Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

sajjala ramakrishna reddy Serious Comments ON CBN Govt1
ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ.. టీడీపీ నేతలకు పోలీసుల వత్తాసు: సజ్జల

సాక్షి, గుంటూరు: ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్‌లో పోలీసు రాజ్యాంగం నడుస్తోందన్నారు. టీడీపీ నేతలు దాడులు చేస్తే పోలీసులే ప్రొటెక్ట్‌ ఇస్తున్నారని విమర్శించారు.వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్‌లో పోలీసు రాజ్యాంగం నడుస్తోంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే ప్రభుత్వం పెద్దలకు వత్తాసు పలుకుతున్నారు. ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. ఏపీలో ప్రజాస్వామ్యం లేదు. టీడీపీ నేతలు దాడులు చేస్తే పోలీసులే ప్రొటెక్ట్‌ ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం చేశారు. నాగమల్లేశ్వరరావు ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. సర్పంచ్ నాగమల్లేశ్వరావు కోలుకుంటారని ఆశిస్తున్నాను. మృత్యుంజయుడిగా బయటకు వస్తాడని భావిస్తున్నాను. నాగమల్లేశ్వరరావు పైన జరిగిన దాడి రాజకీయపరమైన హత్యాయత్నం. దాడికి సంబంధించిన సీసీ కెమెరా విజువల్స్ భయానకంగా ఉన్నాయి. అంబటి మురళి పైనే కేసు నమోదు చేశారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది. దాడికి రెచ్చగొట్టేలా మాట్లాడిన ధూళిపాళ్లపై కేసు పెట్టలేదు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుంది. వైఎస్సార్‌సీపీ నేతల పైనే దాడులు చేయమని నేరుగా చెబుతున్నారు. నాగమల్లేశ్వరావుపై దాడి చేసిన నిందితులకు సన్మానం చేసినా చేస్తారు.పెదకూరపాడు మాజీ ఎంపీపీని ఏడాది క్రితం దారుణంగా కొట్టారు. నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి చేస్తే చర్యలేవి?. గుడివాడలో జడ్పీ చైర్‌పర్సన్‌పైన దాడి జరుగుతుంటే పోలీసులు అక్కడే ఉన్నాడు అడ్డుకోలేదు. ప్రజాస్వామ్యయుతమైన హక్కులను వైఎస్సార్‌సీపీ నేతల్ని వినియోగించుకోనివ్వడం లేదు. రాష్ట్రం పోలీస్ రాజ్యంగా మారిపోయింది. వైఎస్‌ జగన్‌ ఇప్పటివరకూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. జగన్ పర్యటనకు వచ్చినప్పుడల్లా వందల్లో కేసులు నమోదు చేస్తున్నారు. మామిడి రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్తే మామిడి యార్డు మూసివేశారు.చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్న పోలీసు రాజ్యం ఇది. ఎన్నికల్లో తీర్పు ఇవ్వాల్సింది ప్రజలే. అందుకే ప్రజలకు చెబుతున్నాం. వైఎస్సార్‌సీపీని చంద్రబాబు దుర్మార్గంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని మానసికంగా వేధిస్తున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే జగన్ ఎందుకు బయటకొస్తారు. మిర్చి రైతుల కంట కన్నీరు కారుతుంది. ప్రైవేటు కేసు వేసేందుకు ప్రయత్నిస్తున్నాం.రైతులు పైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని ఎస్పీ అంటున్నాడు. ఆయన పోలీసా లేక రాజకీయనాయకుడా?. ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఏమైనా విధించారా అంటే అది లేదు. మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన కొద్దీ మేము రాటు తేలేలా చంద్రబాబు చేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజలను పట్టించుకోలేదు‌. అందుకే ఆయనొస్తే పది మంది బయటకు రావటం లేదు. వ్యవస్థల్ని మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటు. ప్రజల గురించి ఆలోచించడం జగన్‌కు అలవాటు. అందుకే జగన్ పర్యటనలకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. టీడీపీ నేతలు బరితెగించి దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేదు. దాడులపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేస్తే ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో ఏ వర్గం సంతృప్తిగా లేదు. మామిడి, పొగాకు, మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు’ అని చెప్పుకొచ్చారు.

Tragedy in Legendary Actor Kota Srinivasa Rao Life2
Kota Srinivasa Rao: కోట జీవితంలో విషాదం.. ఎన్ని కోట్లు సంపాదిస్తేనేం?

