Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Chandrababu Naidu Govt Redbook Rule in Andhra Pradesh1
బాబు ష్యూరిటీ.. 'గూండాయిజం' గ్యారెంటీ!

సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీల అమలు, పాలనలో పూర్తిగా విఫలమై ప్రజాస్వామ్యం పీక నులుముతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. బాబు ష్యూరిటీ అంటే మోసాలే కాదు.. గూండాయిజం గ్యారెంటీ!’’ అన్నట్లు అరాచకంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు వ్యాఖ్యాని­స్తున్నారు! ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా పదేపదే దాడులకు పచ్చ మూకలను ఉసిగొల్పుతుండటాన్ని, పోలీసులను ప్రయోగిస్తుండటాన్ని గుర్తు చేస్తున్నారు. హామీలను నెరవేర్చలేని తన అసమర్థత, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. దీనిపై చర్చ జరగకుండా ఉండేందుకే రాష్ట్రంలో ధ్వంస రచనకు తెగిస్తున్నారని పేర్కొంటున్నారు. పక్కా కుతంత్రంతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నాలు, దాడులకు ప్రభుత్వ పెద్దలే పురిగొల్పడం విభ్రాంతి కలిగిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనలను అడ్డుకుని అలజడి రేకెత్తించడమే లక్ష్యంగా ముందస్తు కుట్రతో రౌడీ మూకలను టీడీపీ మోహరిస్తోంది. పర్యట­నల్లో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు యత్నిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టో అమలులో చంద్రబాబు సర్కారు వైఫల్యాన్ని నిలదీస్తూ వైఎస్సార్‌­సీపీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘రీ కాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో..’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు టీడీపీ గూండాలను రంగంలోకి దించారు. ఈ నేపథ్యంలో పలుచోట్ల వైఎస్సార్‌సీపీ నేతల నివాసాలపై దాడులకు తెగబడుతూ హత్యా­యత్నాలకు సైతం వెనుకాడటం లేదు. ఈ అరా­చకాన్ని ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహిస్తుండటంతో పోలీస్‌ యంత్రాంగం కళ్లు మూసుకుని కూర్చొంది.ప్రజల్లోకి వెళ్లకుండా వైఎస్‌ జగన్‌ను నిరోధించే కుట్ర..!ఎన్నికల హామీలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ దారుణ వైఫల్యాలను ఎండగడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తుండటం ప్రభుత్వ పెద్దలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఆయన పర్యటనలను అడ్డుకుని తీరాలని, శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు కూడా వెనుకాడవద్దని పచ్చ ముఠాలకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. గిట్టుబాటు ధరలు దక్కక తీవ్రంగా నష్టపోతున్న మిర్చి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన సమయంలో పోలీసులు కనీస భద్రత కల్పించకపోగా టీడీపీ మూకలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలే ఆయనకు ఇరువైపులా నిలబడి భద్రత కల్పించాల్సి వచ్చింది. ఇక పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్‌ జగన్‌ జూన్‌లో ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించినప్పుడు టీడీపీ గూండాలు మార్గమధ్యంలో మాటు వేయడం తీవ్ర ఆందోళన కలిగించింది. అనుమతి లేకపోయినా అంతమంది టీడీపీ నేతలు, గూండాలను ఆ మార్గంలోకి పోలీసులు అనుమతించడం గమనార్హం. టీడీపీ రౌడీల గుంపు వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌పై దాడికి యత్నించడంతో పరిస్థితి ఉద్రికత్తంగా మారింది. అదే నెలలో వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనలోనూ అసాంఘిక శక్తులు చొరబడటం గమనార్హం. అరాచక ముఠాలు ఏకంగా వైఎస్‌ జగన్‌ వాహనం వద్దకు చొచ్చుకు వస్తున్నా పోలీసులు చోద్యం చూశారు. మామిడి రైతులను ఓదార్చేందుకు వైఎస్‌ జగన్‌ తాజాగా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో నిర్వహించిన పర్యటనలో రభస సృష్టించేందుకు టీడీపీ యత్నించింది. గతంలోనూ ఇదే కుట్రలకు వ్యూహ రచన చేసింది. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండల ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్సార్‌ సీపీ కార్యకర్త, బీసీ సామాజిక వర్గానికి చెందిన కురుబ లింగమయ్యను మార్చి 30న దారుణంగా అంతమొందించారు. అధికార పార్టీ అరాచకాలు, అఘాయిత్యాలపై ప్రశ్నించినందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఏప్రిల్‌ 8న వైఎస్‌ జగన్‌ అక్కడికి వెళ్లగా పోలీసులు కనీస భద్రత కల్పించలేదు. వైఎస్‌ జగన్‌ను చూసేందుకు ప్రజలు దూసుకురావడంతో హెలికాప్టర్‌ విండ్‌షీల్డ్‌ డెబ్బతింది. దీనిపై రాప్తాడు మాజీ ఎమ్యెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డితోపాటు 28 మందిపై అక్రమ కేసులు బనాయించారు. ఇలా వైఎస్‌ జగన్‌ పర్యటనల్లో ఘర్షణలు, ఉద్రిక్తత సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నది కూటమి సర్కారు కుట్రగా స్పష్టమవుతోంది. ఆ నెపంతో వైఎస్‌ జగన్‌ పర్యటనలకు అనుమతి నిరాకరించి ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలన్నది ప్రభుత్వ పెద్దల ఎత్తుగడ!నల్లపరెడ్డి ఇంటిపై దాడి.. విధ్వంసం ఇటీవల శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసంపై దాడి చేసి పెను విధ్వంసం సృష్టించారు. ప్రసన్న కుమార్‌రెడ్డిని హత్య చేసేందుకు పక్కా పన్నాగంతోనే ఈ దాడికి తెగబడ్డారు. ఆ సమయంలో ఆయన నివాసంలో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. టీడీపీ గూండాలు ఆయన ఇంటితోపాటు ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి తిరిగి ఆయనపైనే అక్రమ కేసులు నమోదు చేయడం విస్మయం కలిగిస్తోంది. నెల్లూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేసిన దృశ్యం (ఫైల్‌) జెడ్పీ చైర్‌ పర్సన్‌పై దుశ్చర్యటీడీపీ రౌడీల విధ్వంసకాండ కృష్ణా జిల్లాలో మరింత పేట్రేగిపోయింది. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్, బీసీ మహిళ ఉప్పాల హారికపై పచ్చ మూకలు శనివారం దాడికి పాల్పడ్డాయి. గుడివాడ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన రీ కాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం సన్నాహక సమావేశానికి వస్తున్న హారికను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించారు. ఆమె వాహనంపై దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా పరుష పదజాలంతో దూషిం­చారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వైఎస్సార్‌­సీపీ నేతలపై గూండాయిజానికి వెనుకాడబోమని చంద్రబాబు సర్కారు సంకేతాలిచ్చింది. మచిలీ­పట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని నివాసంపైనా దాడికి టీడీపీ మూకలు పన్నాగం పన్నాయి. ఆయన నివాసానికి భారీగా తరలి రావాలని టీడీపీ నేతలు తమ కార్యకర్తలు, గూండాలను ఆదేశించారు. దీంతో మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అతి కష్టం మీద వారిని వెనక్కి పంపించారు. కానీ మచిలీపట్నంలో పరిస్థితి ఏ క్షణంలోనైనా అదుపు తప్పేలా ఉంది. ఇతర జిల్లాల్లో కూడా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా టీడీపీ గూండాలు దాడులకు వ్యూహ రచన చేస్తున్నారు. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ కార్య­క్రమం నిర్వహించకుండా దాడులకు తెగబడా­లని చంద్రబాబు ప్రభుత్వం అరాచక ముఠాలకు గంపగుత్తగా లైసెన్స్‌ జారీ చేసింది. రాష్ట్రంలో విధ్వంస కాండకు ప్రభుత్వమే కొమ్ము కాస్తుండటం పట్ల సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. ‘రీ కాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో’తో వణుకు ఎన్నికల మేనిఫెస్టో అమలులో చంద్రబాబు సర్కారు వైఫల్యంపై ప్రజలను చైతన్య పరిచేందుకు వైఎస్సార్‌సీపీ రూపొందించిన రీ కాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్ర­మం ప్రభుత్వ పెద్దలను గంగవెర్రులెత్తిస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా మేనిఫెస్టోను ప్రభుత్వం అమలు చేయలేకపో­యింది. ఇక ముందు అమలు చేసే ఉద్దేశం కూడా లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ మోసాలను ఎండగడుతూ వైఎస్సార్‌సీపీ ప్రజలకు వివరించేందుకు ఉప­క్రమించడం చంద్రబాబు సర్కారును బెంబేలె­త్తిస్తోంది. దీంతో ఆ కార్యక్రమాన్ని అడ్డు­కు­నేందుకు ఎంతకైనా తెగించాలని ఆదేశించారు. తత్ఫలితమే రాష్ట్రంలో వరుసగా వైఎస్సార్‌సీపీ నేతలపై జరుగుతున్న దాడులు, విధ్వంసం.

