Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Press Meet On Pulivendula ZPTC Bypolls Updates1
చంద్రబాబు జీవితానికి ఇదే చివరి ఎలక్షన్‌ కావొచ్చు: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ఏపీలో శాంతిభద్రతలు లేవనడానికి.. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా దాడులే నిదర్శనమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. సాక్షాత్తూ కలెక్టర్‌ సమక్షంలో దొంగ ఓట్లు వేయడం, పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్‌ జరిపించడాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనబడటం లేదు. ప్రజాస్వామ్యం లేదన్నది ఎన్నికల్లో రుజువైంది. రాష్ట్రంలో ఎలాంటి పరిస్తితులున్నాయో చెప్పడానికి పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికలే ఉదాహరణ. పోలింగ్ బూత్ లలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేరు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు బూత్ లలో లేకుండా చేసి రిగ్గింగ్ చేసుకున్నారు. పోలీసుల ప్రోద్భలంతో రిగ్గింగ్ చేసుకున్నారు. దేశంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిగింది ఇక్కడేపులివెందులలో జరిగింది ఎన్నిక అంటారా?పోలింగ్ బూత్ ఏజెంట్లకు కొన్ని హక్కులు.. బాధ్యతలుంటాయ్. నకిలీ ఓటర్లను గుర్తించడం , అభ్యంతరాలను తెలియజేయడం , పోలింగే వివరాలను తెలుసుకోవడం వంటి బాధ్యతలుంటాయి. పోలింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు ఫామ్ -12 ఇస్తారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల నుంచి ఫామ్ -12 ను పోలీసులు,టిడిపి వాళ్లు లాక్కున్నారు. పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఎన్నిక జరగడం చరిత్రలో ఎక్కడా చూడలేదు. ప్రజాస్వామ్యం ఇంతలా దిగజారిపోయిన పరిస్థితులు ఏపీలోనే చూస్తున్నాం. ఎన్నిక ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు. ఇవన్నీ ఎన్నికలో జరిగాయా?. ఏజెంట్లే లేకుండా జరిగితే వాటిని ఎన్నికలు అంటారా?..ఇదే తరహాలో ఎన్నికలు జరిపితే హాస్యాస్పదమే అవుతుంది. ఇంతటి దానికి ఎన్నికలు జరపడం దేనికి. ప్రజలకు మంచి చేయాలనే ఉద్ధేశం ఈ ప్రభుత్వానికి లేదు. దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇది వాళ్ల విధానం. ఒకప్పుడు బందిపోట్ల పేరు చెబితే వినిపించే చంబల్ లోయను మరిపించేలా చంద్రబాబు పులివెందుల ఎన్నిక జరిపారు. సాక్షాత్తూ పోలీసులు దగ్గరుండి ప్రోత్సహించారు. చంద్రబాబుకు ఇదే నా ఛాలెంజ్.. ప్రజలు మీకు ఓటు వేస్తారనే నమ్మకం ఉంటే ఎన్నికలను రద్దు చేయండి. కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నిక జరపండి.. .. ప్రజాస్వామ్యంలో మీకు ఓట్లు వేసే అవకాశం లేదు. ప్రతీ బూత్ లో వెబ్ కాస్టింగ్, సీసీ ఫుటేజ్ ఇచ్చే ధైర్యం మీకుందా?. ఎవరెవరు బయటి నుంచి వచ్చారు..ఎవరెవరు బూత్ లను ఆక్రమించుకున్నారో ఆధారాలిస్తా. అడ్డగోలు రాజకీయాలు చేసే వాళ్లను మోసగాడు అంటారు. ఏ ఎన్నిక జరిగినా ఆ ఊర్లో ప్రజలే అక్కడ ఓటేస్తారు ... గతంలోనూ అదే జరిగిందిప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో చంద్రబాబు పోలింగ్ బూత్ లను మార్చేశారు. పోలింగ్ బూత్ లు మార్చడం వల్ల నాలుగు వేల ఓట్ల పై ప్రభావం పడింది. పోలింగ్ బూత్ లకు వెళ్లకుండా దారిలోనే అడ్డుకున్నారు. పులివెందుల ఎన్నికలు ఆరు పంచాయతీల పరిధిలో జరిగాయి. ఈ ఆరు పంచాయతీల్లో 700 మంది పోలీసులను పెట్టారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు,కార్యకర్తలు ఈ గ్రామాల్లో పాగా వేశారు. పోలీసులే వారిని ప్రోత్సహించారు.ఒక్కో ఓటర్‌కు ఒక్కోరౌడీని దింపారుపోలీసులు పచ్చ చొక్కాలేసుకున్నారు. ప్రతీ బూత్ లో 400 లకు పైగా టీడీపీ రౌడీలు తిష్ట వేశారు. ఒక్కో ఓటరుకి ఒక్కో రౌడీని పెట్టారు. మంత్రి సవిత మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి , ఎమ్మెల్యే చైతన్య రెడ్డి మనుషులు పోలింగ్ బూత్ లలో తిష్టవేశారు. బిటెక్ రవి పులివెందుల రూరల్ ఓటరు కాదు. కానీ కనంపల్లిలో తిష్టవేసి దౌర్జన్యం చేశాడు. ఓట్లు వేసేందుకు వెళ్లిన వారిని కొట్టి..వారి స్లిప్పులను లాగేసుకున్నారు. ఆ స్లిప్పులతో వాళ్లు ఓట్లేసుకున్నారు. టిడిపికి ఓటేసేవాడైతేనే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లనిచ్చారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేశారు. జమ్మలమడుగు నుంచి వచ్చిన టిడిపి నేతలు పులివెందులలో ఓట్లేశారు. ఇవాళ జరిగే రీపోలింగ్ లో కూడా దొంగఓట్లు వేశారు. అన్యాయమని ప్రశ్నిస్తే పోలీసులు తరిమితరిమి కొట్టారు. మహిళ ఏజెంట్లను కూడా ఇబ్బంది పెట్టారు. టీడీపీ వాళ్లు వందల మంది ఒకేచోట ఉన్నా.. షామియానాలు వేశారు.పోలీసులు.. పచ్చ చొక్కా వేసుకోవాల్సిందే!ఏరికోరి పోలీసులను నియమించుకున్నారు. పచ్చచొక్కాలు వేసుకుని పోలీసులు టిడిపికి పనిచేశారు. డీఐజీ కోయ ప్రవీణ్ .. టీడీపీ మాజీ ఎంపీ సమీప బంధువు. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజి కోయ ప్రవీణ్ పర్యవేక్షలో ఈ ఎన్నిక జరిపారు. చంద్రబాబు మాట వినకపోతే డిజి స్థాయి అధికారులైనా ఇబ్బంది పడాల్సిందే. పీఎస్.ఆర్ ఆంజనేయులు,సునీల్ కుమార్,విశాల్ గున్నీల పై కేసులు పెట్టారు ..కొందరిని అరెస్ట్ చేశారు. ఈ డీఐజీ మాఫియా రింగ్ లీడర్. బెల్ట్ షాపుల కలెక్షన్ల నుంచి పర్మిట్ రూమ్ లు , ఇసుక,మట్టి,క్వార్ట్జ్, సిలికా, పేకాట శిభిరాలకు అనుమతి వరకూ అంతా డిఐజినే చూసుకుంటున్నాడు. ఈ కలెక్షన్లలో వాటాలను చంద్రబాబు,చినబాబు,ఎమ్మెల్యేలకు పంచుతున్నాడు. ఇలాంటి డీఐజీ పర్యవేక్షణలో ఎన్నికలు జరిపించారువైఎస్సార్‌సీపీ వాళ్లే లక్ష్యంగా..ఉదయం 4 గంటల నుంచే టిడిపి వాళ్లు పోలింగ్ బూత్ లను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పులివెందుల టౌన్ లో ఉన్న అవినాష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన టిడిపి నేతలు రెచ్చిపోయారు. మోట్నుతలపల్లిలో పోలింగ్ బూత్ లకు 2 కిలోమీటర్ల దూరంలోనే ఓటర్లను అడ్డుకున్నారు. ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోనికి రాకుండా అడ్డుకున్నారని ఓటర్లే చెబుతున్నారు. కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి పోలీసులు గన్ తో బెదిరించారుఎర్రబల్లిలో రిగ్గింగ్ చేయడానికి వచ్చిన టిడిపి వాళ్లకు పోలీసులే స్వాగతం పలికారు. కనంపల్లిలో పోలింగ్ బూత్ లకు ఏజెంట్లు వెళ్లకుండా బీటెక్ రవి తమ్ముడు భరత్ అడ్డుకున్నాడు. ఓటు వేయనివ్వండని ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. కనంపల్లి ఓటర్లు ఓటు వేయలేకపోయామని ఆవేదన చెందారు. పులివెందుల జడ్పీటీసి అభ్యర్ధి హేమంత్‌ను ఇంటి నుంచి కూడా బయటికి రానివ్వలేదు. భూపేజ్ రెడ్డి పీఏ సుదర్శన్ రెడ్డికి పులివెందులలో పనేంటి?. పులివెందుల రూరల్ లో ఎన్నికలు జరుగుతుంటే టౌన్ లో ఉన్న అవినాష్ రెడ్డి ఆఫీస్ కు వెళ్లి డిఐజి హడావిడి చేశాడు. పులివెందులలో డీఎస్పీ ‘‘కాల్చిపడేస్తా నాకొడకా’’ అని వైఎస్సార్‌సీపీ వాళ్లను బెదిరించాడు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒంటిమిట్టలో పోలింగ్ బూత్ లో రౌడీయిజం చేశాడు. రాయచోటి ఎమ్మెల్యే,మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఒంటిమిట్టలో ఏం పని?చంద్రబాబుకి ఇదే హెచ్చరికప్రజలు ఓటేస్తారనే నమ్మకం నీకుంటే ఎందుకు ఇలాంటి పనులు చేయడం చంద్రబాబు. ప్రజలు నీకు ఓటు వేయరనే ఇలా దిగజారిపోయావు?. గతంలో నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఇలానే చేశాడు. నంద్యాలలో గెలిచి సంకలు గుద్దుకున్నాడు. ఏడాదిలోనే నంద్యాలలో గెలిచాం. రాష్ట్రవ్యాప్తంగా టిడిపిని భూ స్థాపితం చేశాం. కళ్లుమూసి తెరిచేలోగా ఏడాదిన్నర గడిచిపోయింది. మరో మూడున్నరేళ్లు కూడా అలానే గడిచిపోతుంది. ప్రజాస్వామ్యం చేజారిపోతే నక్సలిజం పుడుతుంది. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలిజరిగిన రెండు ఎన్నికలను రద్దు చేయండి. చంద్రబాబు తప్పుడు పునాదులకు బీజం వేస్తున్నారు. రేపు ఇదే మీకు చుట్టుకుంటుంది. చంద్రబాబు జీవితానికి ఇదే చివరి ఎన్నిక కావొచ్చు. కృష్ణారామా.. అనుకుంటూ ఇప్పటికైనా మార్పు తెచ్చుకో. మీడియా ప్రతినిధి: ఎన్నిక రద్దు కోరతారా?ఇలా జరిగేవాటికి ఎన్నికలు జరపడం ఎందుకు?. అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం డమ్మీగా మారింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తులు, వ్యవస్థలు దిగజారిపోయారు. కచ్చితంగా ఈ ఎన్నికను కోర్టుల్లో సవాల్‌ చేస్తాం. మా అభ్యర్థులిద్దరినీ అందుకే పిలిపించాం. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో.. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రెండు ఉప ఎన్నికలు జరిపించాలని కోర్టులను కోరతాం. మీడియా ప్రతినిధి: ఓట్‌ చోరీ పేరిట ఇండియా బ్లాక్‌ చేపట్టిన ర్యాలీకి దూరంగా ఎందుకు ఉన్నారు?ఓట్లు చోరీ అయ్యాయని మాట్లాడే రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎందుకు మాట్లాడడు. ఎన్నికలకు సంబంధించి దేశంలోనే 12.5 శాతం తేడా ఉన్నది ఏపీలో మాత్రమే. అంటే.. పోలింగ్‌ నాటికి-కౌంటిగ్‌ నాటికి 48 లక్షల ఓట్లు పెరిగాయి. ఎలా?. ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జి మాణికం ఠాకూర్ ఏరోజైనా చంద్రబాబు గురించి మాట్లాడాడా?. కానీ, నా గురించి మాట్లాడుతున్నాడు. ఏపీలో జరుగుతున్న అక్రమాల పై ఏరోజైనా మాట్లాడాడా?. కాంగ్రెస్‌ అధిష్టానంతో చంద్రబాబు టచ్‌లో ఉన్నారు. రేవంత్‌ ద్వారా రాహుల్ గాంధీకి టచ్‌లో ఉన్నారు. ఏపీలో ఎన్నో స్కామ్‌లు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణం పెద్ద స్కాం. పీపీఏల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. వీటి గురించి కాంగ్రెస్‌ ఎందుకు మాట్లాడడం లేదు? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