కంటిచూపుతో భయపెట్టారు. వెటకారంతో వెక్కిరించేవారు. తెలంగాణ యాసలో డైలాగులు చెప్తూ నవ్వించారు. రోజుకు 20 గంటలు పనిచేసేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ దునియాల కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) వంటి నటుడే లేడు అని నిరూపించుకున్నారు. ఊహించినదానికంటే వెయ్యి రెట్ల అభిమానం, వందలాది సినిమాలు చేసి సంపాదించిన కోట్లాది ఆస్తి.. అయినా కోట మనసు సంతోషించలేదు. పైగా గుండెలోని దుఃఖం తనను వెంటాడుతూనే ఉండేది. కారణం కొడుకును కోల్పోవడం!ఎలా మర్చిపోతాను?2010 జూన్‌ 21న రోడ్డు ప్రమాదంలో కోటా కుమారుడు ఆంజనేయ ప్రసాద్‌ మరణించాడు. తనకు తలకొరివి పెట్టాల్సిన కొడుక్కి.. తానే అంత్యక్రియలు చేయాల్సి రావడంతో తల్లడిల్లిపోయారు. ఆ బాధ నుంచి బయటపడ్డారా? అని అడిగినప్పుడు మర్చిపోవడానికి ఇదేమైనా జ్ఞాపకమా? జీవితం.. ఎలా మర్చిపోతాను? ఓ నిట్టూర్పు విడిచారు. కానీ నటనలో బిజీగా ఉండటం వల్ల ఆ బాధను ఎంతో కొంత తట్టుకోగలిగాను అని అనేవారు.పెళ్లయ్యాక కష్టాలుఇదొక్కటే కాదు.. ఆయన జీవితంలో కష్టాలకు కొదవలేదని కోట మాటల్లోనే తెలిసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నాకు 1968లో రుక్మిణితో పెళ్లయింది. 1973లో నా భార్య డెలివరీ అయినప్పుడు ఓ విషాదం జరిగింది. ఆమె తల్లి చనిపోయారు. అప్పుడు నా భార్యకు చిన్నగా షాక్‌లాంటిది వచ్చింది. దాన్ని నేను గమనించలేకపోయాను. తర్వాత తను సైకియాట్రిక్‌ పేషెంట్‌గా మారిపోయింది. 30 ఏళ్లపాటు నేనెవరో కూడా గుర్తుపట్టలేదు. తను తిట్టినా ఓర్పుగా సహించాను. ఎందుకంటే తను నా భార్య. ఈ విషయం నాకు క్లోజ్‌గా ఉండేవారికి మాత్రమే తెలుసు. ఎవరికీ చెప్పలేదు.ఒంటరిగా కన్నీళ్లునా రెండో కూతురు ఎంకాం చదివింది. ఎప్పుడూ రిక్షా ఎక్కలేదు అని విజయవాడలో బంధువులతో కలిసి రిక్షా ఎక్కింది. ఎదురుగా బ్రేకులు ఫెయిలైన లారీ రిక్షాను గుద్దింది. ఆ ప్రమాదంలో కొందరు చనిపోగా నా కూతురు కాలు కోల్పోయి ప్రాణాలతో బయటపడింది. బ్యాంకులో ఎవరిదగ్గరైతే గుమాస్తాగా పనిచేశానో ఆయనే నాకు వియ్యంకుడయ్యాడు. నా కూతురు జీవితం బాగుపడిందని సంతోషించేలోపే నా కుమారుడు చనిపోయాడు. ఆ భగవంతుడు ఎంత పేరిచ్చాడో అన్ని కష్టాలిచ్చాడు. ఇవన్నీ గుర్తుచేసుకుని అప్పుడప్పుడు ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటాను అని కోట ఎమోషనలయ్యారు. కాగా కోట శ్రీనివాసరావు జూలై 13న అనారోగ్యంతో కన్నుమూశారు.కోట ఎప్పుడూ చెప్తూ ఉండే మాట.. "నేను చచ్చేదాకా నటించాలి. చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి"(చదవండి: అందరి గుండెల్లో 'కోట'.. తనదీ చార్మినార్‌కున్నంత హిస్టరీ 'తమ్మీ')

Jagruti Activists Attack Teenmar Mallanna Office3
తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌(తీన్మార్‌ మల్లన్న) కార్యాలయంపై దాడి జరిగింది. మేడిపల్లిలోని ఆయన ఆఫీస్‌పై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కార్యకర్తలు దాడి చేశారు. ఆఫీస్‌లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్‌మెన్‌ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు.మలన్న కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపు చేశారు. ఇరువర్గాలను ఆఫీస్‌ నుంచి పంపించివేశారు. కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిపై స్పందించిన మల్లన్న తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారన్నారు.

KL Rahul admits guilt over Rishabh Pants match-changing run-out4
నా వ‌ల్లే అలా జ‌రిగింది.. పంత్‌ను ఏమి అనొద్దు: కేఎల్‌ రాహుల్‌

లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్‌కు టీమిండియా ధీటైన జవాబు ఇచ్చింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 ప‌రుగులు చేయ‌గా.. టీమిండియా సైతం సరిగ్గా 387 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అయితే మూడో రోజు తొలి సెష‌న్‌లో ఇంగ్లండ్‌పై భార‌త్ ఆధిప‌త్యం చెలాయించింది.కానీ లంచ్ విరామానికి ముందు పంత్ వికెట్‌ను కోల్పోవ‌డంతో క‌థ తారుమారైంది. అనవ‌స‌రంగా ర‌నౌట్ అయ్యి ఇంగ్లండ్‌కు త‌న వికెట్‌ను స‌మ‌ర్పించుకున్నాడు. కేఎల్ రాహుల్‌, పంత్ మ‌ధ్య స‌మ‌న్వ‌య‌లోపం వ‌ల్ల భార‌త్ వికెట్ కోల్పోవ‌ల్సి వ‌చ్చింది.అయితే లేని ప‌రుగు కోసం పంత్ ప్రయ‌త్నించి ర‌నౌట‌య్యాడు అని చాలా మంది విమ‌ర్శించారు. కానీ ఈ పూర్తి బాధ్య‌త‌ను రాహుల్ తీసుకున్నాడు. లంచ్ బ్రేక్‌కు ముందు సెంచరీ సాధించాలనే తన ఆత్రుత అన‌వ‌స‌ర ర‌నౌట్‌కు అవుట్‌కు దారితీసిందని వెల్లడించాడు."ఈ మ్యాచ్‌లో మా ఇద్దరి మధ్య చాలా సంభాషణలు జరిగాయి. వీలైతే లంచ్ విరామానికి ముందే సెంచ‌రీ సాధిస్తాన‌ని నేను పంత్‌తో చెప్పాను. బ‌షీర్ లంచ్ బ్రేక్‌కు ముందు చివ‌రి ఓవ‌ర్ వేయ‌డంతో సెంచ‌రీ చేయ‌డానికి మంచి అవకాశం భావించాను.అందుకే పంత్ నాకు సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నించాడు. కానీ దుర‌దృష్టవ శాత్తూ రనౌట్ అయ్యాడు. అయితే ఆ ఓవ‌ర్‌లో తొలి బంతికి బౌండరీ బాదే అవ‌కాశ‌ముండేది. కానీ నేను మిస్ చేసుకున్నాను. ఆ బంతికి కేవ‌లం సింగిల్ మాత్ర‌మే ల‌భించింది. దీంతో పంత్ మ‌ళ్లీ న‌న్ను స్ట్రైక్‌లోకి తీసుకురావాల‌న‌కున్నాడు. అందుకే క్విక్ సింగిల్ కోసం ప్ర‌య‌త్నించాడు. ఈ ప్ర‌య‌త్నంలో అత‌డు ర‌నౌట్ అవ్వాల్సి వ‌చ్చింది. ఇది మా ఇద్దరికీ నిరాశ కలిగించింది. కానీ ఏ బ్యాట‌ర్ కూడా ఈ విధంగా ఔట్ అవ్వాల‌ని అనుకోరు. ఏదేమైనా ఆ ర‌నౌట్ మా మూమెంట‌మ్‌ను దెబ్బ‌తీసింది. ఒక్క‌సారిగా ప‌రిస్థితులు మారిపోయాయి. ఇంగ్లండ్ తిరిగి గేమ్‌లోకి వ‌చ్చింది"అని రాహుల్ మూడో రోజు ఆట అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో పేర్కొన్నాడు. ఆ త‌ర్వాత షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్‌లోనే రాహుల్‌ 177 బంతుల్లో స‌రిగ్గా 100 ప‌రుగులు చేసిఔట‌య్యాడు. ఈ క‌ర్ణాట‌క ఆట‌గాడు రిషబ్ పం‍త్‌తో కలిసి నాలగో వికెట్‌కు 140 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌ గడ్డపై రాహుల్‌ సూపర్‌ సెంచరీ.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బ్రేక్‌

Radhika Yadav Friend Himaanshika Singh Rajput Reacts On Incident5
రాధిక చేసిన మిస్టేక్‌ అదే.. హిమాన్షిక సంచలన వ్యాఖ్యలు

గురుగ్రామ్‌: టెన్నిస్ ప్లేయర్‌ రాధికా యాదవ్‌ హత్య కేసుకు సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కూతుర్ని ఆంక్షల నడుమ బంధించడానికి యత్నించే క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రాధిక ప్రాణ స్నేహితురాలు స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తల్లిదండ్రులు.. రాధికను నియంత్రించారని పేర్కొంది. రాధికను తనకు నచ్చిన విధంగా జీవించనివ్వలేదని తెలిపారు.రాధిక ప్రాణ స్నేహితురాలు హిమాన్షిక సింగ్ తాజాగా మాట్లాడుతూ.. రాధిక నాకు 2012 నుంచి తెలుసు. రాధిక ఎంతో సున్నితమైన మనసు కలిగి ఉంది. రాధిక కుటుంబ సభ్యులు.. ఆమెను నియంత్రించే వారు. ఆమె నాతో వీడియో కాల్‌లో ఉన్నప్పుడు, ఆమె ఎవరితో మాట్లాడుతుందో తల్లిదండ్రులకు చూపించాల్సి వచ్చింది. టెన్నిస్ అకాడమీ తన ఇంటి నుంచి కేవలం 15 నిమిషాల దూరంలో ఉన్నప్పటికీ, ఆమె ఎప్పుడు తిరిగి రావాలన్న దానిపై డెడ్‌లైన్ ఉండేది. రాధికది సంప్రదాయ కుటుంబమని, దాదాపు ప్రతి దానితోనూ సమస్యలు ఉండేవని తెలిపింది. ప్రతి విషయంలోనూ నియంత్రణ విధిస్తూ రాధిక జీవితాన్ని ఆమె తండ్రి దుర్భరం చేశాడు.బయటకు వెళ్లాక పలానా సమయంలో తిరిగి ఇంటికి రావాలని ఆంక్షలు విధించేవారు. రాధిక కదలికలను ఇంట్లోవారు నియంత్రించారు. అతను తన నియంత్రణ, ప్రవర్తన, నిరంతర విమర్శలతో కుమార్తె జీవితాన్ని సంవత్సరాలుగా దుర్భరంగా మార్చాడు. షార్ట్స్ ధరించినందుకు, అబ్బాయిలతో మాట్లాడినందుకు, తన సొంత నిబంధనల ప్రకారం జీవించినందుకు వారు ఆమెను అవమానించారు. క్రమంగా వీడియోలు చిత్రీకరించడం వంటి ఆమె అభిరుచులన్నీ కనుమరుగయ్యాయి. ఆమె ఇంట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. కుటుంబంపై సామాజిక ఒత్తిడి ఉంది. ప్రజలు ఏమనుకుంటారో అని తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ఆందోళన చెందేవారు. ఇంట్లోని ఆంక్షలతో ఆమె ఊపిరాడనట్టు ఉండేది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ రాధిక హత్యకు కారణమని తెలిపారు. రాధిక.. తన పేరెంట్స్‌కు నచ్చని కొని పనుల కారణంగానే హత్యకు గురైందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. రాధికా యాదవ్‌ టెన్నిస్‌ కోచ్‌లలో ఒకరైన అజయ్‌ యాదవ్‌ కూడా ఆమె హత్యపై స్పందించారు. ఈ సందర్భంగా యాదవ్‌ మాట్లాడుతూ..‘ఇంట్లోని కొన్ని పరిమితులు, ఆంక్షలతో రాధిక సతమతమైనట్లు వెల్లడించారు. తనకు వాట్సాప్‌ చాట్‌ టెక్ట్స్‌ మెసేజ్‌లు, వాయిస్‌ చాట్‌లలో ఆమె చెప్పిన కొన్ని విషయాలను జాతీయ మీడియాకు చూపించారు. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

Gold prices may soften mid term says World Gold Council6
బంగారం ధరలు తగ్గనున్నాయా?

రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం ధరలతో కొనుగోలుదారులు బేజారవుతున్నారు. తులం (10 గ్రాములు) పసిడి ఇప్పటికే లక్ష రూపాయాలకు అటు ఇటుగా ధర పలుకుతోంది. ఈ క్రమంలో పసిడి ప్రియులకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చల్లని కబురు చెప్పింది. రానున్న నెలల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది.ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ, వాణిజ్య ప్రమాదాలు తగ్గితే బంగారం ధర మధ్యంతర బలహీనతను అనుభవించవచ్చు లేదా యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ పెరిగితే అధిక అవకాశాల వ్యయాలను అనుభవించవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోలు, రిటైల్ ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ మందగించడం కూడా మధ్యకాలిక బంగారం ధర సర్దుబాటుకు దారితీస్తుందని డబ్ల్యూజీసీ తెలిపింది.రూ.లక్షకు అంచున బంగారందేశంలో ప్రస్తుతం బంగారం 10 గ్రాముల ధర (24 క్యారెట్లు) రూ.99,860 వద్ద కొనసాగుతోంది. ఇటీవలి గోల్డ్ బుల్ రన్ విపరీతమైన దృష్టిని ఆకర్షించింది. 2022 నవంబర్ 3న పడిపోయిన తరువాత నుండి బంగారం ధర రెట్టింపు అయింది. ఔన్సుకు 1,429 డాలర్ల నుండి 3,287 డాలర్లకు ఎగిసింది. అంటే ఏడాదికి 30% చొప్పున పెరుగుతూ వచ్చింది. ఓ వైపు కేంద్ర బ్యాంకు కొనుగోళ్లతో పాటు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇటీవలి వాణిజ్య అనిశ్చితులు దీనికి కారణమవుతున్నాయి.బంగారం ధర ఎప్పకప్పుడు కొత్త గరిష్టాలను తాకుతుండటంతో ఇన్వెస్టర్లు రిస్క్ ల పట్ల అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలో బంగారం ధరల్లో మునుపటి ఒడిదుడుకులను అధ్యయనం చేసిన మీదట మధ్య లేదా ధీర్ఘ​కాలిక క్షీణతకు దారితీసిన సందర్భాలు కనిపించాయి. అయితే "మేము వీటిని పరిగణనలోకి తీసుకోనప్పటికీ, దీర్ఘకాలిక ఉపసంహరణలు మరింత స్థిరమైన, నిర్మాణాత్మక డిమాండ్ మార్పుల నుండి రావచ్చు. ఇది సంస్థలు, రిటైల్ పెట్టుబడిదారుల నుండి బంగారం పెట్టుబడి డిమాండ్‌లో గణనీయమైన క్షీణతకు, సరఫరాలో వేగవంతమైన పెరుగుదలకు దారితీస్తుంది" అని డబ్ల్యూజీసీ తన నివేదికలో పేర్కొంది.

Do You Know Why Kota Srinivasa Rao Quit Politics7
ఎమ్మెల్యేగా గెలిచిన కోట.. రాజకీయాలను ఎందుకు వదిలేశాడో తెలుసా?

సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదు. చాలా మంది సినిమా రంగం నుంచి వచ్చి ఇప్పుడు రాజకీయంగా మంచి స్థానంలో ఉన్నారు. అలా కోట శ్రీనివాసరావు కూడా సినిమాలతో బీజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చాడు. ఎమ్యెల్యే కూడా అయ్యాడు. కానీ సడెన్‌గా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు.(చదవండి: కోట శ్రీనివాసరావు మరణం.. బోరున విలపించిన బాబు మోహన్‌)అలా రాజకీయాల్లోకి..కోట శ్రీనివాసరావుకి బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని వాజ్‌పేయి అంటే చాలా ఇష్టం. అందుకే అప్పట్లో సీనీ నటులు ఎక్కువగా టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో చేరితే.. కోట మాత్రం బీజేపీలో చేరారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ ప్రోత్సాహంతో బీజేపీ తరపున 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కోట ఓటమి చవిచూశాడు. అయినా బీజేపీ నాయకత్వం కోటని కీలక నేతగానే పరిగణించింది. కానీ కొన్నాళ్ల తర్వాత కోటనే రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరమయ్యాడు.(చదవండి: 30 ఏళ్లపాటు కోటను గుర్తుపట్టని భార్య.. కూతురిని రిక్షా గుద్ది, కొడుకేమో.. ఒంటరిగా కన్నీళ్లు!)అందుకే రాజకీయాలు వదిలేశా: కోటఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కోట ఇక రాజకీయంగానే స్థిరపడతారని, సినిమాలకు దూరమైనట్లేనని అంతా భావించారు. కానీ కోట మాత్రం సినిమాలను వదులుకోలేదు. రాజకీయంగా సేవ చేయాలని తనకు ఉన్నా..అక్కడ పరిస్థితులు నచ్చకపోవడంతో ఇక జీవితంలో రాజకీయాల్లోకి రావద్దని ఫిక్స్‌ అయ్యారట. ఈ విషయాన్ని గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా కోట శ్రీనివాసరావే చెప్పారు.‘1999లో ఎమ్మెల్యేగా చేశాను. అప్పుడు వాతావరణం వేరు. అప్పటి రాజకీయ నాయకుల్లో ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనే తపన ఉండేది. మంచి పని చేశాడు అనిపించుకోవాలనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కావాలంటే కోట్లు కావాలి. 20-30 కోట్లు ఖర్చుపెట్టాలి అనే మాటలు వినబడుతున్నాయి. నా ప్రశ్న ఒక్కటే. అంత మొత్తం ఎవరు ఖర్చు పెట్టమన్నారు? అందుకే రాజకీయాలు డబ్బుమయం అవుతున్నాయని గ్రహించే నా తత్వానికి ఇక పడవు అనుకుని రాజకీయాలు వదిలేశాను’ అని కోట అన్నారు.