Shubhanshu Shukla Returns To Earth2
నీ రాక కోసం.. శుభాంశు ఆగమనం నేడే 

వాషింగ్టన్‌: అంతరిక్షంలో భారత కీర్తిపతాకను సమున్నతంగా ఎగరేసిన మన ముద్దుబిడ్డ శుభాంశు శుక్లా నింగి నుంచి సగర్వంగా నేలకు తిరిగొస్తున్నాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్న శుభాంశు.. మరో ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి అక్కడ రెండున్నర వారాలకు పైగా గడిపిన విషయం తెలిసిందే. స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ ‘గ్రేస్‌’ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4.45 గంటలకు శుభాంశు బృందాన్ని తీసుకుని భూమికి తిరుగు ప్రయాణమైంది. 22 గంటల 15 నిమిషాలకు పైగా ప్రయాణించిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు అమెరికాలోని కాలిఫోరి్నయా తీర సమీపంలో పసిఫిక్‌ మహాసముద్ర జలాల్లో దిగనుంది. ఆ వెంటనే వారికి వైద్యపరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు తరలిస్తారు. అంతరిక్షంలోని సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల నుంచి నుంచి భూ వాతావరణానికి అలవాటు పడేదాకా శుభాంశు బృందాన్ని వారం రోజుల పాటు ఏకాంతంలో ఉంచుతారు. వైద్య పరీక్షలు తదితరాలు నిర్వహించిన అనంతరం వారు బయటి ప్రపంచంలోకి అడుగు పెడతారు. ఈ నేపథ్యంలో శుభాంశు రాక కోసం దేశమంతా నిలువెల్లా కనులు చేసుకుని ఆనందోత్సాహాలతో ఉత్కంఠగా వేచిచూస్తోంది. తిరిగొచ్చేది ఇలా... నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన యాగ్జియం–4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి, వాయుసేన గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశుతో పాటు పెగ్గీ వాట్సన్‌ (అమెరికా), స్లావోజ్‌ ఉజ్నాన్‌స్కీ విస్నియెవ్‌స్కీ (పోలండ్‌), టిబర్‌ కపు (హంగరీ) జూన్‌ 25న ఐఎస్‌ఎస్‌కు బయల్దేరడం తెలిసిందే. దాదాపు 28 గంటల ప్రయాణం అనంతరం వారు 26న విజయవంతంగా ఐఎస్‌ఎస్‌లోకి ప్రవేశించారు. అక్కడ 18 రోజులు (443 గంటలు) గడిపారు. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేశారు. → సోమవారం సాయంత్రం షెడ్యూల్‌ కంటే 10 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 4.45 గంటలకు శుభాంశు బృందం తిరుగు ప్రయాణం మొదలైంది. → అంతకు రెండు గంటల ముందు వారు ఐఎస్‌ఎస్‌ నుంచి ఒకరి తర్వాత ఒకరుగా డ్రాగన్‌ వ్యోమనౌకలోకి ప్రవేశించారు. నలుగురూ స్పేస్‌ సూట్లు ధరించాక వ్యోమనౌకను ఐఎస్‌ఎస్‌తో అనుసంధానించే హాచ్‌ను మధ్యాహ్నం 2.37కు విజయవంతంగా మూసేశారు. → తర్వాత ప్రయాణానికి తుది సన్నాహాలు దాదాపు రెండు గంటల పాటు సాగాయి. అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించే క్షణాల్లో విపరీతమైన రాపిడికి పుట్టుకొచ్చే 1,600 డిగ్రీ సెల్సియస్‌ వేడిని తట్టుకునేందుకు స్పేస్‌క్రాఫ్ట్‌కు బిగించిన హీట్‌ షీల్డ్‌ను సరిచూడటం వంటివి పూర్తయ్యాక డ్రాగన్‌ ముందు భాగాన్ని ఐఎస్‌ఎస్‌ నుంచి విడదీశారు. → అనంతరం సాయంత్రం 4.45కు వ్యోమనౌక భూమికి పయనమైంది. → భూమికి దాదాపు 350 కి.మీ. ఎత్తులో ఉండగా సర్వీస్‌ మాడ్యూల్‌ నుంచి డ్రాగన్‌ విడిపోయింది. → భూమి చుట్టూ పలుమార్లు చక్కర్లు కొడుతూ ప్రయాణ దిశ తదితరాలను సరిచేసుకున్న అనంతరం నిర్ధారిత ప్రాంతంలో అది భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది. → క్రమంలో ముందుగా దాని ముందు భాగాన్ని మూసేస్తారు. హీట్‌షీల్డ్‌ కిందకు ఉండేలా క్యాప్సూల్‌ను సరిచేస్తారు. → విపరీతమైన వేగంతో దూసుకొచ్చే డ్రాగన్‌ను నెమ్మదింపజేసేందుకు భూమికి సుమారు 5.7 కి.మీ. ఎత్తున రెండు రెండు ప్యారాచూట్లు తెరుచుకుంటాయి. అనంతరం 1.8 కి.మీ. ఎత్తున మరో నాలుగు ప్యారాచూట్లు విచ్చుకుంటాయి. → క్యాప్సూల్‌ వాతావరణంలోకి పునఃప్రవేశించే క్రమంలో పుట్టుకొచ్చే అత్యంత ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా ప్యారాచూట్లను అత్యంత దృఢంగా ఉండే నైలాన్, కెవ్లర్‌లతో తయారు చేస్తారు. → మధ్యాహ్నం 3.01 గంటలకు క్యాప్సూల్‌ పసిఫిక్‌ జలాల్లో దిగుతుంది. → అప్పటికే అక్కడ సిద్ధంగా ఉండే స్పెషల్‌ రికవరీ షిప్‌ వెంటనే డ్రాగన్‌ క్యాప్సూల్‌ను చేరుకుంటుంది. → దాన్ని షిప్‌లోకి చేర్చిన అనంతరం శుభాంశుతో పాటు మిగతా ముగ్గురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అందులోంచి బయటికి వస్తారు. → అనంతరం షిప్‌ మీదే వారందరికీ తొలి దఫా పలురకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. → అనంతరం వారిని హెలికాప్టర్‌లో ముందుగా తీరానికి, అనంతరం నాసా కార్యాలయంలోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలిస్తారు.