Supreme Court sensational verdict on Kodandaram Ameer Ali Khan as MLCs2
వారి సభ్యత్వాలు రద్దు!

సాక్షి, న్యూఢిల్లీ: గవర్నర్‌ కోటాలో తెలంగాణ శాసనమండలికి ఎన్నికైన ఫ్రొఫెసర్‌ కోదండరాం, అమేర్‌ అలీఖాన్‌ల సభ్యత్వాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. గతేడాది ఆగస్టు 14న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును ధర్మాసనం తాజాగా సవరించింది. మధ్యంతర ఉత్తర్వు మేరకు తీసుకున్న చర్యలు ఏవైనా రద్దయినట్టేనని పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వులోని.. ‘తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తున్నాం..’ అనే వాక్యాన్ని తొలగిస్తున్నట్లు తెలిపింది. దీంతో 2024 ఆగస్టు 16న ప్రొఫెసర్‌ కోదండరాం, అమేర్‌ అలీఖాన్‌లు ఎమ్మెల్సీలుగా చేసిన ప్రమాణ స్వీకారాలు రద్దయినట్టయ్యింది. గవర్నర్‌ కోటాకు సంబంధించి భవిష్యత్తులో జరిగే నామినేషన్లు సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. కోదండరాం, అమేర్‌ అలీఖాన్‌ల నామినేషన్‌ను సవాల్‌ చేస్తూ దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం మధ్యంతర తీర్పు ఇచ్చింది. వారు ఎమ్మెల్సీలుగా మండలిలో తిరిగి ప్రవేశించాలంటే మళ్లీ సిఫారసు చేయబడాలని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండకూడదనే వాదనను తిరస్కరిస్తూ, ‘అప్పట్లో పిటిషనర్ల పేర్లు తిరస్కరించినప్పుడు కూడా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి..’ అని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్‌ 17వ తేదీకి వాయిదా వేసింది. సిఫారసులు.. తిరస్కరణ.. సిఫారసులు 2023 జూలైలో అప్పటి సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణల పేర్లను గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సిఫారసు చేసింది. అయితే సెప్టెంబర్‌లో అప్పటి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. వారికి రాజకీయ నేపథ్యం ఉండటాన్ని ప్రస్తావించడంతో పాటు, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 171(5)కు అనుగుణంగా వారి నియామకాలు లేవని పేర్కొంటూ వారి నామినేషన్లను తిరస్కరించారు. కాగా 2023 చివర్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరిలో ప్రొఫెసర్‌ కోదండరాం, జర్నలిస్టు అమేర్‌ అలీ ఖాన్‌లను గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేసింది. ఈ నామినేషన్లతో పాటు, గవర్నర్‌ తమ నామినేషన్లను తిరస్కరించడాన్ని దాసోజు, కుర్ర హైకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో 2024 మార్చిలో హైకోర్టు.. గవర్నర్‌ తిరస్కరణను రద్దు చేయడంతో పాటు కొత్త నామినేషన్లను కూడా కొట్టివేసింది. గవర్నర్‌ మంత్రివర్గ సలహా మేరకే వ్యవహరించాలని, సవరణలు కోరే హక్కు మాత్రమే ఉందని కోర్టు స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లగా, 2024 ఆగస్టు 14న ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుపై స్టే ఇచ్చింది. కోదండరాం, అమేర్‌ అలీ ఖాన్‌లు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసుకోవడానికి అనుమతించింది. అయితే వారి నామినేషన్లు తుది తీర్పుకు లోబడి ఉంటాయని తెలిపింది. తాజాగా బుధవారం జరిగిన వాదనల అనంతరం మధ్యంతర ఉత్తర్వును సవరించింది. మధ్యంతర ఉత్తర్వు ఆధారంగా తీసుకున్న అన్ని చర్యలు, అందులో ప్రమాణ స్వీకారాలు కూడా రద్దు అవుతాయని స్పష్టం చేసింది. ఇకపై ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం జరిగే ఏ కొత్త నామినేషన్లు అయినా, సెప్టెంబర్‌ 17న జరిగే విచారణ తర్వాత వచ్చే తుది తీర్పుపైనే ఆధారపడి ఉంటాయని తెలిపింది. కాగా గవర్నర్‌ తరఫున వాదించిన అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన సిఫారసు మేరకే గవర్నర్‌ ఆమోదం తెలిపారని వాదించారు. పిటిషనర్లు తమ నామినేషన్ల అమలును కాదు, గవర్నర్‌ తిరస్కరణను సవాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గవర్నర్‌ పూర్తిగా రాజ్యాంగపరమైన విధానాన్నే అనుసరించారని చెప్పారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్‌ వాదించారు. గవర్నర్‌.. ‘హైకోర్టుకు నేనుజవాబు చెప్పాల్సిన అవసరం లేదు..’ అని చెప్పారని తెలియజేయగా, ‘చాలా దురదృష్టకరం’ అని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు.