Sakshi Editorial On Education sector in Andhra Pradesh Chandrababu Govt8
విద్యారంగంపై విషపు చూపు!

ఆయనో గాడిదను చూపెడతారు. దాన్ని గుర్రం అనాలంటారు. ఔనౌను అది గుర్రమేనని పెంపుడు మీడియా నమ్మ బలుకుతుంది. తామేది చెబితే జనం దాన్నే నమ్మాలనే నియ మావళిని ఆయన అమల్లోకి తెచ్చారు. అయ్యయ్యో, అది గుర్రం కాదు గాడిదని అమాయకంగా ఎవరైనా అరిస్తే వారి మీద పెంపుడు మీడియా దండుపాళ్యం బ్యాచ్‌ అనే ముద్రను వేస్తుంది. ఆ దండుపాళ్యం బ్యాచ్‌ను దండించడానికి ఖాకీ మూక కదులుతుంది. దేశంలో ఉన్న అత్యంత సీనియర్‌ రాజకీయ నాయకుల్లో ఆయనొకరు. ముఖ్యమంత్రి కుర్చీతో నాలుగు విడ తలుగా పదిహేనేళ్ల సావాసముంది. అయినా పచ్చి అబద్ధాలను పబ్లిగ్గా వల్లెవేయడానికి ఇప్పటికీ వెనకాడటం లేదు.ఎందుకంటే, ఆయనకది అచ్చొచ్చిన విద్య. ఆ విద్యతోనే రాజకీయంగా తనను తాను ప్రమోట్‌ చేసుకున్నారు. పెంపుడు మీడియా అండదండగా నిలబడింది. ఇతరులకు దక్కవలసిన ఘనతను లాఘవంగా లాగేసుకోవడంలో, ఇతరుల మెడలో వేయాల్సిన వీరతాళ్లను తన మెడలో వేసుకోవడంలో ఆయన ప్రదర్శించే దిగ్భ్రాంతికరమైన చొరవ జగమెరిగిన సత్యమే. ఆయన వయసు డెబ్బై ఐదు దాటింది. ఇంకో పదిహేనేళ్లు ఆయన నాయకత్వంలోనే పని చేస్తానని పవన్‌ కల్యాణ్‌ పదే పదే చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ శిరోధార్యంగా తలపోసే సనాతన ధర్మంపై సర్వహక్కులున్న ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ మాత్రం మరోరకంగా ఆలోచిస్తున్నారు. సెవెంటీ ఫైవ్‌ దాటిందంటే శాలువా కప్పుకొని తప్పుకోవలసిందేనని ఆయన కుండబద్దలు కొడుతున్నారు.ఆరెస్సెస్‌ బాస్‌ విధిస్తున్న ఈ సెవెంటీ ఫైవ్‌ డెడ్‌లైన్‌పై భారత రాజకీయాల్లో ఈ సంవత్సరం పెద్ద చర్చే జరిగే అవ కాశముంది. ఈ నేపథ్యంలో మన సెవెంటీ ఫైవ్‌ ప్లస్‌ బాబు కూడా తననింతటి వాడిని చేసిన గోబెల్స్‌ వ్యూహాన్ని తన వారసుడి కోసం కూడా అమలు చేయడం మొదలుపెట్టాడు. అమెరికా వాళ్లు ఇటీవల ఇరాన్‌ మీద ప్రయోగించిన బంకర్‌ బస్టర్‌ లాంటి బాంబునొకదాన్ని సత్యసాయి జిల్లా కొత్తచెరువు స్కూల్లో చంద్రబాబు జారవిడిచారు. అడపాదడపా ఇలా బాంబులేయడం రివాజే కనుక పెద్దగా గగ్గోలు పుట్టలేదు కానీ, ఈ రకమైన క్షుద్ర రాజకీయాలను ఇంకో తరం కూడా భరించ వలసిందేనా అనే ఆందోళన మాత్రం మొదలైంది.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన విప్లవాత్మక కార్యాచరణలో ‘అమ్మఒడి’ అనే పథకం అతి ముఖ్యమైనఅంశం. 2014 ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టో లోనే ఆయనీ వాగ్దానం చేశారు. 2019లో గెలిచిన తర్వాత అమలు చేయడం, దీనిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురవడం తెలిసిన విషయాలే. చంద్రబాబు ఈ పథకం పేరు ‘తల్లికి వందనం’గా మార్చి మరింత గొప్పగా చేస్తానంటూ తన సూపర్‌ సిక్స్‌ ఎన్నికల హామీల్లో చేర్చారు. ఏడాది ఎగనామం తర్వాత ఆంక్షల వర్తింపుతో అమల్లోకి తెచ్చి ఆ వీరతాడును మీడియా కెమెరాల సాక్షిగా తన కుమారుడి మెడలో వేశారు. పాఠశాల పిల్లలతో మాట్లాడుతూ ‘‘విద్యామంత్రి బాగా చదువుకున్నారు. మంత్రయ్యారు. ఇప్పుడు మీకోసం ‘తల్లికి వందనం’ అనే ఆలోచన ఆయనే చేశార’’ని నిస్సంకోచంగా చెప్పుకొచ్చారు. ఆ విధంగా తన గోబెల్స్‌ బాటన్‌ను మరుసటి తరం చేతికి అందజేశారు.‘మెగా పేరెంట్స్‌ – టీచర్స్‌ మీట్‌’ అనే మరో గిన్నీస్‌ బుక్‌ కార్యక్రమం ఈ వేడుకకు వేదికైంది. విద్యార్థుల డేటాబేస్‌ను నిర్వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 87 లక్షలమంది విద్యార్థులుండాలి. ప్రతి విద్యార్థికీ ‘తల్లికి వందనం’ స్కీమును వర్తింపజేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 67 లక్షలమందినే లెక్క తేల్చింది. అందులో తల్లికి వందనం నిధులు 60 లక్షల లోపు విద్యార్థులకే అందినట్టు లెక్కలున్నాయి. మెగా పీటీఎమ్‌ రికార్డు బ్రేకింగ్‌ కార్యక్రమానికి 61 వేల పాఠ శాలల్లోని 74 లక్షలమంది విద్యార్థులు పాల్గొన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వారి తల్లిదండ్రులతో సహా 2 కోట్ల 30 లక్షల మంది హాజరై రికార్డు సృష్టించినట్టు చెప్పారు. 67 లక్షల మంది పిల్లల లెక్క తీసుకున్నప్పుడు తల్లుల సంఖ్యను 42 లక్షలుగా చూపెట్టారు. 74 లక్షలకు అదే నిష్పత్తితో లెక్కిస్తే తల్లుల సంఖ్య 46 లక్షలవుతుంది. అదే సంఖ్యలో తండ్రులు కూడా హాజరై ఉంటారు. 3 లక్షల పైచిలుకు టీచర్లు హాజరయ్యారు. అంతా కలిపి 1 కోటీ 69 లక్షలు. ఇంకో 60 లక్షలమంది పరిశీలకులూ, దాతలని పేర్కొన్నారు. సగటున ప్రతి పాఠశాలకు వందమంది వీరే. కొన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థుల సంఖ్య కంటే దాతల సంఖ్యే ఎక్కువ కనిపించడం గిన్నిస్‌ బుక్‌లో చేర్చాల్సిన అసలు విషయం.విద్య ప్రభుత్వ బాధ్యత కాదు, కార్పొరేట్‌ సంస్థలే చూసుకోవాలన్న చంద్రబాబు కొటేషన్‌ మరీ పాతదేం కాదు. ఆరేడేళ్ల కిందటిదే. ఇంతలోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం ఆయన తన ఫిలాసఫీని వదిలేసు కున్నారా? ఎంతమాత్రమూ కాదు. ఇది నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం అనే డబుల్‌ యాక్షన్‌ ప్లాన్‌. ఈ పథ కాన్ని అమలు చేసే నాటికే ప్రభుత్వ బడుల్లో నాలుగు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సౌకర్యాలు మెరుగుపరిచే ‘నాడు–నేడు’ కార్యక్రమం ఆగిపోయింది. విద్యార్థుల పౌష్టికాహారం కోసం 16 రకాల పదార్ధాలతో జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా పరిశీలించిన ‘గోరుముద్ద’ పథకం స్థానంలో బొద్దింకల భోజనం స్వయంగా మంత్రుల అనుభవంలోకే వచ్చింది. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ప్రాథమిక స్థాయిలోనే జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన సబ్జెక్ట్‌ టీచర్‌ బోధన ఎగిరిపోయింది. విద్యార్థులు లేక 4,700 పాఠశాలలు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి.పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం వైసీపీ సర్కార్‌ వెయ్యి స్కూళ్లలో ప్రారంభించిన సీబీఎస్‌ఈ బోధనను చంద్రబాబు – లోకేశ్‌ల సర్కార్‌ తొలగించింది. వారి నైపుణ్యానికి పదును పెట్టే టోఫెల్‌ శిక్షణను మాయం చేశారు. నగరాల్లో ఉన్నత వర్గాల వారు వారి పిల్లలకోసం లక్షలు గుమ్మ రించి చెప్పించే ఐబీ సిలబస్‌ను పేద పిల్లలకు ఉచితంగా నేర్పించాలన్న జగన్‌ సంకల్పానికి గండికొట్టారు. పేద విద్యార్థులు కూడా డిజిటల్‌ ప్రపంచంలో ముందడుగు వేయాలన్న లక్ష్యంతో ఎనిమిదో క్లాసు విద్యార్థులకు ట్యాబ్‌లను అందజేయడం ప్రారంభించింది జగన్‌ ప్రభుత్వం. ఆయన హయాంలో సుమారు పది లక్షలమంది చేతుల్లోకి ట్యాబ్‌లు వచ్చాయి. ఈ కార్య క్రమాన్ని నిర్దాక్షిణ్యంగా ఆపేసి, పేద బిడ్డల్ని డిజిటల్‌ ప్రపంచానికి దూరం చేసే కుట్రను అమలుచేశారు. పేద ప్రజల పిల్లల్ని ఐక్యరాజ్యసమితి వేదికపై నిలబెట్టిన ఇంగ్లిష్‌ మీడియం బోధనకు వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు చేశారో, ఎంతమంది కుహనా సాంస్కృతిక రాబందుల్ని రంగంలోకి దింపారో, పేద పిల్లల నోటి దగ్గరి ‘నాణ్యతా’ ముద్దను తన్నేయడానికి ఎన్ని గద్దలు ఎగిరాయో ఈ సమాజం జ్ఞాపకాల్లోంచి అంత త్వరగా చెరిగిపోయేవి కావు.పేదల విద్యాసాధికారత మీద ఇన్ని కుట్రలు చేసిన తెలుగుదేశం పెద్దల పుర్రెల్లో ‘తల్లికి వందనం’ ఆలోచన పుట్టిందని చెప్పడం కంటే హాస్యాస్పద విషయం ఇంకేముంటుంది? ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని నిలిపివేయడం, జగన్‌ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను క్రమంగా ఉపసంహరించడం, మధ్యాహ్న భోజన పథకాన్ని నీరుగార్చడం వంటివన్నీ ఉద్దేశ పూర్వక చర్యలేనని అభిజ్ఞవర్గాల సమాచారం. ఈ చర్యలు ఇంకా చురుగ్గా సాగుతాయట! రెండో దశలో ఇంకో ప్రచారం మొదల వుతుంది. ప్రైవేట్‌ స్కూళ్లలో చదివినా తల్లికి వందనం వస్తున్న ప్పుడు సౌకర్యాలు లేని ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు చదవాలని టముకు వేస్తారు. చేరగలిగిన వాళ్లంతా ప్రైవేట్‌కు మారిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ప్రైవేట్‌ స్కూళ్లలో చదివించే స్థోమత కలిగిన వారికి ప్రభుత్వ సాయమెందుకని పెంపుడు మీడియానే ప్రశ్నిస్తుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. విద్య ప్రభుత్వం బాధ్యత కాదనే చంద్రబాబు మాట నెగ్గి ప్రైవేట్‌ విద్య వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. నాణ్యమైన విద్యకు దూరమైన శ్రామిక వర్గాల పిల్లలు చౌక శ్రామికులుగానే మిగిలిపోతారు.బాల్యంలో వేగంగా నేర్చుకునే వయసులో ఉన్నప్పుడు వారికి అందే విద్యా ప్రమాణాలే వారి ఐక్యూ స్థాయులను నిర్ధారిస్తాయని అనేక సర్వేలు వెల్లడించాయి. పోషకాహార లేమి వేగంగా నేర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని కూడా చాలాకాలంగా నిపుణులు చెబుతున్నారు. ఉన్నత స్థాయి బోధనా పద్ధతులు, డిజిటల్‌ పరిజ్ఞానం. పౌష్టికాహారం కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండి ఎక్కువమంది బాలలకు అందని ద్రాక్షలుగా ఉన్న దేశాలు ఐక్యూ ర్యాంకుల్లో వెనుకబడి ఉండటానికి కారణం అదే. విద్యా వ్యవస్థపై శాస్త్రీయమైన మదింపు చేసిన తర్వాతనే జగన్‌ మోహన్‌రెడ్డి మన పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని తన ప్రసంగాల్లో, సందేశాల్లో పదేపదే ప్రస్తావించేవారు. జగన్,చంద్రబాబుల దృక్పథంలో ఉన్న మౌలికమైన తేడా ఇదే! పేద, ధనిక, కులం, మతం, ప్రాంతం, ఆడ, మగ తేడాల్లేకుండా చదువు అనే ఆస్తి అందరికీ సమకూరాలనేది జగన్‌మోహన్‌ రెడ్డి తాత్విక భూమిక. చదువు అనే ఆస్తి కూడా కొనుగోలు చేయగలిగినవాడికే చెందాలనేది చంద్రబాబు విచార ధార.అందుకే దాన్ని ప్రభుత్వ బాధ్యతగా కాకుండా కార్పొరేట్‌ బాధ్యతగా వర్గీకరించారు. ‘తల్లికి వందనం’ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో కాకుండా ఒక ఎరగా వేశారని నిపుణులు అభిప్రా యపడుతున్నది కూడా అందుకే!ఈ మౌలికమైన తేడా ఇప్పుడు ఉపాధ్యాయుల అనుభవంలోకి కూడా వచ్చినట్టుంది. మొన్నటి మెగా పీటీఎమ్‌ కార్య క్రమాన్ని ఒక ఈవెంట్‌లా నిర్వహిస్తున్నారంటూ వారి సామాజిక మాధ్యమ గ్రూపుల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అందులో ఒక్క పోస్టును క్లుప్తంగా గమనిస్తే వారి అభిప్రాయం ఏమిటో తేటతెల్లమవుతుంది. ‘‘బాబుగారూ, లోకేశ్‌గారూ... మీరు ఈ సమావేశంలో కూర్చున్న బెంచీలు మీ ప్రభుత్వం ఇచ్చినవి కావు. మీ ఎదురుగా వున్న ఐఎఫ్‌పీ ప్యానెళ్లు మీరు ఏర్పాటు చేయలేదు. పైన తిరుగుతున్న ఫ్యాను, వెలుగుతున్న లైటూ కూడా మీరిచ్చినవి కావు. మిగిలిన నాలుగేళ్లయినా ఈ పనికి మాలిన సమావేశాలు మానేయండి. టీచర్ల కాలాన్ని వృథా చేయకండి. పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి. ఉపాధ్యా యుల్ని మీ కూటమి ప్రభుత్వం ఈవెంటు మేనేజర్లుగా మార్చేస్తున్నది. పిల్లల తల్లిదండ్రులతో టీచర్ల సమావేశాలు ప్రతినెలా జరుగుతూనే ఉన్నాయి. దయచేసి ఈ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చవద్దు. ముఖ్య విషయం: పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు పాఠశాలలకు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటైనా ఉన్నదా?... చెప్పండి సీ.ఎం. సారూ!’’వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Ujjwal Nikam Nominated to Rajya Sabha by President Murmu9
రాజ్యసభకు ప్రముఖుల నామినేట్‌.. జాబితా ఇదే..