ఐఎస్‌ఎస్‌ నుంచి ఘనంగా వీడ్కోలు ఐఎస్‌ఎస్‌లోని ఏడుగురు సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ సందర్భంగా పరస్పర కౌగిలింతలు, కరచాలనాలు ముగిసిన అనంతరం వాతావరణం ఉద్వేగపూరితంగా మారింది. 18 రోజుల పాటు కలిసి గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా నెమరేసుకున్నారు. ముఖ్యంగా శుభాంశు రుచి చూపిన క్యారెట్, పెసరపప్పు హల్వాను ఎన్నటికీ మర్చిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు. ఫ్లోటింగ్‌ వాటర్‌ బబుల్‌ ఐఎస్‌ఎస్‌లో 60కి పైగా ప్రయోగాలు శుభాంశు బృందం ఐఎస్‌ఎస్‌లో 18 రోజులు గడిపింది. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేపట్టింది. అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్లా అధ్యయనం చేశారు. మానవ జీర్ణవ్యవస్థ ఖగోళంలో ఎలా పని చేస్తుందనే అంశంపై భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వీడియోను ఆయన రూపొందించారు. దాంతోపాటు నలుగురు వ్యోమగాముల బృందం తమ మానసిక స్థితిగతులపైనా ప్రయోగాలు చేసి చూసింది. ఆ క్రమంలో ఫ్లోటింగ్‌ వాటర్‌ బబుల్‌ తయారు చేసి అందులో గడిపింది. అది అద్భుతమైన అనుభవమని శుభాంశు గుర్తు చేసుకున్నారు. ‘‘ఐఎస్‌ఎస్‌లో ప్రతి క్షణాన్నీ పూర్తిగా ఆస్వాదించా. ముఖ్యంగా కిటికీ పక్కన కూచుని కిందకు చూడటాన్ని. బహుశా నా జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన అనుభూతి అది’’ అని చెప్పారు. అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు పలు కీలక పరీక్షలు జరిపారు.76 లక్షల మైళ్లు..288 భూ ప్రదక్షిణలు శుభాంశు బృందం ఐఎస్‌ఎస్‌లో గడిపిన 18 రోజుల్లో భూమి చుట్టూ ఏకంగా 76 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది. ఆ క్రమంలో 288 సార్లు భూప్రదక్షిణలు చేసింది. నవభారత శకమిది శుభాంశు భావోద్వేగం భూమికి తిరుగు ప్రయాణమయ్యే ముందు శుభాంశు ఐఎస్‌ఎస్‌లో వీడ్కోలు ప్రసంగం చేశారు. 41 ఏళ్ల ముందు రాకేశ్‌ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలో కాలు పెట్టిన క్షణాలను, అక్కడినుంచి భారత్‌ కని్పంచిన తీరును వరి్ణంచిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘మా తిరుగు ప్రయాణం సందర్భంగా ఈ రోజు ఆకాశం నుంచి భారత్‌ ఎలా కని్పస్తుందో చూడాలని మా బృందమంతా ఉత్సాహపడుతోంది. నేటి భారత్‌ ఘనమైన ఆకాంక్షల భారత్‌. నిర్భయ భారత్‌. సగర్వంగా తలెత్తుకుని సాగుతున్న భారత్‌. అందుకే నేడు కూడా నా దేశం మిగతా ప్రపంచమంతటి కంటే మిన్నగా (సారే జహా సే అచ్ఛా) కనిపిస్తోందని చెప్పగలను’’ అంటూ నాడు రాకేశ్‌ శర్మ చేసిన వ్యాఖ్యలను శుభాంశు పునరుద్ఘాటించారు. అక్కడి సహచరులపై శుభాంశు ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగుతుందని జూన్‌ 25న ఫాల్కన్‌–9 రాకెట్‌ ద్వారా అంతరిక్షానికి పయనమయ్యే క్షణాల్లో నేనస్సలు ఊహించలేదు! ఇదంతా ఇదుగో, ఇక్కడ నా వెనక నుంచున్న ఈ అద్భుతమైన వ్యక్తుల వల్లే సాధ్యమైంది. ఈ యాత్రను మా నలుగురికీ అత్యంత ప్రత్యేకమైనదిగా మార్చింది వీళ్లే. అంకితభావంతో కూడిన ఇలాంటి అద్భుతమైన వృత్తి నిపుణులతో కలిసి పని చేయడం నిజంగా మరచి పోలేని అనుభూతి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. కలుద్దాం! అతి త్వరలో భూమిపై కలుద్దాం – ఐఎస్‌ఎస్‌ నుంచిబయల్దేరే ముందు శుభాంశు శుభాంశూ... సుస్వాగతం ‘‘యాగ్జియం–4 స్పేస్‌ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగొస్తున్న శుభాంశుకు హార్దిక స్వాగతం. ఆయన రాక కోసం దేశమంతా ఎనలేని ఆనందోత్సాహాలతో, అత్యంత ఉత్సుకతతో ఎదురుచూస్తోంది. – కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్‌

Russia To Import 1 Million Indian Workers3
రష్యాకు 10 లక్షల మంది భారత కార్మికులు

మాస్కో: ఉక్రెయిన్‌తో మూడేళ్లుగా సాగుతున్న యుద్ధం కారణంగా రష్యాలో మానవ వనరుల కొరత ఏర్పడింది. దేశంలో కార్మికుల కొరతను భర్తీ చేసేందుకు భారత్‌ వైపు దృష్టి సారించింది. ఈ ఏడాది చివరికల్లా 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన భారత కార్మికులను రిక్రూట్‌ చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.ఇందుకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా యాకటెరిన్‌బర్గ్‌లో కొత్తగా కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తోందని ఉరల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ చీఫ్‌ అండ్రీ బెసెడిన్‌ ప్రకటించారు. రష్యాలోని ఉరల్‌ పర్వతాలకు సమీపంలోని యాకటెరిన్‌ బర్గ్‌ ప్రాంతం భారీ పరిశ్రమలకు కేంద్రస్థానం.అక్కడ సైనిక పరిశ్రమలూ భారీగానే ఉన్నాయి. రష్యా ప్రభుత్వ అంచనాల ప్రకారం 2030 నాటికి దేశంలో కారి్మక శక్తి కొరత 31 లక్షలకు పెరగనుంది. అందుకే, ఉత్తర కొరియా, శ్రీలంకల నుంచీ కారి్మకులను రప్పించాలని ప్రణాళికలు వేసింది.