Sakshi Editorial On ZPTC Byelection in Andhra Pradesh3
ప్రజాస్వామ్యం ఖూనీ

కళ్లు మూసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం సాక్షిగా, రౌడీమూకల్లా చెలరేగిన పోలీసుల సాక్షిగా మంగళవారం వైఎస్సార్‌ జిల్లా పులివెందుల, అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో పచ్చమందలు అక్షరాలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. నిజమైన ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల సమీపానికి రాకుండా అధికార పక్షం దౌర్జన్యాలకు దిగితే.... వాటిని ఎదిరించి వచ్చినవారిని పోలీసులు తరిమికొట్టారు. ఓటు వేసేందుకు అనుమతించాలంటూ కాళ్లావేళ్లా పడినవారిని సైతం కనికరించలేదంటే... ఓటర్ల దగ్గర స్లిప్‌లు గుంజుకుని, మీ దగ్గర స్లిప్‌లు లేవుగనుక ఓటేయటం కుదరదని పోలీసులు దబాయించారంటే ఏపీలో పరిస్థితేమిటో అర్థంచేసుకోవచ్చు. ఏనాడూ సవ్యంగా అధికారంలోకి రావటం చేతగాని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రెండు స్థానాల్లో అక్షరాలా ప్రజాస్వామ్యాన్ని పాyð క్కించారు. దీన్ని కప్పిపుచ్చ టానికి బుధవారం రెండు కేంద్రాల్లో మాత్రం రీపోలింగ్‌ తంతు నిర్వహించి అయిందనిపించారు. తొలినాటి ఉదంతాలే మర్నాడూ పునరావృతమయ్యాయి. స్థానికేతర టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ చెలరేగిపోతుంటే చోద్యం చూసిన పోలీసులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ స్థానిక నాయకుల్ని అరెస్టులతో, గృహనిర్బంధాలతో ఎటూ కదలనివ్వలేదు. అభ్యర్థులను తిరగనివ్వలేదు.అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం అక్రమంగా నాలుగు గ్రామాల పోలింగ్‌ కేంద్రాలను 2 నుంచి 4 కిలోమీటర్ల దూరాల్లోవున్న వేరే గ్రామాలకు తరలించటంతోనే ఈ ఉప ఎన్నికల ప్రహసనం మొదలైంది. అన్ని కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటేయటం వృద్ధులకూ, అనారోగ్యం బారినపడిన వారికీ అసాధ్యమని లెక్కేసుకుని ఈ మార్పు చేశారు. మహిళలు, వృద్ధులతోసహా సాధారణ ఓటర్లంతా ఇలాంటి మాయోపాయాలను బేఖాతరు చేశారు. కానీ వారికి రక్షణగా నిలబడాల్సిన పోలీసులే వృత్తి ధర్మానికి ద్రోహం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ కేంద్రాలు మార్చటాన్ని హైకోర్టు తప్పుబట్టినా, చివరి నిమిషంలో సవరించటం అసాధ్యమని భావించింది. ఇదే అదునుగా జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు వంటి చోట్లనుంచి వచ్చిన రౌడీమూకలు ఎడాపెడా రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్‌ పోలింగ్‌ కేంద్రంలో వుండగానే దొంగ ఓటర్లు బారులు తీరారంటే ఈ బరితెగింపు ఏ స్థాయిలో వున్నదో అర్థం చేసుకోవచ్చు. తెలిసో తెలియకో తమ ‘ఘనత’ను చాటుకోవటానికి జిల్లా కలెక్టర్‌ ఈ ఫొటోలనే సామాజిక మాధ్యమాల్లో వుంచి నగుబాటుపాలై తిరిగి వాటిని తొలగించాల్సి వచ్చింది. అధికారులకు వ్యక్తిగత స్థాయిలో ఇష్టాయిష్టాలుండొచ్చు. అధికార పార్టీకి పరిచారికలుగానో, పాలేళ్లుగానో మారాలని ప్రాణం కొట్టుమిట్టాడొచ్చు. అలాంటివారు రాజీనామా చేసి పోవాలితప్ప, జనం ఎంతో కష్టపడి పన్నుల రూపంలో చెల్లించే సొమ్మును నెలనెలా జీతాలుగా తీసుకుంటూ... కుటుంబాలను పోషించుకుంటూ కాలసర్పాల మాదిరిగా అదే జనాన్ని కాటేయాలని చూడకూడదు. సిగ్గూ లజ్జా, మానాభిమానాలు వున్నవారెవరైనా ఇలాంటి హీనస్థితికి దిగజారతారా? ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి తరమటం మాత్రమే కాదు... కనీసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోలింగ్‌ ఏజెంట్లను కూడా పోలింగ్‌ కేంద్రాల్లోకి రానీయకుండా నిర్వహించిన ఈ ఉప ఎన్నికలు ‘ప్రశాంతంగా’ జరిగాయని ప్రకటించటానికి అధికార యంత్రాంగానికి ఏమాత్రం సిగ్గనిపించకపోవటం విస్మయం కలిగిస్తుంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 15 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకం అని సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల సంఘమే ప్రకటించింది. మరి అక్కడుండే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఏజెంట్లకు భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా? మంత్రి సమక్షంలోనే పోలింగ్‌ ఏజెంటును ఒక్కడిని చేసి అత్యంత దారుణంగా కొట్టారన్న సమాచారం ఆ సంఘానికి చేరిందా? అనేకచోట్ల ఏజెంట్లు లేకుండానే పోలింగ్‌ కొనసాగిన వైనం ఆ సంఘానికి తెలుసా? ఓటర్లెవరో, కానివారెవరో గుర్తించటానికి ఏజెంట్లుంటారు. పోలింగ్‌ పూర్తయ్యాక అంతా సవ్యంగా పూర్తయినట్టు వారినుంచి సంతకాలు తీసుకుంటారు. జరిగిన తంతు చూస్తుంటే ఆ సంతకాలను కూడా ఫోర్జరీ చేయదల్చుకున్నారా అనే సంశయం ఏర్పడుతోంది.పోయే కాలానికి కుక్కమూతి పిందెలని నానుడి. సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా అక్రమాలకు పాల్పడటం ఆదినుంచీ అలవాటైన బాబుకు ‘అతని కంటె ఘనుడ’న్నట్టు పుత్రరత్నం తోడయ్యాడు. అందుకే ఈసారి బరితెగింపు అవధులు దాటిన వైనం కనబడుతోంది. ఇలాంటి దుష్టపోకడల్ని చూస్తూ వూరుకుంటే ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టదు. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలి. ప్రహసన ప్రాయంగా మారిన ఈ ఉప ఎన్నికలను రద్దుచేయాలి. బాధ్యులైన అధికార్లను సాగనంపాలి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసినట్టు కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి పోలింగ్‌ నిర్వహించాలి.

Sakshi Guest Column On world is looking towards India4
భారత్‌ వైపు ప్రపంచం చూపు!

