
వైఎస్‌ఆర్ పాదయాత్ర స్ఫూర్తిదాయకం: వైఎస్ జగన్
హైదరాబాద్: ప్రజల కోసం, ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు సరిగ్గా 14 ఏళ్ల కిందట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన మహాత్తరమైన పాదయాత్ర స్ఫూర్తిని ఆయన తనయుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ప్రజల ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్న ఆయన ప్రజాప్రస్థాన పాదయాత్ర ఎల్లప్పుడూ గుర్తు ఉంటుందని, ఎల్లవేళలా స్ఫూర్తిని పంచుతుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
’14 ఏళ్ల కిందట మండే ఎండలో ఆయన తన ప్రజల కోసం గొప్ప పాదయాత్రను చేపట్టారు. ప్రజల ప్రేమాభిమానాల్ని పొందారు. ఆయన పాదయాత్ర ఎల్లప్పుడూ గుర్తుంటుంది. ఆయన ఎల్లవేళలా స్ఫూర్తి పంచుతూనే ఉంటారు’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
He walked the greatest journey for his people under the hot sun 14 yrs ago. A man loved. A walk remembered. He'll always be an inspiration.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 9 April 2017
2003 ఏప్రిల్ 9 న సరిగ్గా పద్నాలుగు సంవత్సరాల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖరరెడ్డి మహాత్తరమైన పాదయాత్రను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించి.. 11 జిల్లాల్లో 56 నియోజకవర్గాల మీదుగా 68 రోజులపాటు నిప్పుల కురిసే ఎండలో నడిచారు. 1470 కిమీల మేర సాగిన ఈ ప్రజాప్రస్థాన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. తెలుగువారి చరిత్రలో మరుపురాని ఘట్టంగా ఈ పాదయాత్ర మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మైలురాయిగా నిలిచింది.
(చదవండి: నిప్పులు కురిసే ఎండలో 68 రోజుల పాటు నడక)