Rasi Phalalu: Daily Horoscope On 15-07-2025 In Telugu4
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి: బ.పంచమి రా.10.22 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: శతభిషం ఉ.7.07 వరకు, తదుపరి పూర్వాభాద్ర,వర్జ్యం: ప.1.16 నుండి 2.48 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.12 నుండి 9.04 వరకు, తదుపరి రా.10.59 నుండి 11.43 వరకు, అమృతఘడియలు: రా.10.30 నుండి 12.01 వరకుసూర్యోదయం : 5.36సూర్యాస్తమయం : 6.34రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు మేషం.. ఆకస్మిక ధన, వస్తులాభాలు. అప్రయత్న కార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల కలయిక. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.వృషభం... ఒక సమాచారం ఊరటనిస్తుంది. బంధువుల ద్వారా ధనలాభం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు.మిథునం... వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.కర్కాటకం... ఆర్థిక లావాదేవీలు కాస్త నిరాశ కలిగిస్తాయి. బాధ్యతలు మరింత పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో సమస్యలు.సింహం.... వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనప్రాప్తి. స్థిరాస్తివృద్ధి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కొత్త నిర్ణయాలు. వ్యాపారాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.కన్య.... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.తుల..... పనుల్లో అనుకోని జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.వృశ్చికం... కష్టపడ్డా ఫలితం కనిపించదు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.ధనుస్సు.... కొత్త వ్యక్తులతో పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని పనులు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోబివృద్ధి.మకరం...... పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలు ముందుకు సాగవు.కుంభం.... సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో వివాదాలు తీరతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆలయ దర్శనాలు. ధనప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిని విధంగా ఉంటాయి.మీనం... మిత్రులతో అకారణంగా వివాదాలు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

Delhi High Court Gives Big Shock to TDP Govt5
సాక్షిపై సర్కారు కుట్ర భగ్నం

సాక్షి, అమరావతి: విజిలెన్స్‌ నివేదిక పేరుతో తన ఆస్థాన పచ్చ పత్రిక ‘ఈనాడు’ కోసం ‘సాక్షి’ని ఇబ్బందిపెట్టేందుకు కూటమి ప్రభుత్వం పన్నిన కుట్రను ఢిల్లీ హైకోర్టు భగ్నం చేసింది. విస్తృత సర్క్యులేషన్‌ ఉన్న ఏదైనా ఒక దినపత్రికను కొనుగోలు చేసుకునేందుకు ప్రతి గ్రామ, వార్డు వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాలకు నెలకు రూ.200 మేర ఆర్థిక సాయాన్ని అందజేస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విజిలెన్స్‌తో విచారణ జరిపించామని, ఇందుకు సంబంధించిన నివేదికను పరిశీలించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను హైకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది.‘మా భుజంపై తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటున్నారు. అందుకు మేం ఎంతమాత్రం అనుమతించబోం’ అని స్పష్టం చేసింది. తాము ఆదేశించకపోయినా విజిలెన్స్‌ విచారణ జరిపించడంపై హైకోర్టు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తామేమీ విజిలెన్స్‌ విచారణ కోరలేదని గుర్తు చేస్తూ... అలాంటప్పుడు దాని నివేదికతో తమకు పని లేదని తేల్చి చెప్పింది. ఆ నివేదిక విషయంలో ఏ రకంగానూ స్పందించబోమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తాము ఆదేశాలు జారీ చేసేందుకు ఏమీ లేదని తెలిపింది. ఈనాడు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ముగిస్తు్తన్నట్లు పేర్కొంది.ప్రస్తుతం వలంటీర్ల వ్యవస్థ లేదని గుర్తు చేసిన ఢిల్లీ హైకోర్టు, ఇంకా ఏవైనా అభ్యంతరాలుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) వద్దకు వెళ్లాలని ఈనాడు యజమాన్యానికి తేల్చి చెప్పింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ దేవేంద్రకుమార్‌ ఉపాధ్యాయ, న్యాయమూర్తి జస్టిస్‌ తుషార్‌కుమార్‌ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ⇒ ఏదైనా ఒక తెలుగు దిన పత్రిక కొనుగోలుకు గ్రామ, వార్డు వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాలకు నెలకు రూ.200 మేర ఆర్థిక సాయం అందజేస్తూ గత ప్రభుత్వం 2023లో ఉత్తర్వులు జారీ చేసింది. వీటిపై ఈనాడు యాజమాన్యం మొదట ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. అలాగే వాలంటీర్లు, సచివాలయాలు చేసే సాక్షి పత్రిక కొనుగోళ్లను పరిగణనలోకి తీసుకోకుండా ఆడిట్‌ బ్యూరో సర్క్యులేషన్‌ (ఏబీసీ)ను ఆదేశించాలని కోరుతూ మరో అనుబంధ పిటిషన్‌ కూడా వేసింది. ఈ రెండు అనుబంధ పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ధర్మాసనం వాటిని కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఏపీ హైకోర్టులో చుక్కెదురుతో సుప్రీంకుఏపీ హైకోర్టులో చుక్కెదురవడంతో ఈనాడు యాజమాన్యం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టులో ఈనాడు వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ 2023 ఏప్రిల్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టు విచారణ మొదలుపెట్టింది. సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది అనురాగ్‌ అహ్లువాలియా వాదిస్తూ.. గ్రామ, వార్డు వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాలకు ఏదైనా ఒక దినపత్రిక కొనుగోలుకు నెలకు రూ.200 ఆర్థిక సాయంపై విజిలెన్స్‌ విభాగం విచారణ జరిపి నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమరి్పంచిందని తెలిపారు. దానిని పరిశీలించాలని కోరారు. కానీ, ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. తమ ఆదేశాల మేరకు విజిలెన్స్‌ విచారణ జరగలేదని.. అలాంటప్పుడు దాని నివేదికతో పని లేదంది. విచారించేందుకు ఏమీ లేదు.. జగతి పబ్లికేషన్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది నంద్రాజోగ్, రాజశేఖరరావు స్పందిస్తూ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ వ్యాజ్యంలో తేల్చేందుకు ఏమీ లేదని తెలిపారు. పిటిషన్‌ నిరర్ధకమైందన్నారు. అహ్లువాలియా మాత్రం.. తమ వ్యాజ్యంలో విచారించాల్సింది ఇంకా ఉందన్నారు. వలంటీర్లు, సచివాలయాలు చేసిన సాక్షి దిన పత్రిక కొనుగోళ్లను పరిగణనలోకి తీసుకోకుండా ఆడిట్‌ బ్యూరో సర్క్యులేషన్‌ (ఏబీసీ)ను ఆదేశించాలని కోరామని, దానిపై విచారణ జరపాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఈ వ్యాజ్యంలో విచారించేందుకు ఏమీ లేదని తేల్చి చెప్పింది. ఏపీ హైకోర్టు ఏం చెప్పిందంటే..నిర్దిష్టంగా ఫలానా పత్రికను మాత్రమే కొనాలంటూ గ్రామ, వార్డు వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం ఆదేశిస్తున్నట్లు ఎలాంటి ఉత్తర్వులు లేవని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వం విడుదల చేసే నిధులతో వాలంటీర్లు, సచివాలయాలు ఓ పత్రికను కొనుగోలు చేసినంత మాత్రాన సర్క్యులేషన్‌ గణాంకాలను విడుదల చేయకుండా ఏబీసీని ఏ రకంగానూ నిరోధించలేమని స్పష్టం చేసింది.కూటమి ప్రభుత్వానిదే అసలు వివక్ష⇒ ఏడాదికి పైగా సాక్షికి ప్రకటనలు ఇవ్వకుండా కుతంత్రం ⇒ ఇప్పటికే దీనిపై కోర్టును ఆశ్రయించిన సాక్షి ⇒ సాక్షి, ఈనాడును ఒకేలా చూసిన గత ప్రభుత్వంవాస్తవానికి ప్రభుత్వ ప్రకటనల విషయంలో గత ప్రభుత్వం ‘సాక్షి’, ఈనాడును ఒకేలా చూసింది. ఎలాంటి వివక్ష లేకుండా రెండు పత్రికలకు సమానంగా ప్రకటనలు ఇచ్చింది. కానీ, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం ‘సాక్షి’ పట్ల వివక్ష చూపుతూ వస్తోంది. ఏడాదికి పైగా ‘సాక్షి’కి ఒక్క ప్రభుత్వ ప్రకటన కూడా ఇవ్వలేదు. ఈనాడుకు అడ్డదిడ్డంగా ప్రకటనలు కట్టబెడుతోంది.చివరకు మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి కూడా ఎక్కువగా ప్రకటనలు ఇస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ‘సాక్షి’ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారం హైకోర్టు ముందు పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం తన వివక్షకు న్యాయస్థానం వేదికగా సమాధానం చెప్పి తీరాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈనాడుకు ఎంత పెరిగిందో ‘సాక్షి’కీ అంతే పెరిగింది.. ఏబీసీ గణాంకాలను పరిశీలిస్తే... ఆ సమయంలో ఈనాడు సర్క్యులేషన్‌ ఎంత పెరిగిందో.. సాక్షి సర్క్యులేషన్‌ కూడా అంతే పెరిగింది.. గ్రామ, వార్డు వాలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాలకు నెలకు రూ.200 మేర ఆర్థిక సాయం అందజేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల సాక్షి దినపత్రిక అదనంగా లబ్ధి పొందింది ఏమీ లేదు. కానీ, సాక్షికి ఏదో లబ్ధి జరిగిపోతోందంటూ ఈనాడు రాద్ధాంతం చేసింది. సర్క్యులేషన్‌ గణాంకాలను విడుదల చేయకుండా ఏబీసీని నిరోధించాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడింది.