ఇప్పుడు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్నదనటంలో అతిశయోక్తి లేదు. ఈ పరిణామం ఈ నెల 6వ తేదీన చోటుచేసుకుంది. ఆ రోజున అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌పై సుంకాలను మరొక 25 శాతం పెంచి, మొత్తం 50 శాతానికి చేర్చారు. దానితో మోదీ ప్రభుత్వం ఒత్తిడికి గురై రష్యన్‌ చమురు కొనుగోళ్ళను ఆపటంతో పాటు, వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలో తమ ప్రతిపాదనలకు అంగీకరించగలదన్నది ట్రంప్‌ ఎత్తుగడ. అనూహ్యమైన రీతిలో ప్రధాని మోదీ అదేరోజు రాత్రి ఎదురుదాడి ప్రారంభించారు.ప్రపంచం కోసం నిలబడగలమా?ట్రంప్‌ చర్యలను చైనా, బ్రెజిల్, యూరోపియన్‌ యూనియన్, కెనడా, జపాన్, దక్షిణాఫ్రికా, రష్యా వంటివి మొదటి నుంచి పూర్తిగానో, పాక్షికంగానో వ్యతిరేకిస్తుండటంలో విశేషం లేదు. వీటన్నింటికి భిన్నంగా పెద్ద దేశాలలో ఇండియా ఒక్కటే మొదటి నుంచి అమెరికాతో మెత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. ఒక పెద్ద వర్ధమాన దేశం అయి ఉండి, ‘బ్రిక్స్‌’లో ప్రధాన పాత్ర వహిస్తూ, ట్రంప్‌ చర్యల కారణంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తున్నా, ప్రతిఘటించకపోవటంపై అంతటా విమర్శలు వినిపించాయి. అటువంటి స్థితిలో మోదీ చేసిన ప్రసంగం, అందులోని భాష, తనలో కనిపించిన దృఢమైన వైఖరి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడిక ఆయన భారతదేశం కోసమే గాక, తక్కిన ప్రపంచంతో కూడా కలిసి నిలబడవచ్చుననే ఆశాభావాలు వినవస్తున్నాయి.అదే సమయంలో, ఇల్లలకగానే పండుగ కాదనే పెద్దల హెచ్చరికను గుర్తుంచుకోవలసి ఉంటుంది. వీటికి స్వల్పకాలిక, మధ్యకాలిక ప్రభావాలు అనేకం ఉంటాయి. అవి వాస్తవంగా భూకంపానికి దారితీయగలవు. స్లో మోషన్‌లో ఆర్థిక ప్రపంచ యుద్ధాన్ని సృష్టించగలవు. మన ప్రపంచం నిజమైన అర్థంలో రాజకీయంగా, ఆర్థికంగా, ప్రజాస్వామికంగా మారాలంటే, చిరకాలపు అధిపత్య శక్తుల భూమి కింద అటువంటి భూకంపం రావటం అవసరం.కొండ చరియలలో కింది వైపున కేవలం ఒక రాయి కదలికలో మొత్తం చరియలే కూలినట్లు, చరిత్రలో ఒకోసారి చిన్న ఘటనలు పెనుమార్పులకు దారి తీస్తుంటాయి. క్రమంగా బలహీనపడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థను, భౌగోళిక ఆధిపత్యాన్ని తిరిగి శక్తిమంతం చేయదలచిన ట్రంప్, అమెరికన్‌ కొండచరియలో ఒకొక్క రాయినే తనకు తెలియకుండానే తోసివేస్తున్నారు. ఇప్పుడు ఇండియా రూపంలో ఒక ముఖ్యమైన రాయి తొలగిపోతున్నదనుకోవాలా?ఇండియా దృఢ వైఖరినిజంగానా, లేక ఇది తొందరపాటు మాటా అన్నది ప్రశ్న. ఒకవైపు అమెరికా నాయకత్వాన ఒక శక్తిమంతమైన కూటమి ఉంది. అది బలహీన పడుతున్న మాట నిజమేగాని అవసాన దశకేమీ చేరలేదు. మరొకవైపు భారత్‌తో కూడిన ‘బ్రిక్స్‌’ దేశాలు నానాటికీ బలపడుతున్నాయి. ఇది తమ ఆధిపత్యానికి ఎంత ప్రమాదకరం కాగలదో అర్థమైనందువల్లనే ట్రంప్‌ ‘బ్రిక్స్‌’పై కత్తిగట్టారు. ఆయన వేర్వేరు దేశాలపై వేర్వేరుగా ప్రకటిస్తున్న ట్యారిఫ్‌లను, వేర్వేరు పద్ధతులలో సాగిస్తున్న చర్చలను గమనిస్తే, ‘బ్రిక్స్‌’ దేశాల పట్ల ‘విభజించి పాలించే’ వ్యూహాన్ని అనుసరిస్తున్నటు స్పష్టమవుతుంది.చర్చలోకి వెళితే, మోదీ నాయకత్వాన భారతదేశానికి అమెరికాతో అవసరాలున్నాయి, పేచీలు కూడా ఉన్నాయి. గతకాలపు చిన్నచిన్న పేచీలను అటుంచి ఇప్పుడు ట్యారిఫ్‌లతో, వాణిజ్య ఒప్పందంలోని ప్రతిపాదనలతో పెద్ద పేచీ తలెత్తింది. ఒకవైపు భారతదేశం స్వతంత్ర శక్తిగా గతం కన్నా బలపడుతూ తన భవిష్యత్తు పట్ల దృష్టి మారుతుండటం, మరొకవైపు అమెరికా క్రమంగా బలహీనపడుతూ ఏకధ్రువ ప్రపంచ స్థితి మారుతుండటం గమనించవలసిన కొత్త పరిణామాలు.ఇటువంటిది ఏర్పడినపుడు, వ్యూహాత్మకంగా అగ్రరాజ్యం ఎంతో వివేకంగా, చతురతతో వ్యవహరించాలి. ట్రంప్‌ నాయకత్వాన అమెరికా అవివేకపు వ్యూహాన్ని అనుసరిస్తున్నందున, ఇండియా వంటి మిత్రదేశంతోనూ సంబంధాలు చెదిరిపోతున్నాయి. అట్లా జరగకుండా ఉండేందుకు మోదీ మొదట గట్టి ప్రయత్నమే చేశారు. కానీ, ఏమి చేసైనా సరే తన ‘మాగా’ లక్ష్యాలను సాధించాలనే ఒత్తిడుల మధ్య అమెరికా అధ్యక్షుడు– యూరప్, కెనడా, జపాన్, మెక్సికో వంటి ఇతర మిత్ర దేశాలకు వలెనే ఇండియాను కూడా దారికి తెచ్చుకోగలనని నమ్మారు. వాటికీ,భారత్‌కూ మధ్యగల వ్యత్యాసాలను గ్రహించలేకపోయారు. దానితో, ఇంధనం అయితేనేమి, వ్యవసాయ రంగం అయితేనేమి... దేశ ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం నిలబడక తప్పలేదు. వాస్తవానికి వ్యవసాయ రంగం విషయమై, గాట్‌ – డబ్ల్యూటీవో చర్చల దశలో ఇండియా ఇతర వర్ధమాన దేశాలతో కలిసి గట్టిగానే నిలబడింది. అదే ఇపుడు కూడా జరుగుతున్నది. పాఠాలు నేర్చుకోనిది అమెరికా కూటమే!ఆర్థిక భూకంపం రానుందా?ఇంతవరకు బాగున్నది. రాగల కాలపు పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. ట్రంప్‌ తన ధోరణిని మార్చుకుని అంతా సుఖాంతం కావచ్చునా? భారతదేశంతో తగినంత రాజీ పడవచ్చునా? ట్రంప్‌ స్వభావమేమిటో ఈ సరికి బోధపడింది గనుక ఆయనను నమ్మలేమని ప్రధాని మోదీ తన స్వతంత్ర వైఖరిని కొనసాగించగలరా? మొన్నటి 6వ తేదీ తర్వాత వడివడిగా రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలాతో సంప్రతింపులు జరిపి, పుతిన్‌ను ఆహ్వానించి, చైనాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశాలకు వెళ్ళనున్నట్లు ప్రకటించి, అక్కడ జిన్‌పింగ్‌తో సమావేశం జరగవచ్చుననే సంకేతాలు పంపినందున, ఇవన్నీ మునుముందు బ్రిక్స్‌ వేదికగా కొత్త మార్గాన్ని మరింత దృఢంగా అనుసరించగలమనే సూచనలు కావచ్చునా? అటువంటిది గనుక అయితే, ఆగస్టు 6 నాటి భూ ప్రకంపనలు రాగల కాలపు భూకంపానికి నాంది అవుతాయి. అట్లా జరగాలన్నదే వర్ధమాన ప్రపంచపు కోరిక కావచ్చు కూడా! కానీ అది తేలిక కాదు. ట్రంప్‌ ప్రతీకారాన్ని తట్టుకునేందుకు సైతం సిద్ధపడవలసి ఉంటుంది.టంకశాల అశోక్‌ వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

