లో ఊడ్చే పని చేసేది. ఆమెకు భర్త నితీశ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే తన భర్త తన సంపాదనతో తాగి వచ్చి కొడుతూ పిల్లలను చదువుకోనివ్వకపోవడంతో వారిని స్వగ్రామంలోనే ఉంచి చదివించేది.
శిల్పి భర్త రోజు తాగి వచ్చి చితకబాదేవాడు. కొట్టిన అనంతరం అలసిపోయి పడుకునేవాడు. చంపేస్తానని బెదిరించినా అతను మారకపోవడంతో చంపేయాలని నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి తన భర్తకు బాగా తాగించి మత్తులో నిద్రపోయిన తర్వాత గొంతు నులిమి చంపేసింది. భర్త చనిపోయిన తర్వాత ఆ శవాన్ని ఏం చేయాలో తెలియక రెండు రోజులు బయటకు రాకుండా గదిలో భర్త శవంతో గడిపింది.
కమిలిన గుర్తులతో అనుమానం..
సోమవారం ఉదయం ఇంటి ముందు కూర్చుని భర్త గుండెపోటుతో చనిపోయాడంటూ శిల్పి ఏడ్వడం ప్రారంభించింది. ఇరుగు పొరుగు వారికి కూడా ఆమెపై అనుమానం రాలేదు. సానుభూతితో వారు ఆమె భర్త అంత్య క్రియలకు తలో చేయివేశారు. శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఓ వ్యక్తికి అనుమానం వచ్చింది. శవం నుంచి దుర్వాసన రావడం, గొంతుపై కమిలిన గుర్తులు ఉండటం చూసి అతను చాటుగా వెళ్లి పోలీసులకు ఫోన్ చేవాడు.
శవాన్ని చితిపై ఉంచి అంటించబోతుండగా పోలీసులు రంగప్రవేశం చేసి శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు పంపారు. పోలీసులు శిల్పను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. గొంతు నులిమి రెండు రోజుల కింద చంపినట్లు పోస్ట్‌మార్టంలో తేలింది. శిల్పి కూడా పోలీసుల ఎదుట తన నేరాన్ని అంగీకరించింది. పోలీసులు జరిపించిన వైద్య పరీక్షలలో భర్త ఆమెను కొట్టిన విషయం కూడా రుజువైంది.