Sakshi Editorial On Gujarat Ahmedabad Air India plane crash6
ఈ అరకొర నివేదిక దేనికి?!

ఒక పెను విషాదంపై జరిగే దర్యాప్తు ఎంతో బాధ్యతాయుతంగా వుండాలి. ఆ ఉదంతంలో అసలు జరిగిందేమిటో చెప్పే ప్రయత్నం చేసినప్పుడు అస్పష్టతకు తావీయకూడదు. ప్రాథమిక దర్యాప్తుకైనా, పూర్తిస్థాయి దర్యాప్తుకైనా ఇదే వర్తిస్తుంది. కానీ గత నెల 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం విషయమై శుక్రవారం అర్ధరాత్రి వెలువరించిన ప్రాథమిక దర్యాప్తు ఆ నియమాలను ఉల్లంఘించింది. బాధిత కుటుంబాల్లో అయోమయాన్ని మరింత పెంచింది. ఆ ప్రమాదం వైమానిక ప్రమాదాల చరిత్రలో పెద్దది. ఆ విషాద ఘటన సమ యంలో విమానంలో 242 మంది ప్రయాణికులుండగా, ఒకరు క్షేమంగా బయటపడ్డారు. భవంతిపై కూలినందువల్ల అక్కడున్న 19 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఇంధనాన్ని నియంత్రించే స్విచ్‌లు రెండూ ఆపివేసి వుండటం వల్లనే ప్రమాదం జరిగివుండొచ్చని దర్యాప్తు చేస్తున్న విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక భావించింది. ఇది కేవలం ప్రాథమిక నివేదికే గనుక వెంటనే నిర్ణయానికి రావటం తగదని కేంద్ర వైమానిక మంత్రిత్వ శాఖ అంటున్నది. మంచిదే. అటువంటప్పుడు ఏఏఐబీ నివేదిక స్విచ్‌ల విషయంలో మరింత సమాచారం అందాకే వాటిని ప్రస్తావించి వుండాల్సింది. పైలెట్ల సంఘం కూడా నివేదికను తప్పుబడు తోంది. పైలెట్ల తప్పిదమే కారణమని అర్థం వచ్చేలా నివేదిక వుండటం సరికాదని విమర్శిస్తున్నారు. దర్యాప్తులో తమ ప్రతినిధికి ఇప్పటికైనా చోటీయాలని వారు అంటున్నారు. ఈ అయోమయం ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో వున్న బాధిత కుటుంబాలను మరింత నొప్పించదా? అంతర్జాతీయ వైమానిక నిబంధనల ప్రకారం ప్రమాదం జరిగిన ఏడాదిలోగా తుది నివేదిక రావాలి. ఈలోగా విడుదల చేసే ప్రాథమిక నివేదిక పైలెట్లను తప్పుబట్టే విధంగా వుండటం, ఆ తర్వాత దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదనటం న్యాయమేనా? ఘటనా స్థలంలో దొరికిన స్విచ్‌లున్న పరికరంలో అవి రెండూ ‘ఆన్‌’ చేసివున్నాయి. కానీ కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌లో ఒక పైలెట్‌ మరొకరితో ‘ఇంధనం ఎందుకు నిలిపివేశావ్‌’ అని అడగటం, అందుకు రెండో పైలెట్‌ ‘నేనలా చేయలేదే...’ అంటూ జవాబివ్వటం వినబడటాన్నిబట్టి స్విచ్‌లు ఆపివేసి వున్నట్టు దర్యాప్తు బృందం నిర్ధారణకొచ్చింది. కానీ రెండో పైలెట్‌ ఆ వెంటనే వాటిని సరిచేసి వుండొచ్చని, అందుకే అవి సక్రమంగా వున్న స్థితిలో లభించాయని నివేదిక అంటున్నది. ఈ సంభాషణల్లో అడిగిన వారెవరో, జవాబిచ్చిన వారెవరో దర్యాప్తు చేసినవారు గుర్తించారా?గుర్తించి వుంటే ఆ సంగతి వెల్లడించటానికి వారికున్న అభ్యంతరమేమిటి? ఒకవేళ అలాంటి అభ్యంతరం వున్నప్పుడు అసలు ఆ సంభాషణను బయటపెట్టడం దేనికి? విమానంలోని యాంత్రిక వ్యవస్థలు సంక్లిష్టమైనవి. విమాన గమనంలో మనుషుల జోక్యం దాదాపు అవసరం లేని ‘ఫ్లై బై వైర్‌’ వ్యవస్థ అందుబాటులోకొచ్చి దశాబ్దాలవుతోంది. ముఖ్యంగా విమానం టేకాఫ్‌ సమయంలోనూ, దిగే సమయంలోనూ ఆ వ్యవస్థ పూర్తిగా తనకు తానే అన్నిటినీ సరిచేసుకుంటుంది. పైకెగిరినప్పుడూ, కిందకు దిగినప్పుడూ అవసరమైన ఇంధనం సరఫరా అయ్యేలా చూసుకుంటుంది. ఇవి విఫలమైన పక్షంలో పైలెట్‌ అవసరమైన మార్పులు చేసుకోవ డానికే స్విచ్‌లుంటాయి. రెండు స్విచ్‌లకూ రెండువైపులా రింగ్‌లుంటాయి. వాటికి ప్రత్యేక లాకింగ్‌ వ్యవస్థ వుంటుంది. మనిషి ప్రత్యేకించి వాటిని స్విచాన్‌ చేయటానికైనా, స్విచాఫ్‌ చేయటానికైనా ముందు ఆ లాకింగ్‌ను తెరవక తప్పదు. రెండు స్విచ్‌లూ ఆగిపోవటానికి మధ్య సెకను వ్యవధి వుందని తేల్చారు. పైగా పైకెగురుతున్న సమయంలో ఎక్కువ ఇంధనం సరఫరా కావాల్సి వుండగా దాన్ని కావాలని ఏ పైలెట్‌ కూడా స్విచాఫ్‌ చేయడు. దానిపై దర్యాప్తు బృందం ఏ నిర్ధారణకూ రాలేదు. పైలెట్లుగా వ్యవహరించినవారి చరిత్ర చూసినా ఉద్దేశపూర్వకంగా ఆపివుంటారని ఊహించటం అసాధ్యం. ప్రధాన పైలెట్‌ సుమీత్‌ సభర్వాల్‌కు బోయింగ్‌ 787ను 8,600 గంటలు నడిపిన సర్వీస్‌ (మొత్తంగా 15,638 గంటల సర్వీస్‌) వుండగా, కో పైలెట్‌ క్లైవ్‌ కుందేర్‌కు బోయింగ్‌పై 1,100 గంటల అనుభవం, మొత్తంగా 3,403 గంటల అనుభవం వుంది. ఇద్దరూ ఈ విమానం నడపటానికి ముందు తగినంత విశ్రాంతి తీసుకున్నవారే. ప్రధాన పైలెట్‌ పర్యవేక్షణలో కో పైలెట్‌ ఇష్టానుసారం చేయటం సాధ్యపడదు. ఒకవేళ ఆ ప్రయత్నం జరిగివుంటే వాగ్వాదం చోటుచేసు కునేది. అది రికార్డయ్యేది. పూర్తి స్థాయి పారదర్శకతకు దర్యాప్తు సంస్థ ఎందుకు వెనకాడుతోంది? ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను కేవలం ఒక ప్రశ్న, జవాబు స్థాయికి కుదించటంలోని మర్మమేమిటి? అటు తర్వాత లేదా అంతకుముందు వారేం మాట్లాడుకున్నారు? ఇది చెప్పకపోతే పైలెట్లలో ఒకరు ఆత్మాహుతికి పాల్పడ్డారా అనే సంశయం బయల్దేరుతుంది. ఎయిర్‌లైన్స్‌ రేటింగ్స్‌ వెబ్‌సైట్‌ ప్రధాన సంపాదకుడు జెఫ్రీ థామస్‌ అడుగుతున్నది ఇదే. దర్యాప్తు ఫలితాల గురించి అంతర్జాతీయంగా అనేకులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రకం విమానాలను బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ, వర్జిన్‌ అట్లాంటిక్‌ సంస్థ ప్రధానంగా వినియోగిస్తున్నాయి. ప్రాథమిక నివేదిక విడుదల చేయటం స్వాగతించదగిందే. కానీ ఇప్పటికే వున్న సంశయాలను మరింత పెంచేలా, అస్పష్టత అలుముకునేలా అది వుండటం సరికాదు. పైలెట్ల మధ్య జరిగిన సంభాషణ పూర్తి పాఠం విడుదల చేస్తే అటు పైలెట్‌ల సంఘం అభ్యంతరాలతోపాటు, ఇటు బాధిత కుటుంబాల సంశయాలు కూడా సమసిపోతాయి.