Increase in life tax slabs5
లైఫ్‌ ట్యాక్స్‌ శ్లాబుల పెంపు

సాక్షి, హైదరాబాద్‌: కొత్త వాహనాల కొనుగోలు సమయంలో చెల్లించే జీవితకాల పన్ను (లైఫ్‌ ట్యాక్స్‌) మొత్తాన్ని ప్రభుత్వం సవరించింది. వాహన ధరల ఆధారంగా ఇప్పటివరకు అమలులో ఉన్న శ్లాబులను పెంచటం ద్వారా వీలైనంత మేర పన్ను ఆదాయం పెరిగేలా నిర్ణయం తీసుకుంది. ఆ సవరింపునకు సంబంధించి నోటిఫికేషన్‌ ఉత్తర్వు జారీ చేసింది. ఇది గురువారం నుంచి అమలులోకి రానుంది. దీంతో పాటు వాహనాల ఫ్యాన్సీ నంబర్ల ధరలను కూడా భారీగా పెంచాలని నిర్ణయించింది. ఆ పెంపు మొత్తాన్ని వెల్లడిస్తూ అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా తెలపాల్సిందిగా నోటిఫికేషన్‌ జారీ చేయటం విశేషం. రవాణా శాఖ ద్వారా ఆదాయాన్ని పెంచుకునే యత్నంలో ఉన్న ప్రభుత్వం.. ఇటీవలే రిజిస్ట్రేషన్‌ చార్జీలను సవరించిన విషయం తెలిసిందే. గతంలో 2..ఇప్పుడు 4 వాహనాల ధరల ఆధారంగా పన్ను మొత్తాన్ని నిర్ధారించే శ్లాబులు అమలులో ఉంటాయి. ఉదాహరణకు ద్విచక్రవాహనాలకు సంబంధించి పరిశీలిస్తే.. ప్రస్తుతం వాహనం ధర రూ. 50 వేల లోపు, వాహనం ధర రూ.50 వేల కంటే ఎక్కువ.. ఇలా రెండు శ్లాబులు మాత్రమే అమలులో ఉన్నాయి. ఆ రెండు శ్లాబులకు నిర్ధారిత జీవితకాల పన్ను (వాహనం విలువలో నిర్ధారిత శాతం) కూడా ఖరారై ఉంది. తాజాగా వాహన ధర శ్లాబులను పెంచారు. వాహన విలువ రూ.50 వేల లోపు, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు , రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు, రూ.2 లక్షల కంటే ఎక్కువ.. ఇలా శ్లాబుల సంఖ్యను నాలుగుకు పెంచారు.

Amaravati Capital Submerged Due To Rains6
నీట మునిగిన ‘ఏపీ రాజధాని’

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి నీట మునిగింది. అమరావతి కోర్ క్యాపిటల్ వరద ముంపులో చిక్కుకుంది. అమరావతి రాజధాని గ్రామాలు వర్షానికి మునిగాయి. ఏపీ రాజధాని అమరావతి.. కృష్ణా నదిని తలపిస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి రాజధానిలోకి భారీ స్థాయిలో వరద నీరు చేరుకుంది. కొండవీటి వాగు, పాలవాగు పొంగిపొర్లుతుంది. నీరుకొండ వద్ద కొండవీటి వాగు పొంగి పొర్లుతోంది. దీంతో కనుచూపుమేరలో రాజధానిలో భూమి కనిపించడం లేదు.వేల ఎకరాలు భూములు నీటమునిగాయి. నీరుకొండ వద్ద వర్షపు నీరు గంట గంటకు పెరుగుతోంది. శాఖమూరు, ఐనవోలు, కృష్ణాయ పాలెం, నీరుకొండ, కురగల్లు, ఎర్రబాలెం, పెనుమాక, బేతపూడి పొలాల్లోకి వరద నీరు చేరింది. ఎస్‌ఆర్‌ఏం యూనివర్సిటీ చుట్టూ భారీగా వరద నీరు చేరుతోంది. హైకోర్టుకు వెళ్లే రోడ్డు మార్గం జలమయంగా మారింది. రాజధాని నిర్మాణాల చుట్టూ వరద నీరు పెరుగుతోంది. పొంగి ప్రవహిస్తున్న కొండవీటి వాగు, పాలవాగుతో వేలాది ఎకరాల నీటమునిగాయి.ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా పోటెత్తుతోంది. దీంతో అధికారులు.. మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. విజయవాడకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలతో డ్రైనేజీలు, మ్యాన్‌ హోల్స్‌ పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నది ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. గుంటూరు, తాడికొండ మధ్య రాకపోకలు బంద్‌ అయ్యాయి. మంగళగిరిలో ఇళ్లలోకి వరద నీరు చేరింది.నీట మునిగిన అమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణంఅమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణం కూడా నీట మునిగిపోయింది. ఐకానిక్ టవర్ నిర్మాణం చుట్టూ వరద నీరు చేరింది. రాయపూడిలో ఐకానిక్‌ టవర్ నిర్మాణం అవుతోంది. అమరావతి ఐకానిక్ టవర్ ప్రాంతం చెరువులా మారిపోయింది.

Man Ask For Rain Allowance HR reaction Viral Social Media7
వానాకాలం కదా.. మరి స్పెషల్‌ అలవెన్స్‌ ఉందా?

ఉద్యోగి అంటే ఒక సంస్థలో గంటలకొద్దీ పని చేసే రోబో కాదు. మనస్ఫూర్తిగా తన బుర్రకు పని చెప్పి ఆ సంస్థకు తన సేవలు అందించడం. అందుకే కంపెనీల్లో చాలావరకు జీతం ఇచ్చి చేతులు దులుపుకోవడం లేదు. ఉద్యోగిని సంతృప్తి పరిచేందుకు కూపన్లని, బోనస్‌లని, అలవెన్సులని ఎక్సెట్రా.. ఎక్సెట్రా అందిస్తుంటాయి.సాధారణంగా ఇంటర్వ్యూలలో జీతం ఎక్కువ ఇవ్వమనో లేకుంటే వాళ్ల వాళ్ల అవసరాలను హెచ్‌ఆర్‌లకు తెలియజేస్తుంటారు. అయితే.. ఓ ఉద్యోగాభ్యర్థి ‘లెక్క’ మాత్రం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. కంపెనీలు కొత్త పాలసీ తీసుకురావాలన్న చర్చ డిమాండ్‌కు దారి తీసింది. ఢిల్లీ కంపెనీ హెచ్‌ఆర్‌ ఒకరు.. తాజాగా ఓ వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు. అయితే తనకు ఇవ్వబోయే ప్యాకేజీకి వానకాలంలో కాస్త అదనంగా జీతం చేర్చాలని ఆ హెచ్‌ఆర్‌ను కోరాడతను. అందుకు కారణం ఏంటి? అని హెచ్‌ఆర్‌ అడగ్గా.. వానాకాలంలో తన ఆఫీస్‌ ప్రయాణాలకు అయ్యే ఖర్చును కంపెనీనే భరించాలన్నాడు. ‘‘సాధారణ రోజుల్లో నాకు అయ్యే ఖర్చు కంటే వానాకాలంలో కాస్త ఎక్కువే. కాబట్టి కంపెనీ రెయిన్‌ అలవెన్స్‌ చెల్లించాలి’’ అని కోరాడతను. అయితే మునుపెన్నడూ వినని ఆ ప్రస్తావనతో హెచ్‌ఆర్‌ కాస్త అయోమయానికి గురైనా వెంటనే తేరుకుని.. అలాంటి పాలసీ తమ కంపెనీలో లేదని బదులిచ్చారు... ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, బెంగళూరులాంటి మహానగరాల్లో వర్షాలు పడేటప్పుడు ట్రాఫిక్‌ చిక్కులు షరామామూలేనని, అలాంటి సమయంలో క్యాబ్‌ తరహా సేవల ఖర్చు తడిసి మోపెడు అవుతుందని.. అలాంటప్పుడు రెయిన్‌ అలవెన్స్‌ కోరడం ఎంతవరకు సబబని ఆ హెచ్‌ఆర్‌ ఆ ఉద్యోగ అభ్యర్థిని ప్రశ్నించారు. దీంతో ఆ వ్యక్తి సాధారణ రోజుల్లో తనకు అయ్యే ఖర్చును.. వానాకాలంలో ఆఫీస్‌ ప్రయాణాలకు అయ్యే ఖర్చను లెక్కేసి మరీ హెచ్‌ఆర్‌కు వివరించారు. అదే సమయంలో.. అలాంటి చెల్లింపులు(రెయిన్‌ అలవెన్స్‌) వీలులేని పక్షంలో వర్క్‌ఫ్రమ్‌ హోం వెసులుబాటు కల్పించాలని, అదీ కుదరకుంటే ఆలస్యంగా వచ్చేందుకైనా అనుమతించాలని కోరాడతను. ఆ వ్యక్తి సెలక్ట్‌ అయ్యాడో లేదో తెలియదుగానీ.. ఈ ఇంటర్వ్యూ వివరాలను ఆ హెచ్‌ఆర్‌ రెడ్డిట్‌లో పంచుకున్నారు. దీంతో ఆ ఉద్యోగ అభ్యర్థికి మద్దతుగా చాలామంది పోస్టులు పెడుతున్నారు. అంతెందుకు ఆ హెచ్‌ఆర్‌ కూడా ఆ వ్యక్తి కోరింది సబబుగానే ఉందంటే ఆ పోస్టులో ప్రస్తావించడం గమనార్హం. ‘‘ఇంటర్వ్యూలో విచిత్రంగా అనిపించిన అతని కోరిక.. ఇప్పుడు సబబుగానే అనిపిస్తోంది’’ అంటూ పోస్ట్‌ చేశారా హెచ్‌ఆర్‌. అంతేకాదు.. తాను కూడా ఆఫీస్‌కు క్యాబ్‌లలోనే వెళ్తానని, వానకాలంలో అతను చెప్పినట్లు పోల్చుకుంటే అధిక ఖర్చులే ఉంటున్నాయని.. అతను కోరింది విచిత్రమైనదేం కాదని ఆ పోస్టులో ఆ హెచ్‌ఆర్‌ పేర్కొన్నారు. వానాకాలం కావడం, ప్రయాణాల్లో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పోస్ట్‌ ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది.

how do companies like Gpay and PhonePe earn crores explainer8
ఫ్రీ స‌ర్వీస్‌.. మ‌రి ఆదాయం ఎలా వ‌స్తుంది?

పాల‌ప్యాకెట్ నుంచి పిజా వ‌ర‌కు ఏం కొన్నాల‌న్నా ఫోన్‌తో క్యుఆర్ కోడ్ స్కాన్ చేసి డ‌బ్బులు చెల్లిస్తున్నాం. జేబులో రూపాయి లేక‌పోయినా యూపీఐ ద్వారా కావాల్సిన‌వి కొనేస్తున్నాం. యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్ (యూపీఐ) అందుబాటులోకి వ‌చ్చాక ఆర్థిక లావాదేవీలు చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. ఎటువంటి స‌ర్వీసు చార్జి లేకుండానే చెల్లింపులు జ‌రుగుతుండ‌డంతో మ‌నోళ్లు యూపీఐ సేవ‌ల‌ను విరివిగా వాడేస్తున్నారు. దీంతో మ‌న దేశంలో ప్ర‌తిరోజు కోట్ల రూపాయల లావాదేవీలు జ‌రుగుతున్నాయి.రూపాయి నుంచి ల‌క్ష వ‌ర‌కు ఎటువంటి చార్జీలు లేకుండానే యూపీఐ ద్వారా న‌గ‌దు లావాదేవీలు జ‌రుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, భీమ్‌ వంటి డిజిట‌ల్ యాప్‌ల‌ సేవ‌ల‌ను యూపీఐ (UPI) కోసం ఎక్కువ‌గా వాడుతున్నారు. వినియోగ‌దారుల నుంచి ఎటువంటి రుసుములు వ‌సూలు చేయ‌కుండానే ఈ కంపెనీలు స‌ర్వీస్ అందిస్తున్నాయి. న‌గ‌దు లావాదేవీల‌పై ఎలాంటి చార్జీలు తీసుకోకుండా ఈ సంస్థ‌లు ఎలా మ‌న‌గ‌లుగుతున్నాయి? అంతేకాకుండా ప్ర‌తి సంవ‌త్స‌రం కోట్ల రూపాయాల ఆదాయాన్ని ఏవిధంగా ఆర్జిస్తున్నాయి? క‌స్ట‌మ‌ర్ల‌కు ఉచితంగా సేవలు అందించాల్సిన అవ‌స‌రం ఏముంది? ఈ కంపెనీలు న‌డ‌ప‌డానికి అవ‌స‌ర‌మైన‌ డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌స్తుంది? వినియోగ‌దారుల నుంచి రుసుములు వ‌సూలు చేయ‌కుండా, ఉత్ప‌త్తులేవీ విక్ర‌యించ‌కుండా ఎలా సంపాదిస్తున్నాయి? ఉచితంగా ఉపయోగించే ఈ డిజిటల్ యాప్‌లు ఏ ఉత్పత్తిని అమ్మకుండానే ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాయంటే.. దానికి కార‌ణం క‌స్ట‌మ‌ర్ల‌ న‌మ్మ‌కం. న‌మ్మ‌కం ఆధారంగా ఏర్ప‌డిన ప్రత్యేకమైన వ్యాపార నమూనా నుంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. డిజిటల్ యాప్‌ల నుంచి చెల్లించిన సొమ్ములు ఎక్క‌డికి పోవ‌న్న భ‌రోసాతోనే వినియోగదారులు ఈ సేవ‌ల‌ను ఉప‌యోగించుకుంటున్నారు.స్పీకర్ సర్వీస్‌తో..డిజిటల్ యాప్‌ల ఆదాయంలో ఎక్కువ భాగం చిన్న కిరాణా దుకాణాల్లో ఉపయోగించే వాయిస్- ఆపరేటింగ్ స్పీకర్ సర్వీస్ ద్వారా వ‌స్తుంది. మ‌నం దుకాణం నుండి వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత చెల్లింపు చేసినప్పుడల్లా.. డ‌బ్బులు వచ్చాయని చెప్పే వాయిస్ వినబడుతుంది. ఈ స్పీకర్‌ను కంపెనీ నెలకు రూ.100కి దుకాణదారులకు అద్దెకు ఇస్తుంది. మ‌న దేశంలో దాదాపు 30 లక్షలకు పైగా స్పీకర్లు దుకాణాల‌కు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా రూ.30 కోట్లు, ఏటా రూ.360 కోట్ల వ‌ర‌కు సంపాదిస్తున్నాయి.స్క్రాచ్ కార్డులతో ఖుష్‌దీంతో పాటు స్క్రాచ్ కార్డుల ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతున్నాయి. ఈ కార్డులు క్యాష్‌బ్యాక్ లేదా కూపన్‌లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో పాటు వివిధ బ్రాండ్ల వాణిజ్య‌ ప్ర‌క‌ట‌న‌ల‌ను జ‌నాల్లోకి తీసుకెళుతున్నాయి. అందుకే స్క్రాచ్ కార్డులకు ఆయా బ్రాండ్లే సొమ్ములు చెల్లిస్తాయి. ఫ‌లితంగా జీపే, ఫోన్‌పే (Phone pay) వంటి డిజిట‌ల్ యాప్‌లు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతాయి. ఒక‌వైపు క‌స్ట‌మ‌ర్ల‌కు ఆక‌ర్ష‌ణీయ ఆఫ‌ర్లు, మ‌రోప‌క్క బ్రాండ్ల ప్ర‌మోష‌న్‌తో డిజిట‌ల్ యాప్‌లు దూసుకుపోతున్నాయి.చ‌ద‌వండి: డిబ్బి డ‌బ్బుల‌తో కాలేజీ ఫీజులు క‌ట్టేస్తున్న స్కూల్ విద్యార్థులుపెరుగుతున్న‌ ఆద‌ర‌ణ‌ త‌క్ష‌ణ న‌గ‌దు లావాదేవీలు, బిల్లుల చెల్లింపుల పాటు వివిధ రకాల యూపీఐ సేవ‌ల‌ను సులువుగా పొందే వీలుండ‌డంతో ఉచిత డిజిట‌ల్ యాప్‌లకు ఆద‌ర‌ణ ఎక్కువ‌గా ఉంది. దీంతో మ‌న దేశంలో ప్ర‌తినెలా వేల కోట్ల‌లో యూపీఐ న‌గ‌దు లావాదేవీలు జ‌రుగుతున్నాయి. జూలైలో 19.47 బిలియన్‌ లావాదేవీలు (1947 కోట్లు) నమోదైనట్టు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకటించింది.

