
సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్ద కలకలం
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని ప్రతిష్టాత్మక సిడ్నీ హార్బర్ వంతెనపైకి ఎక్కిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం 9 గంటలకు (స్థానిక కాలమానం) కారులో అతడు బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. ట్యాక్సీలోంచి దిగి వంతెనపైకి ఎక్కాడు. తర్వాత తాపీగా చేతులు కట్టుకుని బ్రిడ్జి ఆర్చిపైన మౌనంగా కూర్చుకున్నాడు. కిందకు రమ్మని కోరినా మొదట అతడు నిరాకరించాడని లోకల్ మీడియాతో న్యూ సౌత్ వేల్స్ పోలీసులు చెప్పారు.
హార్బర్ వంతెనపై కొన్ని లైన్లు మూసివేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు రెండు గంటల పాటు వంతెన పైనే కూర్చున్న అతడు 10.50 గంటల ప్రాంతంలో కిందకు దిగాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని భావించి రాయల్ నార్త్ షోర్ ఆస్పత్రికి తరలించారు. అతడి వ్యక్తిగత వివరాలు, ఎందుకు వంతెన ఎక్కాడనే విషయాలు వెల్లడి కాలేదు. వంతెనపై 75 మీటర్ల ఎత్తు వరకు అతడు ఎక్కాడని స్థానిక మీడియా పేర్కొంది.