అపూర్వం.. అనితర సాధ్యం
అంతరిక్షంలో మన దేశ కీర్తి ప్రతిష్టలను రెపరెపలాడిస్తున్న భారత అంతరిక్ష పరి శోధన సంస్థ (ఇస్రో) బుధవారం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్‌ఎల్‌వీ) రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించి మరో అసమానమైన, అనుపమానమైన ఘనతను నమోదు చేసింది. ఒకే రాకెట్ ద్వారా బహుళ ఉపగ్రహాలను ప్రయోగించడమన్నది ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ. పైగా ప్రపంచ శాస్త్రవేత్తల్లో చాలామంది పీఎస్‌ఎల్‌వీని అంత ఆధారపడదగిన రాకెట్‌గా పరిగణించరు.
ఎక్కడివరకో ఎందుకు... ఇస్రోయే 1993 సెప్టెంబర్ 20న తొలిసారి పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ప్రయోగించినప్పుడు అది విఫలమైంది. మన శాస్త్రవేత్తలు ఆ వైఫల్యాన్నొక సవాలుగా స్వీకరించి దానికి సంబంధించిన సాంకేతికతను సంపూ ర్ణంగా స్వాధీనంలోకి తెచ్చుకోగలిగారు. ఇక ఆ తర్వాత ఓటమి మాటే లేదు... అంతా అత్యద్భుత విజయపరంపరే. ఏకబిగిన పాతికేళ్ల పీఎస్‌ఎల్‌వీ ప్రయోగ ప్రస్థానంలో ఇప్పుడు సాధించింది 38వ విజయం. ఎలా సాధ్యపడింది ఇదంతా?
1962లో విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో ఏర్పాటైన జాతీయ అంతరిక్ష పరిశోధన సంఘం అంతరిక్ష రంగంలో అవిశ్రాంతంగా పరిశోధనలు చేసిన పర్యవసానంగా మరో ఏడేళ్లకు అంటే... 1969లో ఇస్రో ఆవిర్భవించింది. తొలి ఉపగ్రహం ‘ఆర్య భట’ను రష్యా సహకారంతో ప్రయోగించి అంతరిక్షంలో తొలి అడుగు వేసినా మన శాస్త్రవేత్తలు సంతృప్తిపడలేదు. పూర్తి స్వదేశీ వాహక నౌక ద్వారా మలి అడుగు వేయాలన్న సంకల్పంతో పట్టుదలగా శ్రమించారు. ఈ క్రమంలో అనేక బాలా రిష్టాలను అధిగమించారు. ఫలితంగా ఎస్‌ఎల్‌వీ–3 రాకెట్ రూపుదిద్దుకుని 1980లో రోహిణి ఉపగ్రహం–1 గగనానికెగిసింది. పర్యవసానంగా అంతరిక్ష రంగంలో పెత్తనం చలాయిస్తున్న అయిదు దేశాల సరసన మనం కూడా చేరాం.
బహుళ ఉపగ్రహాల ప్రయోగం ప్రపంచంలో కొత్తేమీ కాదు. 2014లో రష్యా ఒక రాకెట్‌తో 37 ఉపగ్రహాలను పంపితే... అంతకు ముందు సంవత్సరం అమెరికా 29 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలో ప్రవేశపెట్టగలిగింది. మన శాస్త్రవేత్తలే 2008లో పది, నిరుడు జూన్‌లో 20 ఉపగ్రహాలు విజయవంతంగా పంపగలిగారు. సమీప భవిష్యత్తులో ఎవరూ మనల్ని అందుకోలేని విధంగా తాజా ప్రయోగం ద్వారా ఇప్పుడు 104 ఉపగ్రహాలను పంపారు. ఇందులో 714 కిలోల మన కార్టో శాట్–2 ఉపగ్రహం ప్రధానమైనది. మిగిలినవన్నీ నానో ఉపగ్రహాలే కాగా వాట న్నిటి బరువూ 664 కిలోలు. అంటే మొత్తంగా 1,378 కిలోల బరువున్న ఉప గ్రహాలను పీఎస్‌ఎల్‌వీ మోసుకెళ్లిందన్నమాట!