Woman tied to Electric pole: Andhra pradesh7
చంద్రబాబు ఇలాకాలో మహిళ నిర్బంధం

శాంతిపురం: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని కర్లగట్ట పంచాయతీ తమ్మిగానిపల్లిలో సోమవారం ఒక మహిళను విద్యుత్‌ స్తంభానికి కట్టేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. తమ్మిగానిపల్లె గ్రామానికి చెందిన మునెప్పకు ఇద్దరు భార్యలు. అనారోగ్యం బారినపడ్డ ఆయన ఈనెల 5న మృతి చెందాడు. మొదటి భార్య మునెమ్మకు కుమారుడు మంజున, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండో భార్య గంగమ్మకు కుమారుడు సురేష్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇరువురు భార్యల పిల్లల మధ్య ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో మునెప్ప రెండో భార్య గంగమ్మను విద్యుత్‌ స్తంభానికి కట్టేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఈ సమాచారం అందుకున్న రాళ్లబూదుగూరు ఎస్‌ఐ నరేష్‌ ఘటన స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. సురేషే తన తల్లి గంగమ్మను కరెంటు పోల్‌ వద్ద నిలబెట్టి, డ్రిప్పు పైపును చుట్టి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారని ఎస్‌ఐ ఒక ప్రకటనను విడుదల చేశారు.

Samosa, Jalebi And Other Indian Snacks To Carry Health Warnings8
జిలేబీ, సమోసాలపై ఆరోగ్య హెచ్చరికలు! 

