
‘మహిళలు పిల్లలు కనే యంత్రాలు కాదు’
న్యూఢిల్లీ: తాను ఎటువంటి వివాస్పద వ్యాఖ్యలు చేయలేదని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ అన్నారు. మీరట్ సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవాలంటూ ఎన్నికల సంఘం నోటీసు జారీ చేయడంతో ఆయన వివరణ ఇచ్చారు. ఎన్నికల అధికారులను కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. సాధువులు ఏర్పాటు చేసిన సభలో జనాభా నియంత్రణ ఆవశ్యకత గురించి మాట్లాడానని, అది ఎన్నికల ర్యాలీ కాదని తెలిపారు. తాను ఏ వర్గం పేరును ప్రస్తావించలేదని, ఎటువంటి తప్పుడు ప్రకటన చేయలేదని చెప్పారు.
దేశంలో అనేక సమస్యలకు కారణమైన జనాభాను నియత్రించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళలు పిల్లలు కనే యంత్రాలు కాదని స్పష్టం చేశారు. దేశంలో జనాభా పెరగడానికి ఒక వర్గం కారణమంటూ సాక్షి మహరాజ్ వ్యాఖ్యలు చేయడంతో వివాదం రేగింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో ఇటువంటి వివాదస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది.