
ఫైవ్‌స్టార్ హోటల్లో.. ఫేస్‌బుక్ స్నేహితురాలిపై అత్యాచారం
గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తనకు ఫేస్‌బుక్‌లో పరిచయమైన గృహిణిని ముంబైలో ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు పిలిపించుకుని అక్కడ అత్యాచారం చేశాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మూడేళ్ల క్రితం వీళ్లిద్దరికీ ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. కొన్నాళ్ల తర్వాత ఫోన్ నంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకుని తరచు మాట్లాడుకునేవారు. వాట‍్సప్‌లో కూడా ఇద్దరూ చాట్ చేసుకునేవారని ఓ పోలీసు అధికారి తెలిపారు. తాను ముంబైకి వచ్చానని, ఒకసారి కలుద్దామని అతడు చెప్పడంతో ఆమె సరేనన్నారు. కాఫీ తాగేందుకు ఫైవ్ స్టార్ హోటల్లోని తన గదికి రావాలని పిలిచాడు. తొలుత ఆలీబాగ్‌లోని ఫాంహౌస్‌లో తన కుటుంబంతో కలిసి వారాంతం గడిపేందుకు వచ్చిన ఆమె.. అతడు కాల్ చేయడంతో ముంబైకి వెళ్లారు. అతడిని కలిసిన తర్వాత మళ్లీ అలీబాగ్ వచ్చేయాలని ఆమె అనుకున్నారు.
గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఆమెను కలిసి, అక్కడినుంచి క్యాబ్‌లో హోటల్‌కు తీసుకెళ్లాడు. ముందు మంచినీళ్లు తాగమని ఇచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత తనకు కాస్త మత్తుగా అనిపించిందని, తాను స‍్పృహ తెలిసీ తెలియని స్థితిలో ఉండగా అతడు తనపై అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెలకువ వచ్చిన తర్వాత ఆలీబాగ్ వెళ్లి జరిగిన విషయాన్ని తన భర్తకు తెలిపారు. వెంటనే ఆమె భర్త వ్యాపారవేత్తకు ఫోన్ చేసి గొడవపడ్డారు. వాస్తవానికి మరో రోజు ఉండాల్సిన ఆ వ్యక్తి.. అదేరోజు హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఫోన్ కూడా స్విచాఫ్ చేసేశాడు. భర్తతో కలిసి స్టేషన్‌కు వెళ్లిన బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.