ఆ దాడి చేయించింది.. మహిళా కానిస్టేబుల్!
బీజేపీ సీనియర్ నాయకుడు బ్రిజ్‌పాల్ టియోటియాపై వంద రౌండ్ల కాల్పులు జరిగిన కేసులో.. కీలక నిందితురాలు ఓ మహిళా కానిస్టేబుల్ అని తేలింది. ఆమెను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘజియాబాద్‌లో రాత్రి 7.20 గంటల సమయంలో ఏకే 47 రైఫిళ్లతో దాదాపు వంద రౌండ్లను బ్రిజ్‌పాల్ వాహనంపై కాల్చిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను చికిత్స కోసం నోయిడాలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన కోలుకుంటున్నట్లు సమాచారం. ఈ దాడిలో మరో ఐదుగురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలం నుంచి పోలీసులు దాడికి ఉపయోగించిన వాహనంతో పాటు కొన్ని ఆటోమేటిక్ వెపన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న మహిళా కానిస్టేబుల్ సునీత భర్త.. రాకేష్ హసన్‌పూరియా. అతడు ఓ గ్యాంగ్‌స్టర్. 2003లో పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. తన భర్త మృతికి బ్రిజ్‌పాలే కారణమని సునీత అప్పట్లో ఆరోపించింది. బ్రిజ్‌పాల్ గతంలో ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆ కక్షతోనే ఇప్పుడు ఆయన మీద దాడి చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. 2012లో బ్రిజ్‌పాల్ ఎన్నికల్లో పోటీచేసినపుడు రాకేష్ హసన్‌పురియా కుటుంబం ఆయనను వ్యతిరేకించింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.