న్యూఢిల్లీ: రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్‌ చేశారు. రాజ్యాంగంలోని క్లాజ్ త్రీలో గల ఆర్టికల్ 80(1)(ఎ) ద్వారా మంజూరయిన అధికారాల ప్రకారం భారత రాష్ట్రపతి రాజ్యసభకు నలుగురు విశిష్ట వ్యక్తులను నామినేట్ చేశారు. గతంలో నామినేట్ చేసిన సభ్యుల పదవీ విరమణ కారణంగా ఆ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నామినేషన్లు దాఖలు చేశారు. The President of India has nominated Ujjwal Deorao Nikam, a renowned public prosecutor known for handling high-profile criminal cases; C. Sadanandan Maste, a veteran social worker and educationist from Kerala; Harsh Vardhan Shringla, former Foreign Secretary of India; and… pic.twitter.com/eN6ga5CsPw— ANI (@ANI) July 13, 2025రాజ్యసభకు నామినేట్ అయిన కొత్త అభ్యర్థులు వీరే..1. ఉజ్వల్ దేవరావు నికమ్‌: 26/11 ముంబై ఉగ్ర దాడులతో సహా అనేక ఉన్నత స్థాయి క్రిమినల్ కేసులను విచారించిన ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్.2. సి. సదానందన్ మాస్తే: దశాబ్దాలుగా అట్టడుగు వర్గాలకు సేవలు అందిస్తున్న కేరళకు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త.3. హర్షవర్ధన్ శ్రింగ్లా: భారత మాజీ విదేశాంగ కార్యదర్శి, కీలక ప్రపంచస్థాయి పదవులలో పనిచేసిన అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త.4. డాక్టర్ మీనాక్షి జైన్: ప్రముఖ విద్యావేత్త, భారతీయ చారిత్రక విజ్ఞానానికి విశేష కృషి చేశారు.న్యాయవాది, బీజేపీ నేత ఉజ్వల్ నికమ్‌ 1993 ముంబై వరుస పేలుళ్లు, 26/11 ఉగ్రదాడి తదితర కేసులలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(ఏ) కింద ఈ నామినేషన్లు దాఖలయ్యాయి. సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవ తదితర రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని రాజ్యసభకు నామినేట్ చేయడానికి రాష్ట్రపతికి ప్రత్యేక అధికారం ఉంది.

Scam: Officers Ate 14 Kg Dry Fruits In One Hour In Madhya Pradesh10
గంటలో 14 కేజీలు లాగించేశారు!

ప్రభుత్వ అధికారుల అవినీతి కథలు కొత్తేమీ కాదు కానీ.. మధ్యప్రదేశ్‌లోని ఈ తాజా ఘటన మాత్రం కొంచెం విచిత్రమైందే. గంట సమయంలో కొందరు అధికారులు ఎకాఎకిన 14 కిలోల డ్రైఫ్రూట్స్‌ లాగించేశారట. దీనికి సంబంధించి రూ.85 వేల బిల్లు పెడితే.. పై అధికారులకు డౌటొచ్చింది. విచారణ జరగడంతో పాపం చిక్కిపోయారు! వివరాలు...మధ్యప్రదేశ్‌లోని శాధోల్‌ జిల్లాలో ఉండే చిన్న గ్రామం భడ్‌వాహీ. వాన నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘జల్‌ గంగ సంవర్ధన్‌’ పేరుతో ఒక కార్యక్రమం చేపట్టింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌, ఎస్‌డీఎం, పంచాయతీ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు. అంతా కలిపి 24 మంది మాత్రమే. కానీ బిల్లు మాత్రం రూ..85 వేలు అయినట్లు పెట్టారు.వీళ్లంతా కలిసి ప్రజాధనం దోచేస్తున్నారు అనుకున్నారో ఏమో.. గుర్తు తెలియని వ్యక్తులు ఈ బిల్లును కాస్తా సోషల్‌ మీడియాలో పడేశారు. ఇంకేముంది.. ఒక్కపట్టున వైరల్‌ అయిపోయింది అది. గంట టైమ్‌లో ఈ 24 మంది అధికారులు కూర్చుని 14 కిలోల బాదాం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష తిన్నారట. ఇది చాలదన్నట్టు 30 కిలోల స్నాక్స్‌, కాఫీ/టీల కోసం ఆరు లీటర్ల పాలు.. ఐదు కిలోల చక్కెర వాడామని బిల్లులో పెట్టారు.వీటికి రకరకాల పండ్లు అదనం! విచిత్రమైన విషయం ఇంకోటి ఉంది. సమావేశానికి హాజరైన గ్రామస్తులకు కిచిడీ మాత్రమే వడ్డించి వీరు మాత్రం పంచభక్ష్య పరమాన్నాల టైపులో డ్రైఫ్రూట్స్‌తో ‘బ్రేవ్‌’ మని తేన్చడం!గంట సమావేశంలో రూ.85 వేల బిల్లు ఏమిటా? అన్న అనుమానం పై అధికారులకు రావడంతో విషయం బయటకొచ్చింది. విచారణ మొదలైంది. ‘‘అబ్బే.. మేం అసలు డ్రైఫ్రూట్స్‌ ముట్టుకోలేదు’’ అని కొందరు అధికారులు సన్నాయి నొక్కులు నొక్కడం కొసమెరుపు!-గిళియారు గోపాలకృష్ణ మయ్యా

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement