
అక్క హత్య.. ఆపై ఆత్మహత్య
తనను గుట్కా తిననివ్వలేదన్న కోపంతో సొంత అక్కను పీక పిసికి చంపేసి.. ఆపై అపరాధ భావంతో ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. ఈ ఘటన దేశ రాజధానిలో కలకలం రేపింది. అతడు టీబీతో పాటు.. స్కిజోఫ్రేనియాతో కూడా బాధపడుతున్నాడని, ఆగ్నేయ ఢిల్లీలోని ఓ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించేవాళ్లమని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. మంచానికి కింద ఉండే అరలో నీలమ్ (24) మృతదేహం కనిపించింది. దీపక్ కుమార్ (21) మెట్ల మార్గంలో ఉరేసుకుని చనిపోపయాడు.తన అన్న అనిల్ కుమార్, అక్క నీలమ్తో కలిసి మహావీర్ ఎన్క్లేవ్లో దీపక్ ఉండేవాడు.
అనిల్ ఓ కంప్యూటర్ సెంటర్లో ట్రైనర్గా పనిచేస్తాడు. దీపక్కు గుట్కా తినే అలవాటు బాగా ఉంది. కానీ టీబీ కారణంగా వద్దని కుటుంబ సభ్యులు చెప్పేవారు. ఎప్పుడైనా అలా చెబితే అతడు బాగా కోపంగా ప్రవర్తించేవాడు. అక్కతో తరచు కొట్లాడేవాడని, దాంతో ఆమె అప్పుడప్పుడు గదిలో పెట్టి తాళం వేసేదని పొరుగున ఉండే సరస్వతి తెలిపారు.
అయితే, ఉన్నట్టుండి ఇద్దరూ కనిపించకపోవడంతో ఆమే అనిల్కు ఫోన్ చేసి విషయం చెప్పారు. మెయిన్ డోర్ తాళం వేసి ఉండటం, నీలమ్ చెప్పులు అక్కడ ఉండటం కనిపించింది. దాంతో చుట్టుపక్కల, ఇంట్లోను గాలించగా దీపక్ మృతదేహం కనిపించింది. పోలీసులు వచ్చి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన కాసేపటికే మళ్లీ అనిల్ వాళ్లకు ఫోన్ చేశాడు. తాను డబ్బుల కోసం మంచం కింద ఉన్న అరను తెరవగా.. అందులో నీలమ్ మృతదేహం ఉందని చెప్పాడు. ఆమె గొంతు చుట్టూ ఓ చున్నీ బిగించి ఉంది.