Former Jammalamadugu Mla Sudheer Reddy Arrested9
జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అరెస్ట్‌

సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పోలీసులు అరెస్ట్‌ చేశారు. యర్రగుంట్లలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సుధీర్‌రెడ్డితో పాటు 30 మందిపై కేసులు నమోదు చేశారు. నిన్న(మంగళవారం) వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అక్రమ అరెస్ట్‌ను సుధీర్‌రెడ్డి అడ్డుకున్నారు. కూటమి అరాచకాలకు వ్యతిరేకంగా నిన్న ఆయన ర్యాలీ నిర్వహించారు.కాగా, పులివెందులలో నిన్న (మంగళవారం) సూర్యోదయానికి ముందే పచ్చ ఖాకీలు గూండాగిరీకి తెరతీసిన సంగతి తెలిసిందే. భారీగా పోలీసు అధికారులు, సిబ్బంది వేకువజామునే ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి నివాసంపై దండెత్తారు. దురాక్రమణదారుల మాదిరిగా ఇంట్లోకి దూసుకెళ్లారు. ఎంపీని అక్రమంగా అరెస్టు చేశారు. ఎంపీగా తన నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీ ఉప ఎన్నికలను పర్యవేక్షించడం ఆయన హక్కు, బాధ్యత. కానీ, దీన్ని పోలీసులు కాలరాశారు. ఆయనను అక్రమంగా అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు.పోలీసుల దౌర్జన్యంపై వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసన తెలపగా వారిని ఈడ్చి పడేశారు. ఎంపీని తమ వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని ముద్దనూరు వైపు తీసుకువెళ్లారు. నిడిజివ్వి గ్రామంలో మాజీ ఎమ్మె­ల్యే సుధీర్‌రెడ్డి ఇంటి వద్ద దింపి ఇక్కడే ఉండాలని ఆదేశించారు. అక్కడికి వై­ఎస్సార్‌సీపీ కార్యకర్త­లు భారీగా తరలివచ్చారు.పోలీసుల అరాచకాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు యర్రగుంట్ల వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు.

Supreme Court Bench To Hear Stray Dog Case Tomorrow10
వీధికుక్కల తరలింపు తీర్పుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ: వీధికుక్కలను షెల్టర్లకు తరలించాలని ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు పునఃసమీక్షించనుంది. గురువారం ఈ అంశంపై విచారణ చేపట్టనుంది.దేశరాజధానిలో వీధికుక్కల స్వైరవిహారంతో విసిగిపోయిన సుప్రీంకోర్టు సోమవారం జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్‌ల ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. రేబిస్ వ్యాధి, కుక్క కాటు,ప్రజల భద్రత అంశాలను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కూడా కనిపించకూడదని, షెల్టర్లకు తరలించాలని స్పష్టం చేసింది. ఆదేశాలను అడ్డుకునే ఏ సంస్థ అయినా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.అదే సమయంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధుల్లో ఆహారం పెట్టే ప్రేమికులు, తమ ఇంట్లోనే పెట్టొచ్చుగా? అని కోర్టు ప్రశ్నించింది. రేబిస్‌తో ప్రాణాలు కోల్పోయిన వారిని తిరిగి తీసుకురాగలరా? అంటూ జంతు హక్కుల కార్యకర్తలపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధికుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వొద్దని స్పష్టం చేసింది.అయితే, ఈ తీర్పుపై వివాదం చెలరేగింది. జంతు ప్రేమికులు ఈ తీర్పును సవాలు చేశారు. సుప్రీంకోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశారు. వీధికుక్కల షెల్టర్లకు తరలింపుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ స్పందించారు. ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునసమీక్షిస్తామని తెలిపారు.ఈ క్రమంలో బుధవారం ప్రధాన న్యాయమూర్తి గవాయ్ ఆదేశాల మేరకు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజరియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును రేపు విచారించనుంది.#BREAKING Delhi Stray dog case referred to SC 3-judge bench.A 3-judge bench of the #SupremeCourt to hear the case tomorrow.This is different from the 2-judge bench.A bench of Justices Vikram Nath, Sandeep Mehta and NV Anjaria will hear the matter tomorrow. pic.twitter.com/o0RSdoXyXp— Kashmir Dot Com (KDC) (@kashmirdotcom) August 13, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement