వరల్డ్ ఫేమస్ వంతెనలు | world famous bridges | Sakshi
Sakshi News home page

వరల్డ్ ఫేమస్ వంతెనలు

Published Fri, Jul 17 2015 2:16 PM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM

వరల్డ్ ఫేమస్ వంతెనలు

వరల్డ్ ఫేమస్ వంతెనలు

రవాణా అవసరాల కోసం మనిషి నిర్మించిన కట్టడం వంతెన. నదులు, రహదారులు, లోయలు... ఇలాంటి భౌతిక అడ్డంకుల్ని అధిగమించేందుకు నిర్దేశించినవి. పొడవైన చెట్లను కాలువ రెండు గట్ల చివరలు ఆనుకొని ఉండేవిధంగా వంతెనలు నిర్మించటం ప్రారంభించిన మానవులు.. క్రమంగా బల్లకట్లు, తాళ్లు, చెక్క, గొలుసు, ఇనుము, కాంక్రీటుతో వారధులను నిర్మించటం నేర్చుకున్నారు.

కాలనుగుణంగా పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత సుందరంగా, ఆకర్షణీయంగా, ద్రుఢంగా సేతువులను నిర్మించే స్థాయికి ఆధునిక మానవుడు ఎదిగాడు. ఇంజినీరింగ్ అద్భుతాలను ఆవిష్కరించే వారధులు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. వాటిలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన, ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే వంతెనల గురించి తెలుసుకుందాం.

టవర్ బ్రిడ్జ్, లండన్
ప్రపంచ ప్రఖ్యాత వంతెనల్లో ఇది ఒకటి. ఇంగ్లండ్ రాజధాని లండన్‌లోని థేమ్స్ నదిపై నిర్మించారు. స్థిరంగా, ఊయలలా ఊగే విధంగా ఈ వారధిని నిర్మించారు. లండన్ టవర్‌కు సమీపంలో ఉండటం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. లండన్ ఐకాన్‌గా పేరుగాంచింది. ఈ సేతువు నిర్మాణం 1886లో ప్రారంభమైంది. నిర్మాణానికి 8 ఏళ్ల సమయం పట్టింది.

గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, శాన్ ఫ్రాన్సిస్కో
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వంతెన ఇది. అమెరికా పశ్చిమతీరంలో ఫసిఫిక్ మహాసముద్రంపై ఉంది. ఎరుపు రంగులో ఉండే ఈ వారధి శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి ప్రధాన ఆకర్షణ. శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని మారిన్  కౌంటితో కలిపే ఈ సేతువు 1,280 మీటర్ల పొడవుంది. ఈ బ్రిడ్జ్‌ను 1937లో ప్రారంభించారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన చిహ్నాల్లో ఒకటిగా ఖ్యాతి గడించింది.

సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్, సిడ్నీ
సిడ్నీ హార్బర్‌పై ఉక్కుతో నిర్మించిన విల్లు వంటి వంతెన. ఆస్ట్రేలియాలో ఉంది. ప్రపంచంలో పొడవైన  వారధుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వంపు వంటి  ఆకారం కారణంగా స్థానికంగా దీన్ని ‘ది కోట్ హ్యాంగర్’ అని పిలుస్తారు. 1932లో ప్రారంభించారు. ఇంగ్లండ్‌కు చెందిన బ్రాడ్‌ఫీల్డ్ అనే కంపెనీ ఈ బ్రిడ్జ్‌ను నిర్మించింది. ప్రపంచంలో ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే వంతెనల్లో ఇది ఒకటి.

రియాల్టో వంతెన, వెనిస్

ఇటలీలోని వెనిస్ నగరంలో ఉంది. వెనిస్‌లోని గ్రాండ్ కెనాల్‌పై నిర్మించిన నాలుగు వంతెనల్లో ఇది పురాతనమైనది. 1591లో దీని నిర్మాణం పూర్తయింది. ఇంతకు ముందు ఈ వంతెన ఉన్నస్థానంలో వుడెన్‌బ్రిడ్జ్ ఉండేది. 1524లో ఆ వంతెన కూలిపోవటంతో రియాల్లో బ్రిడ్జ్‌ను నిర్మించారు. వెనిస్ నగరానికి చిహ్నంగా నిలిచే ఈ వంతెన ఇక్కడి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

బ్రుక్‌లిన్ బ్రిడ్జ్, న్యూయార్క్

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఈస్ట్ నదిపై ఉంది. 1883లో నిర్మించిన ఈ వంతెన అమెరికాలోని సస్పెన్షన్ బ్రిడ్జ్‌లలో కెల్లా  పురాతనమైనది,  మన్‌హట్టన్, బ్రూక్‌లే నగరాలను కలిపే ఈ వారధి  486.3 మీటర్ల పొడవుంది. అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే వంతెనల్లో ఇది ఒకటి.

మిలావు బ్రిడ్జ్, ఫ్రాన్స్
ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెన ఇది. ఫ్రాన్స్‌లోని తారాన్ కమ్యూనిటీకి సమీపంలోని మిలావు నదిపై నిర్మించారు.  కేబుల్ ఆధారిత బ్రిడ్జ్ పొడవు 2460 మీటర్లు. ఈ వారధిని 2004లో ప్రారంభించారు. ఫ్రెంచ్ ఇంజినీర్ మిచెల్ వర్లోగ్స్, బ్రిటిష్ ఆర్కిటెక్ట్ నార్మాన్ ఫోస్టర్ ఈ వంతెనకు రూపకల్పన చేశారు. ప్రపంచ ఇంజినీరింగ్ అద్భుతంగా ఈ బ్రిడ్జ్‌ను పేర్కొంటారు.

చార్లెస్ బ్రిడ్జ్, ప్రేగ్
ప్రపంచ ప్రఖాతి చెందిన వంతెన స్టోన్ బ్రిడ్జ్. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలోని వాల్తావా నదిపై ఈ వారధిని నిర్మించారు. ఈ వంతెన నిర్మాణం 1357లో  చెక్ రిపబ్లిక్ రాజు చార్లెస్-4 కాలంలో ప్రారంభమై 15వ శతాబ్దం ప్రథమార్ధం నాటికి పూర్తయింది. ఈ సేతువు స్థానంలో ఇంతకు ముందు జుడిత్ బ్రిడ్జ్ ఉండేది.  1158-1172 మధ్యకాలంలో వచ్చిన వరదల కారణంగా ఆ వంతెన నాశనం అవటంతో చార్లెస్ వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. ఈ బ్రిడ్జ్ తూర్పు, పశ్చిమ యూరప్‌ల మధ్య వారధిగా పనిచేస్తోంది.

Advertisement

పోల్

Advertisement