ముఫ్తీ వారసత్వం | Mehbooba Mufti Sayeed is new CM for jammu kashmir | Sakshi
Sakshi News home page

ముఫ్తీ వారసత్వం

Published Sat, Jan 9 2016 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

ముఫ్తీ వారసత్వం

ముఫ్తీ వారసత్వం

సంక్లిష్టమైన రాజకీయ పరిస్థితులుండే జమ్మూకశ్మీర్‌లో భిన్న ధ్రువాలైన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ), బీజేపీలు నిరుడు మార్చి నెలలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పర్చినప్పుడు అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అంతకు నాలుగు నెలల ముందు...2014 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో పరస్పరం కత్తులు దూసుకున్న వైరి పక్షాలు రెండూ ఒద్దికగా ప్రభుత్వాన్ని నడపగలవా అన్న సందేహాన్ని వెలిబుచ్చారు. కానీ అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడు ముఫ్తీ మహ్మద్ సయీద్ బుధవారం కన్నుమూశారు.

ఆయనంతగా జమ్మూ-కశ్మీర్‌లో అన్ని వర్గాల అభిమానాన్నీ చూరగొన్న నేత మరొకరు లేరు. కశ్మీర్ రాజకీయాల్లో ముఫ్తీ లేని లోటు తీర్చలేనిదని పలువురు నాయకులు చేసిన ప్రకటనల్లో నిజముంది. వేర్పాటు వాదానికి దగ్గరగా ఉన్నదని భావించే ‘స్వయంపాలన’ నినాదం ఊపిరిగా ఎన్నికల్లో పోటీచేసిన పీడీపీ...అసలు ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాం గంలోని 370వ అధికరణ రద్దు చేయాలనే బీజేపీతో సన్నిహితం కావడం కేవలం ముఫ్తీ వల్లనే సాధ్యమైంది.

ఇందువల్ల తనను సమర్ధించేవారు కొంత అసంతృప్తికి లోనైనా జమ్మూ ప్రాంతంలో అత్యధిక స్థానాలు గెలిచిన బీజేపీని విస్మరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్ర భవిష్యత్తు రీత్యా మంచిది కాదన్న ఉద్దేశం తోనే అందుకు సిద్ధపడ్డానని ముఫ్తీ ఒక సందర్భంలో చెప్పారు. గతంలో ఈ విషయంలో జరిగిన తప్పిదాలవల్లనే రెండు ప్రాంతాలమధ్యా అవసరమైనంతగా సామరస్యత నెలకొనలేదన్న భావన ఆయనలో ఉండేది. అలాగని ఆయన తన అభిప్రాయాల విషయంలోనూ, సిద్ధాంతాల విషయంలోనూ రాజీపడలేదు. సర్కారీ సహకారంతో గోప్యంగా నడిచే హంతక ముఠాలకు సీఎం అయ్యాక ఆయన చోటు లేకుండా చేశారు. విచారణలో ఉన్న రాజకీయ ఖైదీలను విడుదల చేశారు. అధీన రేఖకు అటూ, ఇటూ ఉండే కశ్మీరీలు ఒకరినొకరు తరచు కలుసుకునే అవకాశం కల్పించారు. వేదిక ఏదైనా తన అభిప్రాయాలను ముఫ్తీ నిర్మొహ మాటంగా చెప్పేవారు. మొన్నటి నవంబర్ నెలలో గోవాలో బీజేపీకి చెందిన మేధావుల ఫోరం సదస్సుకు ఆయన హాజరైనప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్‌తోసహా విపక్షాలన్నీ విమర్శించాయి.

ప్రధాని నరేంద్ర మోదీ ‘పారదర్శకత, సుపరిపాలన, అభివృద్ధి’ నినాదాలు తనను ఆకర్షించాయనీ, అందువల్లే బీజేపీతో చేతులు కలిపానని ఆ వేదికపైనుంచి ముఫ్తీ అనడమే మీడియాలో ప్రముఖంగా వచ్చింది. కానీ ఆ వేదికపైనే ఆయన బీజేపీని నిశితంగా విమర్శించారు కూడా. మోదీ నినాదంలోని అంశాలన్నీ వెనక్కు వెళ్లి అసహనం ఆధిపత్య స్థానంలోకి వస్తున్న వైనంపై ఆ పార్టీని హెచ్చరించారు. గొడ్డు మాంసాన్ని రవాణా చేస్తున్నాడన్న అను మానంతో ఒక ట్రక్కు డ్రైవర్‌ను కొట్టి చంపిన ఉదంతాన్ని కూడా ఆయన ప్రస్తావిం చారు. దేశం పురోగమించాలంటే సమ్మిళిత అభివృద్ధి ద్వారానే సాధ్యమని హితవు పలికారు. రెండు వర్గాలూ భుజం భుజం కలిపి నడిస్తే దేశం అభివృద్ధి బాట పడుతుందని, అందుకు కశ్మీరే ఉదాహరణని వివరించారు.

