
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా గురించి ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.

ఈ స్పోర్ట్స్ స్టార్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ లోక్‌సభ ఎంపీగా సానియా పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ ఆమెను బరిలోకి దించాలనే యోచనలో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.

కాగా లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఇప్పటికే పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి.

ఈ క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కంచుకోటగా ఉన్న హైదరాబాద్‌లో..

బీజేపీ మాధవీ లతను పోటీకి దింపింది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.

ఎంఐఎంకు పట్టున్న హైదరాబాద్ నియోజకవర్గంలో సానియా మీర్జాను పోటీకి నిలపడం ద్వారా ఒవైసీకి చెక్ పెట్టవచ్చనే యోచనలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన సానియా మీర్జా.. గతంలో తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్‌గా ఉన్నారు.

ఇక ఆమె చెల్లెలు ఆనం మీర్జా.. టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ కోడలు అన్న విషయం తెలిసిందే.

అజారుద్దీన్ కుమారుడు మహ్మద్ అసదుద్దీన్‌తో 2019లో ఆనం వివాహం జరిగింది.

ఫలితంగా అప్పటికే మీర్జా- అజారుద్దీన్ మధ్య ఉన్న స్నేహం.. బంధుత్వంగా మారింది.

ఇక కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా కొనసాగుతున్న అజారుద్దీన్ ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు.

అయితే, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సానియా మీర్జా అభ్యర్థిత్వం గురించి అజారుద్దీన్ కాంగ్రెస్ పెద్దల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా.. మీర్జా కుటుంబం నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పందనా రాలేదు.

ఇదిలా ఉంటే.. సానియా మీర్జా.. తన భర్త షోయబ్ మాలిక్‌కు విడాకులు ఇచ్చినట్లు మీర్జా ఫ్యామిలీ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేవలం తన కుమారుడు ఇజహాన్ బాగోగులు, టెన్నిస్ అకాడమీ అభివృద్ధి పైనే దృష్టి సారించిన సానియా మీర్జా రాజకీయంగా స్టెప్ తీసుకోనున్నారంటూ వార్తలు రావడం ఆసక్తిని కలిగిస్తోంది.

అయితే, దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.





