
పోలీసులకు సీఎం యోగి ఝలక్
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో తనశైలిలో ముందుకు వెళుతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టిన ఆయన ప్రభుత్వ కార్యాలయాలను సంస్కరించే పనిలో పడ్డారు. సచివాలయంలో పాన్, గుట్కా నిషేధించిన ఆయన గురువారం లక్నోలోని హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే సీఎం స్టేషన్ కు రావడంతో పోలీసులు పరుగులు పెట్టారు.
పోలీస్ స్టేషన్ లోని రికార్డులు, మినీ సెల్స్, లాకప్ సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ‘ఇది మొదటి ఆడిట్. చివరి ఆడిట్ మాత్రం కాదు’ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. న్యాయాన్ని కాపాడేందుకు పోలీసులు అండగా నిలబడాలని ఆయన కోరారు. తమకు కావాల్సిన అన్ని వసతులు సమకూరుస్తామని ముఖ్యమంత్రి హామీయిచ్చారని పోలీసు ఉన్నతాధికారి జావేద్ అహ్మద్ తెలిపారు.