అసలు రాకెట్ సైన్స్ అన్నదే సంక్లి ష్టతల సమాహారం. ప్రయాణించాల్సిన దూరం, మోసుకెళ్లే బరువు తదితర అంశా లన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటూ నిర్దిష్ట కక్ష్యల్లో ఉపగ్రహాలను చేర్చా లంటే రాకెట్ ఎంత వేగంతో వెళ్లాలో నిర్ధారించుకోవాలి. ఆ ఉపగ్రహాలన్నీ నిర్దేశిత స్థా నాల్లో అమరాలి. వాటి కక్ష్యలు, వేగం వేరువేరుగా ఉండాలి. అసలు బహుళ ఉప గ్రహాల ప్రయోగాలపై ఎన్నో విమర్శలున్నాయి. ఈ తరహా ప్రయోగాల వల్ల విలు వైన సమయం, కోట్ల రూపాయల సొమ్ము ఆదా అయ్యే సంగతి నిజమే అయినా దాంతోపాటే ఎన్నో ఇబ్బందులు కూడా ఉంటాయని అంతరిక్ష రంగ నిపుణులు అంటారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అంతరిక్షంలో పెను ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అవి నియంత్రణకు లొంగక ధూర్త ఉపగ్రహాలుగా మారతాయి. అత్యంత సునిశితత్వంతో ప్రతి అంశాన్ని పరిశీలించి సర్వ వ్యవస్థలూ సక్రమంగా ఉన్నాయని నూటికి నూరుశాతం నిర్ధారించుకోవడం ఇందులో ప్రధానం. ఆ మాదిరి నైపుణ్యం మన శాస్త్రవేత్తలకు పుష్కలంగా ఉంది. ఇస్రో విజయపరంపరను గమనిస్తూ వస్తున్న రెండు అమెరికా సంస్థలు ఉపగ్రహాలను క్షేమంగా పంపడానికి ప్రపంచంలో ఇస్రోను మించింది లేదని నిర్ణయించుకున్నది అందుకే. అవి మొత్తంగా 94 నానో ఉపగ్రహాలను అందజేయగా ఇజ్రాయెల్, కజఖ్‌స్థాన్, నెద ర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూఏఈ దేశాలకు చెందినవి ఒక్కొక్కటి ఉన్నాయి.
ఈ ఖ్యాతిని సొంతం చేసుకోవడంలో మన శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. అంతరిక్ష పరిజ్ఞానాన్ని గుప్పిట బంధించి ఆ రంగంలో తమ పెత్తనమే ఉండాలని కాంక్షించే అగ్రరాజ్యాలు సాంకేతికతను అందించడానికి సహ జంగానే ససేమిరా అన్నాయి. మొదట్లో మన పాలకులు కూడా ఈ రంగంపై తగినంత శ్రద్ధ పెట్టలేదు. అయితే ఉపగ్రహాల వల్ల రక్షణ రంగంతో మొదలుబెట్టి వాతావరణం, వ్యవసాయం, విద్య, వైద్యం, విపత్తుల నివారణ వరకూ సమస్త రంగాల్లోనూ ఉపగ్రహ ఆధారిత పరిజ్ఞానం అక్కరకొస్తుండటాన్ని గమనించాక పరిస్థితి మారింది.
ఇక్కడ మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సాంకేతికత గురించి చెప్పుకోవాలి. అమెరికా, యూరప్‌లలో ఉపగ్రహ ప్రయోగానికయ్యే వ్యయం కంటే ఇస్రో చేపట్టే ప్రయోగాల వ్యయం పది రెట్లు తక్కువ. అరుణ గ్రహంపైకి 2013లో ఇస్రో పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్)కు 7 కోట్ల 40 లక్షల డాలర్లు ఖర్చయితే... అచ్చం అదే ప్రయోగానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 67 కోట్ల డాలర్లు వ్యయం చేసింది. ఇస్రో వార్షిక బడ్జెట్ నిరుడు రూ. 7,500 కోట్లయితే... నాసా బడ్జెట్ అంతకు 18 రెట్లు ఎక్కువ. అందువల్లే చాలా దేశాలు ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో వైపు చూస్తున్నాయి. యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమి టెడ్ పేరిట రోదసి వాణిజ్యంలోకి సైతం అడుగుపెట్టిన ఇస్రో ఇంతవరకూ విదే శాలకు చెందిన 180 ఉపగ్రహాలను ప్రయోగించింది. 2014–16 మధ్య ప్రయో గించిన 44 విదేశీ ఉపగ్రహాల ద్వారా రూ. 693 కోట్లు ఆర్జించింది.
అయితే ప్రపంచ రోదసి వాణిజ్యంలో ఇప్పటికీ మన వాటా ఒక శాతంకన్నా తక్కువ. ఇటీవల నానో ఉపగ్రహాలపై వివిధ దేశాల్లో ఆసక్తి పెరిగింది. కనుక ఇస్రో చాలా స్వల్పకాలంలోనే తన వాణిజ్యాన్ని విస్తరించుకోగలదని విశ్వసించవచ్చు. ఇస్రో విజయ పరంపర మన విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుతుంది. అటు ప్రభుత్వాలు సైతం ఇంజ నీరింగ్‌కు అతిగా ప్రాధాన్యమిచ్చే తమ ధోరణికి స్వస్తిచెబితే సైన్స్‌లో మెరికల్లాంటి నిపుణులు రూపొందుతారు. ఇస్రో ఆదర్శంగా అత్యద్భుతమైన విజయాలను ఆవిష్కరిస్తారు.