సర్కారు భూదాహానికి రైతులు బలి
- ప్రభుత్వ భూవ్యాపారంతో పెరుగుతున్న ఆత్మహత్యలు
- భోగాపురం ఎయిర్‌పోర్టు పరిధిలో ఇద్దరు ఆత్మహత్య
- గుండెపోటుతో మరో ఇద్దరు మృతి
- వీధిన పడుతున్న కుటుంబాలు
- భూసేకరణ వెనుక చంద్రబాబు స్వలాభమే ఎక్కువని విమర్శలు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వ భూదాహం రాష్ట్రంలో మరణమృదంగం సృష్టిస్తోంది. విమానాశ్రయాలు, పోర్టుల పేరు చెప్పి అవసరానికి మించి భారీగా భూములు లాక్కునేందుకు సర్కారు ఎత్తులు వేస్తుండటంతో పేద రైతులు భయంతో దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబ పెద్దల బలవన్మరణాలతో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా అన్పించడం లేదు. ప్రజాసంక్షేమం లక్ష్యంగా పనిచేయాల్సిన ప్రభుత్వం ఫక్తు రియల్ ఎస్టేట్ సంస్థలా మారి రైతుల భూములతో వ్యాపారానికి తెరలేపింది.
రాజధాని అమరావతి భూ సమీకరణ/సేకరణతో బాబు సర్కారు శ్రీకారం చుట్టిన ‘రియల్ వ్యాపారం’ ఇప్పుడు పోర్టులు, విమానాశ్రయాలకు పాకుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వమే భూములు లాక్కుంటూ రైతుల ఉసురు తీస్తుండటంపై అన్ని రాజకీయపక్షాలతోపాటు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు విమర్శలు చేస్తున్నా సర్కారు తీరు మార్చుకోవడంలేదు. విమానాశ్రయాలు, పోర్టుల పేరిట అవసరానికి మించి రెండు మూడు రెట్లుపైగా భూములను బలవంతంగా రైతుల నుంచి స్వాధీనం చేసుకుని ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టే కుట్ర వెనుక చంద్రబాబు స్వలాభమే అధికమనే విమర్శలు న్నాయి.
ఈ ఆత్మహత్యలకు బాధ్యులెవరు?
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి తాము సమిథలవుతున్నామనే భయంతో ఇప్పటికే నలుగురు యువ రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఎయిర్‌పోర్టుకోసం ప్రభుత్వం బలవంతంగా తమ భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తుంటే ఏమి చేయాలో దిక్కుతోచక బతుకుదెరువు మార్గం తెలియక విజయనగరం జిల్లా గూడెపువలసకు చెందిన పెదకృష్ణమూర్తి (31) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
రావివలసకు చెందిన వెంపాడ రామసూరి (30) ఇదే టెన్షన్‌తో గుండెపోటుతో మరణించారు. ఎయిర్‌పోర్టుకు తమ భూములు లాక్కుంటే ఎలా బతకాలనే మానసిక ఆందోళన, వీధిన పడాల్సి వస్తుందనే భయంతో రామచంద్రపేటకు చెందిన ముక్కాల త్రినాథ్, గూడెపువలసకు చెందిన వెంపాడ సూరి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఇలా భోగాపురం విమనాశ్రయ భూసేకరణ ఆరంభం కాకముందే కొద్దిరోజుల వ్యవధిలోనే నాలుగు ప్రాణాలు బలిగొంది. దీంతో వీరి కుటుంబాలు వీధినపడి విలపిస్తున్నాయి. తమ కుటుంబాల ఉసురు చంద్రబాబుకు తప్పకుండా తగులుతుందని మృతుల సంబంధీకులు శాపనార్థాలు పెడుతున్నారు.