న్యూఢిల్లీ: సిగరెట్‌ ప్యాకెట్‌పై ‘ఆరోగ్యానికి హానికరం’ అంటూ విధిగా కనిపించే హెచ్చరిక ఇకపై అన్నిరకాల చిరుతిళ్లపైనా దర్శనమివ్వనుంది. జిలేబీ, సమోసా, పకోడీ, వడా పావ్‌ మొదలుకుని చాయ్‌ బిస్కట్‌ దాకా దాదాపుగా అన్నిరకాల చిరుతిళ్ల ప్యాకెట్లపైనా వాటిలోని నూనెలు, చక్కెర, కొవ్వు తదితరాల శాతాన్ని ప్రముఖంగా ముద్రించనున్నారు. జీవనశైలికి సంబంధించిన పలు రకాల వ్యాధులకు హెచ్చు మోతాదులో నూనెలు, చక్కెర తదితరాలే కారణంగా మారుతున్న నేపథ్యంలో అనారోగ్యకర ఆహారపు అలవాట్లపై ప్రజల్లో అవగాహనను పెంచడమే ఈ చర్య ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది. దేశంలోనే తొలిసారిగా దీన్ని నాగపూర్‌ ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టనున్నారు. ఇందులో భాగంగా క్యాంపస్‌లోని కేఫ్టేరియాలు, ఫుడ్‌ కౌంటర్లు తదితర పక్కనే అందురూ తేలిగ్గా చదవడానికి వీలయ్యేలా పెద్ద అక్షరాలతో కూడిన భారీ పోస్టర్లు, హెచ్చరిక బోర్డులు పెడతారు. వాటిని తరచూ తింటే తలెత్తే ఆరోగ్య సమస్యలను వివరంగా ఏకరువు పెడతారు. అనంతరం దీన్ని కొద్ది నెలల్లో దేశమంతటికీ విస్తరిస్తారు. నిషేధం కాదన్న కేంద్ర ప్రభుత్వం చిరుతిళ్లలో ఇమిడి ఉండే ఆరోగ్యసమస్యల గురించి అధికారిక లెటర్‌హెడ్లు, కవర్లు, నోట్‌ప్యాడ్లు, ఇతర ప్రచురణల్లో ఆరోగ్య సందేశాలను విధిగా ప్రచురించాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఆ శాఖ కార్యదర్శి పుణ్యసలిల శ్రీవాత్సవ జూన్‌ 21న ఈ మేరకు వాటికి లేఖలు రాశారు. సమోసా, వడా పావ్‌ తదిత సంప్రదాయ చిరుతిళ్లతో పాటు పిజ్జాలు, బర్గర్లు, డోనట్లను వంటి విదేశీ స్నాక్స్‌ను ఈ జాబితాలో చేర్చాలని సబార్డినేట్‌ లెజిస్లేషన్‌పై పార్లమెంటరీ కమిటీ చైర్మన్, శివసేన ఎంపీ మిలింద్‌ దేవ్‌రా సూచించారు. అయితే ఈ చర్య సమోసా, జిలేబీ, పకోడీ వంటి పాపులర్‌ చిరుతిళ్లపై నిషేధం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ‘‘కేవలం వాటని తినడం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం, తద్వారా జీవన శైలి వ్యాధుల ముప్పును కనీస స్థాయికి తగ్గించడమే మా లక్ష్యం’’ అని వివరించింది. పెను సమస్యగా... భారత్‌లో ఆరోగ్య సంక్షోభం నానాటికీ పెరుగుతూ వస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణాల్లో అతిగా వేయించిన, చక్కెర తదితరాల శాతం ఎక్కువగా ఉండే స్నాక్స్‌ వాడకం ఒకటని గుర్తించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2025 కల్లా భారత్‌లో ఏకంగా 44 కోట్ల మంది స్థూలకాయులుగా మారడం ఖాయమని ప్రఖ్యాత లాన్సెట్‌ జర్నల్‌ ఇటీవల ప్రచురించిన అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరించింది. ‘‘దేశవ్యాప్తంగా పిల్లలతో పాటు పెద్దల్లో కూడా స్థూలకాయ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఐదుగురిలో ఒకరి కంటే ఎక్కువగా అధిక బరువుతో బాధ పడుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5) ఎత్తిచూపింది.హెచ్చరికలు వేటిపై? సమోసా, జిలేబీ, పకోడీ, వడా పావ్, కచోరీ, పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్‌ ఫ్రైస్, గులా బ్‌ జామూన్, చాక్లెట్‌ పేస్ట్రీ లు, అన్నిరకాల శీతల పానీయాలు తదితరాలు

England beat India by 22 runs in Lords Test to take 2-1 lead9
పోరాడినా... పరాజయమే 

లార్డ్స్‌ టెస్టులో భారత్‌ గుండె పగిలింది. విజయానికి ఎంతో చేరువగా వచ్చినా చివరకు ఓటమే పలకరించింది. ఐదో రోజు చేతిలో 6 వికెట్లతో 135 పరుగులు చేయాల్సిన టీమిండియా లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైంది. ఆశలు పెట్టుకున్న పంత్, రాహుల్‌ విఫలం కాగా... 82/7 నుంచి జట్టును గెలిపించేందుకు రవీంద్ర జడేజా పోరాడినా లాభం లేకపోయింది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ స్టోక్స్‌ జట్టును ముందుండి నడిపించగా... పట్టుదలగా బౌలింగ్‌ చేసిన ఆతిథ్య జట్టు మ్యాచ్‌ చేజారకుండా కాపాడుకోగలిగింది. ఈ టెస్టులో పలు సందర్భాల్లో శుబ్‌మన్‌ గిల్‌ బృందం ఆధిక్యం ప్రదర్శించినా... కీలక క్షణాలను ఇంగ్లండ్‌ సరిగ్గా ఒడిసి పట్టుకుంది. టీమ్‌ వెనుకబడిన ప్రతీసారి పోరాటయోధుడిలా నేనున్నానంటూ ముందుకొచ్చి సత్తా చాటిన స్టోక్స్‌దే ఈ గెలుపు అనడం అతిశయోక్తి కాదు. లండన్‌: ‘అండర్సన్‌–టెండూల్కర్‌ ట్రోఫీ’లో ఇంగ్లండ్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సోమవారం లార్డ్స్‌ మైదానంలో ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ 22 పరుగుల స్వల్ప తేడాతో భారత్‌పై విజయం సాధించింది. అనూహ్య మలుపులు, ఉత్కంఠతో సాగుతూ వచ్చిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌ వైఫల్యం భారత్‌ను దెబ్బ తీసింది. 193 పరుగుల లక్ష్యంతో ఐదో రోజు బరిలోకి దిగిన భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్‌ పదునైన బౌలింగ్‌తో స్వల్ప స్కోరును కూడా కాపాడుకోవడంలో సఫలమైంది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 77 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీసిన బెన్‌ స్టోక్స్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు గెల్చుకున్నాడు. సిరీస్‌లో ఇంగ్లండ్‌ 2–1తో ముందంజలో ఉండగా... నాలుగో టెస్టు ఈ నెల 23 నుంచి మాంచెస్టర్‌లో జరుగుతుంది. ఆర్చర్‌ పదునైన బౌలింగ్‌... ఓవర్‌నైట్‌ స్కోరు 58/4తో ఆటను కొనసాగించిన భారత్‌కు చివరి రోజు సరైన ఆరంభం లభించలేదు. 11 పరుగుల వ్యవధిలో జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. గాయంతో బాధపడుతున్న పంత్‌ తడబడుతూనే బ్యాటింగ్‌ చేశాడు. ఆర్చర్‌ అద్భుత బంతితో పంత్‌ (9)ను క్లీన్‌బౌల్డ్‌ చేయగా, స్టోక్స్‌ బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌ (58 బంతుల్లో 39; 6 ఫోర్లు) వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్‌ అవుట్‌ ఇవ్వకపోవడంతో రివ్యూ కోరిన ఇంగ్లండ్‌ ఫలితం సాధించింది. తర్వాతి ఓవర్లోనే ఆర్చర్‌ తన బౌలింగ్‌లో అద్భుత రిటర్న్‌ క్యాచ్‌తో సుందర్‌ (0)ను పెవిలియన్‌ పంపించాడు. 82/7 వద్ద పరిస్థితి చూస్తే భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఎంతో సమయం పట్టదనిపించింది. జడేజా పోరాటం... అప్పటి వరకు 15 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేసిన జడేజా... జట్టు భారాన్ని తనపై వేసుకున్నాడు. తాను ప్రధాన పాత్ర పోషిస్తూ తర్వాతి ముగ్గురు బ్యాటర్లతో అతను కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్‌తోనే ఒక్కో పరుగు జోడించడంతో పాటు అవతలి బ్యాటర్లను కాపాడుకుంటూ అతని ఇన్నింగ్స్‌ సాగింది. ఈ క్రమంలో పరుగుల రాక కూడా బాగా తగ్గిపోయింది. పదునైన డిఫెన్స్‌ చూపించగలిగినా... నితీశ్‌ కుమార్‌ రెడ్డి (53 బంతుల్లో 13; 1 ఫోర్‌) లంచ్‌కు ముందు వోక్స్‌ చక్కటి బంతికి వెనుదిరిగాడు. ఆ తర్వాత జస్‌ప్రీత్‌ బుమ్రా (54 బంతుల్లో 5; 1 ఫోర్‌), జడేజా భాగస్వామ్యం ఏకంగా 22 ఓవర్ల పాటు సాగింది. సహనం కోల్పోయిన బుమ్రా భారీ షాట్‌ ఆడబోయి అవుట్‌ కాగా... మొహమ్మద్‌ సిరాజ్‌ (40 బంతుల్లో 4) అండతో జడేజా జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అయితే చివర్లో పెరిగిన ఉత్కంఠ మధ్య స్పిన్నర్‌ బషీర్‌ బౌలింగ్‌లో సిరాజ్‌ వికెట్‌తో భారత్‌ ఓటమి ఖాయయైంది. అలా ముగిసింది... భారత్‌ విజయానికి మరో 46 పరుగులు కావాల్సిన సమయంలో జడేజాతో సిరాజ్‌ జత కలిశాడు. జడేజా జాగ్రత్తగా స్ట్రయికింగ్‌ నిలబెట్టుకుంటుండగా... సిరాజ్‌ కూడా పట్టుదలగా 29 బంతులు ఆడి సహకరించాడు. మెలమెల్లగా భాగస్వామ్యం 13.1 ఓవర్లలో 23 పరుగులు పూర్తి చేసుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి వికెట్‌ తీయలేక ఇంగ్లండ్‌ శిబిరంలో అసహనం పెరిగిపోతోంది. ఇలాగే సాగితే సింగిల్స్‌తో మరో 23 పరుగులు కావడం సాధ్యమే అనిపించింది. అయితే సిరాజ్‌ అనూహ్య వికెట్‌తో ఆట ముగిసింది. బషీర్‌ వేసిన బంతిని సిరాజ్‌ దానిని చక్కగా డిఫెన్స్‌ ఆడాడు. అయితే కింద పడిన బంతి నెమ్మదిగా అతని కాలి వెనక భాగం వైపు వెళ్లగా, దానిని సిరాజ్‌ గుర్తించలేకపోయాడు. తేరుకునేలోపే బంతి స్టంప్స్‌ను తాకి ఒక బెయిల్‌ కింద పడటంతో ఇంగ్లండ్‌ సంబరాలు చేసుకుంది.స్కోరు వివరాలు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 387; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 387; ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 192; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) స్మిత్‌ (బి) ఆర్చర్‌ 0; రాహుల్‌ (ఎల్బీ) (బి) స్టోక్స్‌ 39; కరుణ్‌ నాయర్‌ (ఎల్బీ) (బి) కార్స్‌ 14; గిల్‌ (సి) స్మిత్‌ (బి) కార్స్‌ 6; ఆకాశ్‌దీప్‌ (బి) స్టోక్స్‌ 1; పంత్‌ (బి) ఆర్చర్‌ 9; జడేజా (నాటౌట్‌) 61; సుందర్‌ (సి అండ్‌ బి) ఆర్చర్‌ 0; నితీశ్‌ రెడ్డి (సి) స్మిత్‌ (బి) వోక్స్‌ 13; బుమ్రా (సి) (సబ్‌) కుక్‌ (బి) స్టోక్స్‌ 5; సిరాజ్‌ (బి) బషీర్‌ 4; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (74.5 ఓవర్లలో ఆలౌట్‌) 170. వికెట్ల పతనం: 1–5, 2–41, 3–53, 4–58, 5–71, 6–81, 7–82, 8–112, 9–147, 10–170. బౌలింగ్‌: వోక్స్‌ 12–5–21–1, ఆర్చర్‌ 16–1–55–3, స్టోక్స్‌ 24–4–48–3, కార్స్‌ 16–2–30–2, రూట్‌ 1–0–1–0, బషీర్‌ 5.5–1–6–1.

GO firmly committed to reservations for BCs in local bodies10
ఆచితూచి 42% ఉత్తర్వులు!

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచి తూచి ముందుకెళుతోంది. ఇటీవల మంత్రిమండలి ఆమోదించి పంపిన ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం లభిస్తుందన్న అంచనాతో.. తదుపరి ప్రక్రియలో భాగంగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసే దిశలో అడుగులు వేస్తోంది. ఈ జీవో రూపకల్పన కోసం.. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 50 శాతానికి మించి ఇవ్వాలంటూ పంచాయతీరాజ్‌ చట్టం–2018కి చేసిన సవరణ, ఈ మేరకు ఆమోదించిన ఆర్డినెన్స్, నూతన మార్గదర్శకాల ప్రకారం డెడికేటెడ్‌ కమిషన్‌ సమర్పించే నివేదికలను ఆధారంగా చేసుకోనుంది. ఆర్డినెన్స్‌కు మంత్రివర్గ ఆమోదం అనంతరం కొత్త విధివిధానాలతో మరో నివేదిక ఇవ్వాలని డెడికేటెడ్‌ కమిషన్‌ను కోరిన ప్రభుత్వం.. ఆ నివేదిక వచ్చిన తర్వాత వారం రోజుల్లోపు న్యాయపరమైన చిక్కులకు అవకాశం లేకుండా జీవో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఆర్డినెన్స్‌ను, కమిషన్‌ నివేదికను ప్రస్తావిస్తూ.. పంచాయతీరాజ్‌ చట్టం–2018లోని సెక్షన్‌ 285 (ఏ)కు చేసిన సవరణ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతానికి మించవచ్చు అని మాత్రమే ఆర్డినెన్సులో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్డినెన్సుతో పాటు డెడికేటెడ్‌ కమిషన్‌ ఇచ్చే నివేదిక మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంటారని చెబుతున్నాయి. ఈ జీవో మేరకే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దఖలు పడతాయని వివరిన్నాయి. చట్టానికి చేసిన సవరణే ప్రాతిపదికగా జీవో ప్రభుత్వం జీవో విడుదల చేసే జీవో న్యాయ సమీక్షలోనూ నిలబడే విధంగా అవసరమైన అన్ని అంశాలను ప్రస్తావిస్తూ వివరణాత్మకంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల పరిమితిని ప్రత్యేక పరిస్థితుల్లో పెంచేందుకు పంచాయతీ రాజ్‌ చట్టానికి చేసిన సవరణనే ఈ జీవోకు ప్రాతిపదికగా ఉంటుందని అంటున్నారు. బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ వెనుకబాటు స్థాయి, జనాభాకు తగిన ప్రాతినిధ్యం అనే అంశాల ప్రాతిపదికన చట్టాన్ని సవరించామని, ఈ అంశాలన్నింటినీ కూలంకషంగా పేర్కొంటూ రిజర్వేషన్ల పెంపును సమర్థించే కోణంలో జీవోకు రూపకల్పన చేస్తున్నామని వెల్లడిస్తున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement