కాలిఫోర్నియాలో వైఎస్సార్కు ఘన నివాళి
కాలిఫోర్నియా: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏడవ వర్ధంతిని వైఎస్సార్ సీపీ ఎన్నారై యూఎస్ఏ కమిటీ ఘనంగా నిర్వహించింది. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో సెప్టెంబర్ 2న ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు, పలువురు అమెరికన్లు.. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రక్తదానం చేశారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వందలాది మంది అభిమానుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి, కొద్దిసేపు మౌనం పాటించారు.
ప్రముఖ వైద్యులు డాక్టర్ హనిమిరెడ్డి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు, సాధన, వైఎస్సార్ సీపీ ఎన్నారై శాఖ కన్వీనర్లు మధులిక, రత్నాకర్, రాజ్ కేసిరెడ్డిలు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పేద ప్రజల పట్ల వైఎస్సార్ కు ఉన్న ఆప్యాయత, అభిమానాలను, మహానేత పాలనలో చేపట్టిన పలు సంక్షేమ పథకాలను గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించారు.
మహానేత కలలుకన్న సువర్ణ పాలనను ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే అందించగలరని, వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారు కృషి చేయాలని పార్టీ ఎన్నారై కమిటీ కన్వీనర్లు మధులిక, రాజ్ కేసిరెడ్డి, పండుగాయల రత్నాకర్ లు అన్నారు. కేవీ రెడ్డి, సురేశ్ ఉయ్యూరు, సురేంద్ర అబ్బవరం, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాగార్జున, నాటా ప్రతినిధులు ప్రసూనా రెడ్డి, నాప్తా ప్రతినిధులు శౌరి ప్రసాద్, సిలికానాంధ్ర ప్రతినిధులు కొండారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డివారి, శ్రీనివాస్, ఉమా శంకర్, శివ, పెంచల్ రెడ్డి, నరేశ్, హరిప్రసాద్ మొయ్యా, శంకర్ రెడ్డి, సురేంద్ర పులగం, దినేశ్, విద్యార్థి విభాగం నాయకులు సాత్విక్, దినేశ్, రవీంద్రారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.