ఉగ్రవాదం విషయంలోనూ ఆయన అభిప్రాయాలు విలక్షణమైనవి. ప్రజా స్వామ్యమన్నది భావాల సంఘర్షణ అని ముఫ్తీ అనేవారు. ఒకరిని బంధించడం ద్వారా లేదా హతమార్చడం ద్వారా భావాల్లో మార్పు తీసుకురావడం అసాధ్య మన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. కశ్మీరీల వ్యక్తిత్వం గురించి ఇతర ప్రాంతాల వారిలో ఉన్న దురభిప్రాయాలనూ ఆయన ఒక సందర్భంలో ప్రస్తావించారు. 1947లో పాకిస్థాన్ దురాక్రమణను గట్టిగా ప్రతిఘటించిందీ, జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించిందీ, తమ అనుబంధం భారత్‌తోనే ఉండాలని ప్రగా ఢంగా కోరుకు న్నదీ కశ్మీరీలేనని ఆయన చెప్పారు. జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రాంతా లను ఒక రాష్ట్రంగా చేయడం బాగానే ఉన్నా జాతి, మత, ప్రాంతీయ స్థాయిల్లో ఉండే ఘర్షణాత్మక ధోరణులను సరిగా పరిష్కరించలేదన్న భావన ఆయనది. వాటిని ఎంతో ఒడుపుగా చేయగలిగినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయనేవారు. దానికి తగినట్టే కూటమి ఏర్పర్చిన సందర్భంలో పీడీపీ, బీజేపీలు రెండూ పట్టు విడుపుల ధోరణిని ప్రదర్శించాయి. తమ తమ వైఖరులను తగ్గించుకుని సన్నిహితమయ్యాయి.

తండ్రి స్థానంలో ముఖ్యమంత్రి కాబోతున్న మెహబూబా ముఫ్తీ ఆ రాష్ట్రానికి తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించబోతున్నారు. తనకు అనారోగ్యం ఏర్ప డ్డాక కుమార్తెను ఆ పీఠంపై కూర్చోబెట్టాలని ముఫ్తీ తహతహలాడారు. మొన్న నవంబర్‌లో ఆ సంగతిని ఆయన ప్రకటించారు కూడా. ఆ పదవికి కావాల్సిన అర్హతలన్నీ ఆమెకున్నాయని ఆ సందర్భంగా ముఫ్తీ చెప్పారు. ‘క్షేత్ర స్థాయిలో పనిచేసేదంతా ఆమెనే...నేను కేవలం ప్రసంగాలకూ, కార్యాలయానికే పరిమితం’ అని కూడా అన్నారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలై, 1996 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మెహబూబా పీడీపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. మొదట్లో పార్టీ ఉపాధ్యక్షురాలిగా, చాన్నాళ్లనుంచి అధ్యక్షురాలిగా ఉన్న మెహబూబా ముందు ఇప్పుడు చాలా సవాళ్లున్నాయి. పార్టీ అధ్యక్షురాలిగా ఆమె కొన్ని అంశాల్లో బీజేపీతో తీవ్రంగా విభేదించిన సందర్భాలున్నాయి. అవి ఒక్కోసారి రెండు పార్టీలమధ్యా వివాదా లకు కూడా దారితీశాయి. ముఫ్తీ అనుభవశాలి గనుక అలాంటివాటిని అవలీలగా ఎదుర్కోగలిగారు.

ఇప్పుడు మెహబూబాయే అలాంటి సందర్భాలు తలెత్త కుండా జాగ్రత్తపడవలసిన స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆమె ఇకపై ఆచితూచి అడుగేయక తప్పదు. ఇప్పుడు శ్రీనగర్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ సాగిస్తున్న చర్చల్లో సహజంగానే మెహబూబా వైఖరి గురించి ప్రస్తావన వచ్చి ఉంటుంది. ముఫ్తీ కేవలం 11 నెలలు మాత్రమే పాలన సాగించారు. అయిదేళ్ల సుదీర్ఘకాలం కూటమి ఒడిదుడుకులు లేకుండా నడవాలంటే కొత్తగా చాలా అంశాల్లో అవగాహనకు రావలసి ఉంటుంది. కీలకమైన నిర్ణయాల విషయంలో పొరపొచ్చాలు ఏర్పడకుండా చూడటానికి అవసరమైన ఏర్పాట్లు  చేసుకోక తప్పదు. రాష్ట్రంలో కూటమిని జాగ్రత్తగా నడుపుతూ, వివిధ పక్షాలను కలుపుకొనిపోతూ,  కేంద్రంలో కావలసినవి రాబట్టుకోవడంలో నేర్పరితనాన్ని ప్రదర్శించిన ముఫ్తీని ఆదర్శంగా తీసుకోగలిగి నప్పుడే మెహబూబా విజయం సాధించగలుగుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement