22 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఓ పర్వతారోహకుడి మృతదేహాం పెరూ దేశంలో తాజాగా బయటపడింది. మృతుడిని అమెరికాకు చెందిన విలియం స్టాంప్‌ఫ్ల్‌గా గుర్తించారు. జూన్ 2002లో ఆయన ఆదృశ్యమవ్వగా అప్పుడు అతని వయసు 59 ఏళ్లు. పెరూలోని హుస్కరన్ అనే పర్వతాన్ని అధిరోహిస్తూ మిస్ అయ్యారు. ఆ పర్వతం ఎత్తు 6,700 మీటర్లు(22,000 అడుగులు).
ఆ సమయంలో విలియం కోసం రెస్క్యూ బృందాలు ఎంత గాలించిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో పర్వతారోహకుడి కుటుంబం అతడిపై ఆశలు వదులుకుంది. వాతావరణ మార్పుల వల్ల ఆండీస్‌లోని కార్డిల్లెరా బ్లాంకా శ్రేణిలో మంచు కరిగిపోవడంతో 22ఏళ్ల క్రితం అదృశ్యమైన విలియం మృతదేహం బయటపడినట్లు పెరూవియన్ పోలీసులు పేర్కొన్నారు.
అయితే ఇన్నేళ్ల అతని మృతదేహం దొరికినప్పటికీ.. అది చెక్కుచెదరని స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పర్వతారోహకుడి శరీరంపై మంచు దట్టంగా పేరుకుపోవడంతో అతడి శరీరం మునుపటిలానే ఉందని, ఒంటిపై ఉన్న బట్టలు, బూట్లు మంచులో అలాగే భద్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
అతని జేబులో లభించిన పాస్‌పోర్టు ఆధారంగా మృతుడిని గుర్తించామని, వారి కుటుంబసభ్యులను సంప్రదించి మృతదేహాన్ని వారికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఈశాన్య పెరూలోని హుస్కరన్, కాషాన్ వంటి పర్వతాలను దేశ, విదేశీ పర్వతారోహకులను ఆకర్షిస్తుంటాయి. కాగా గత మేలో ఇజ్రాయెల్, ఇటలీకి చెందిన ఇద్దరు పర్వతారోహకులు హుస్కరన్ పర్వతాన్ని అధిరోహిస్తూ మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment