-
తక్కువ టైంలో చాలామందిని కోల్పోయా.. భరించడం నా వల్ల కాలేదు
యాంకర్ రష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే 'జబర్దస్త్' కామెడీ షోకు హోస్ట్‌గా చాన్నాళ్ల నుంచి చేస్తూనే ఉంది. కానీ రీసెంట్ టైంలో ఈమెకు పలు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు ఆత్మీయులని కోల్పోవడం తదితర కారణాల వల్ల సోషల్ మీడియాలోనూ పెద్దగా కనిపించలేదు. వారం పదిరోజుల క్రితం కాశీ వెళ్లొచ్చిన ఈమె.. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా వైష్ణవిని పెళ్లి చేసుకున్న షన్ను.. ఫొటోలు వైరల్)'నా నవ్వు చూసి చాలామంది ప్రశ్నించొచ్చు. వారణాసి పర్యటనలో ఇది నా చివరిరోజు. కాశీకి రావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. గతంలో కాశీ వెళ్లినప్పుడు నా మనసు చాలా భారంగా ఉంది. ఏం చేయాలో తోచని దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. చాలా తక్కువ సమయంలో చాలామందిని కోల్పోయాను. ఆ బాధ భరించడం నా వల్ల కాలేదు. ఆ జ్ఞాపకాలని వదిలిపెట్టలేకపోతున్నాను. దేవుడి సంకల్పం లేనిదే ఏ ఆధ్మాత్మిక యాత్ర సాధ్యపడదు. ఏదీ మన చేతుల్లో లేదు. నిజమే నా మొదటి పర్యటనకు ఇప్పటికే చాలా మార్పు కనిపిస్తోంది. మనషులని కోల్పోవడమనేది మనిషి అనుభవంలో, పరిణామ క్రమంలో ఓ భాగమని అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు నేనే చాలా మెరుగ్గా అనిపిస్తున్నాను' అని రష్మి రాసుకొచ్చింది.2023లో నానమ్మని కోల్పోయిన రష్మి.. తర్వాత ఏడాది తాతని కోల్పోయింది. అలానే భుజానికి సర్జరీ జరగడం లాంటివి ఈమెలో దైవచింతనని పెంచాయి. అలా కాశీ వెళ్లివస్తోంది. ఈ క్రమంలోనే పలు ఫొటోలని షేర్ చేసి, తన మనసులోని బాధని కాస్తంత బయటపెట్టింది. అలానే మనుషులని కోల్పోవడం జీవితంలోని ఓ భాగమని అర్థం చేసుకుంది. (ఇదీ చదవండి: యాప్ చెప్పిందని బ్రేకప్.. ఫన్నీగా LIK ట్రైలర్) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
ఆ ముప్పు ముంచుకొచ్చింది: కియోసాకి హెచ్చరిక
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 నాటికి ప్రపంచం ఆర్థికంగా పెను ముప్పును ఎదుర్కోబోతోందని హెచ్చరిస్తూ ఆయన ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి 1974లో జరిగిన కొన్ని కీలక పరిణామాలే కారణమని ఆయన విశ్లేషించారు."బ్యాడ్ న్యూస్.. చరిత్ర ముంచుకొచ్చింది" అంటూ రాబర్ట్ కియోసాకి 2026 ఆర్థిక స్థితిగతులపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 1974లో జరిగిన రెండు ప్రధాన మార్పులు నేటి వినాశకర పరిస్థితులకు కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు.పెట్రో డాలర్ వ్యవస్థ - చమురు యుద్ధాలు1974 వరకు అమెరికా డాలర్‌కు బంగారాన్ని హామీగా ఉంచేవారని, కానీ ఆ ఏడాది నుంచి డాలర్ 'పెట్రో డాలర్'గా మారిందని కియోసాకి గుర్తుచేశారు. అంటే, బంగారం స్థానంలో చమురు (Oil) డాలర్‌కు వెన్నుముకగా మారింది. ఆ కారణంగానే 2026లో చమురు కోసం ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి.పెన్షన్ వ్యవస్థలో మార్పు - రిటైర్మెంట్ భయం1974లో అమెరికాలో 'ERISA' చట్టం వచ్చిందని, దీనివల్ల ఉద్యోగులకు జీవితాంతం వచ్చే గ్యారెంటీ పెన్షన్లు పోయి.. 401k, IRA వంటి రిస్క్‌తో కూడిన పథకాలు వచ్చాయని ఆయన విమర్శించారు. కోట్లాది మంది బేబీ బూమర్స్ (వృద్ధులు) తమ పదవీ విరమణ తర్వాత రూపాయి ఆదాయం లేక ఇబ్బంది పడబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి వ్యవస్థలు దివాళా తీసే స్థితిలో ఉన్నాయని, దీనివల్ల లక్షలాది మంది వృద్ధులు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అప్పుల ఊబిలో అమెరికాప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అప్పులు పెరిగిపోయాయని, ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రుణగ్రస్త దేశంగా మారిందని కియోసాకి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఆర్థిక విద్య (Financial Education) నేర్పకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆయన దుయ్యబట్టారు.మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలంటే..ఈ సంక్షోభం నుండి బయటపడటానికి రాబర్ట్ కియోసాకి మూడు ప్రధాన సూత్రాలను ప్రతిపాదించారు. నిజమైన సంపదను పొదుపు చేయండి. కేవలం కాగితపు కరెన్సీని నమ్ముకోకుండా బంగారం (Gold), వెండి (Silver), బిట్‌కాయిన్ (Bitcoin)లలో పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.యూట్యూబ్ వంటి వేదికల్లో మంచి గురువులను ఎంచుకుని, డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలని కోరారు. అయితే, మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మీ ఆర్థిక భవిష్యత్తును ఇతరుల చేతుల్లో పెట్టకండి. మీరే బాధ్యత తీసుకుని సంపన్నమైన భవిష్యత్తును నిర్మించుకోండి.ఇదీ చదవండి: బంగారం ధరలు: వారమంతా పరుగులు.. ఇప్పుడేమో ఇలా.."1974లో మొదలైన భవిష్యత్తు ఇప్పుడు మన ముందు నిలిచింది. ఓడిపోయిన వారు మీ భవిష్యత్తును నిర్ణయించేలా అవకాశం ఇవ్వకండి." అని కియోసాకి తన పోస్ట్‌ను ముగించారు.BAD NEWS: History has ARRIVED.1974 was a future changing year. 1974 marked two massive changes in our world’s future.Our problem is….in 2026, our future is here.The two 1974 future changing events were:1974 the US dollar became the Petro dollar. Rather than backed by…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 4, 2026 -
పెళ్లికి ముందు సూది మందు
సాక్షి, హైదరాబాద్: పెళ్లికి ముందు బరువు తగ్గే సులభమైన మార్గాల వెతుకులాటలో యువతీ యువకులు నిమగ్నమవుతున్నారు. వెయిట్లాస్కు సంబంధించిన ప్రత్యేక ఇంజెక్షన్లు, మందులపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో భారత్‌లో వీటి వినియోగం వేలంవెర్రిగా పెరిగిపోతోంది. పెళ్లికి ముందు వ్యాయామం, ఆహార నియమాలతో ఆశించిన ఫలితాలు రాలేదంటూ సడన్‌గా బరు వు తగ్గేందుకు ‘మౌంజారో’(టిర్జెపాటైడ్) ఇంజెక్షన్ తీసుకోవడం ఇటీవల పెళ్లీడు యువతలో బాగా పెరిగింది. పెళ్లి రోజు న నాజూగ్గా, అందంగా కనిపించాలనే తాపత్రయం కారణంగా భారత్‌లో ఇదొక కొత్త ట్రెండ్‌గా మారింది. ఇది ఎక్కడివరకు వెళ్లిందంటే... ఢిల్లీలోని ఓ క్లినిక్ ఏకంగా ‘మౌంజారో బ్రైడ్’పేరిట ఓ ప్రత్యే క ప్యాకేజీని ప్రకటించింది. మరికొన్ని క్లినిక్‌లు.. చర్మ, కేశాలంకరణతోపాటు ఈ ఇంజెక్షన్లను ప్రీ–వెడ్డింగ్ ప్యాకేజీల్లో చేర్చే వరకు పరిస్థితి ఏర్పడింది. మనదేశంలో మధుమేహం, బరువు తగ్గుదల కోసం అను మతి పొందిన తొలి జీఎల్పీ–1 మందు ‘మౌంజారో. దీన్ని ఎలి లిల్లీ సంస్థ ఉత్పత్తి చేసి విక్రయిస్తోంది. దీని పోటీ దారు నోవో నార్డిస్క్ తయారుచేసిన ‘వెగోవీ’కూడా అందుబాటులోకి వచ్చింది. శారీరక రూపానికి ప్రాధాన్యంతో... భారత్‌లో సంప్రదాయ వివాహాల్లో వధువు, వరుడి శారీరక రూపం, ఆర్థిక స్థితికి సంబంధించి అధిక ప్రాధాన్యతను కలిగి ఉంటున్నాయి. పెళ్లిలో ఒక నిర్దిష్ట పద్ధతిలో కనిపించాలనే సామాజిక ఒత్తిడి దీనికి కారణం. గతేడాది భారత్‌లో ఈ రెండు సంస్థలు తమ ఊబకాయ నివారణ మందులను విడుదల చేయగా, కొన్ని నెలల్లోనే మౌంజారో అమ్మకాలు రెట్టింపయ్యాయి. ఈ మందులోని క్రియాశీల పదార్ధమైన సెమాగ్లుటైడ్ పేటెంట్ గడువు ముగియడంతో, భారతీయ ఔషధ తయారీదారులు ఇటీవల నోవో మందు చౌక వెర్షన్ల విక్రయాలు ప్రారంభించి, దాని లభ్యతను విస్తృతం చేశారు. ఈ మందులు ఊబకాయం ఉన్నవారిగా వర్గీకరించిన పెద్దలు లేదా మధుమేహం, అధిక రక్తపోటు లేదా స్లీప్ అప్నియా వంటి బరువు సంబంధిత వైద్య పరిస్థితితో అధిక బరువు ఉన్నవారి కోసం ఉద్దేశించినవిగా ఉన్నాయి. భారత్‌లో మౌంజారో ఇంజెక్షన్ పెన్ అత్యల్ప డోస్ ధర నెలకు రూ.13,125, గరిష్ట డోస్ ధర రూ. 25,781గా ఉంది. వెగోవీ అత్యల్ప డోస్‌ను నెలకు రూ.5,660, గరిష్ట డోస్‌ను రూ.16,400కి విక్రయిస్తున్నారు. ఇమ్యునో డిప్రెషన్ బారిన పడే ప్రమాదం ఎలాంటి వెయిట్‌లాస్ చికిత్స అయినా మెటబాలిక్ సిండ్రోమ్‌తో సడన్‌గా బరువు తగ్గితే రోగ నిర్ధారణ శక్తికి నష్టం జరుగుతుంది. అందువల్ల వైద్యుడిని సంప్రదించకుండా ‘ఓవర్ ద కౌంటర్’గా ఈ మందులు తీసుకోవడం అత్యంత ప్రమాదకరం. ఈ ఇంజెక్షన్లను మెడిసిన్‌గా వాడాలే తప్ప జ్వరం, ఒళ్లు నొప్పులకు క్రోసిన్ టాబ్లెట్‌గా వాడకూడదు. ఈ మందులతో సడన్‌గా బరువు తగ్గితే తీవ్రమైన ఇమ్యునో డిప్రెషన్‌తో క్షయ, ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదముంది. సడన్ వెయిట్‌లాస్‌తో యాంగ్జయిటీ ట్రమెర్స్, తీవ్రమైన వెన్నునొప్పుల బారిన కూడా పడే అవకాశాలున్నాయి. ఈ బరువు తగ్గుదల మందులు కూడా శాశ్వత పరిష్కారంకాదు. ఈ ఇంజెక్షన్లను తీసుకోవడం ఆపేస్తే వెంటనే బరువు పెరుగుతారు. సాధారణంగా అయితే 6 నెలల నుంచి ఏడాది వరకు ఈ మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మెడిసిన్ మార్కెట్లోకి వచ్చి ఏడాదే అవుతోంది. అందువల్ల వీటి దీర్ఘకాల ప్రభావాలు, దు్రష్పభావాలు ఏమిటనేది ఇంకా పూర్తిస్థాయిలో తెలియడం లేదు. తగిన డైట్, వ్యాయామానికి ఇది ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. –డా. బూర నర్సయ్యగౌడ్, బేరియాట్రిక్ సర్జన్ -
గల్లంతైన అమెరికన్ పైలట్ ఆచూకీ లభ్యం!
ఇరాన్ దాడుల్లో ఎఫ్–15ఇ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే.. ఆ విమానంలో గల్లంతైన మరో పైలెట్ ఆచూకీ లభ్యమైంది. దాదాపు 36 గంటల తర్వాత పైలట్ ఆచూకీ లభించింది. పైలెట్‌ను అమెరికా భద్రతా బలగాలు రక్షించాయి. గల్లంతైన ఎఫ్-15ఈ ఫైటర్ జెట్ రెండో పైలట్ సేఫ్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ విజయవంతమైందన్నారు.‘‘ప్రస్తుతం పైలట్ అమెరికా బలగాల అధీనంలోనే ఉన్నారు. ఇరాన్‌లోని ప్రమాదకరమైన పర్వతాల్లో పైలట్‌ను గుర్తించారు. రక్షణ చర్యలకు ఆటంకం కలగకూడదనే బహిర్గతం చేయలేదు. శత్రు భూభాగంలోకి వెళ్లి ఎయిర్మెన్ను రక్షించడం చాలా గొప్ప విషయం. ఏ అమెరికన్ యోధుడిని ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టం. ఇరాన్ గగనతలంపై అమెరికా తిరుగులేని ఆధిపత్యం సాధించింది’’ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.శుక్రవారం నాటి ఇరాన్ దాడుల్లో ఎఫ్–15ఇ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానంతో పాటు కె–10 వార్ థగ్ ఫైటర్ జెట్‌ను కూడా అమెరికా కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే, ‘‘కె–10 తాలూకు శకలాలు కువైట్ భూభాగంలో పడ్డాయి. దాంతో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఎఫ్–15ను ఇరాన్ తమ గగనతనంలోనే వేయగా.. అందులోని ఓ పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. వారు నైరుతి ఇరాన్‌లోని కొగిలుయె, బోయర్–అహ్మద్ కొంత ప్రాంతంలో కిందకు దూకారు. అమెరికా ప్రత్యేక సైనిక దళాలు వెంటనే రంగంలోకి దిగి వారిలో ఒకరిని కాపాడి తీసుకెళ్లాయి. గల్లంతైన రెండో పైలట్ కోసం శనివారం కూడా ముమ్మర గాలింపు కొనసాగింది. ఆ పైలెట్ ఆచూకీ లభించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా తెలిపారు.కాగా, హార్మూజ్ జలసంధిని మరో 48 గంటల్లో బేషరతుగా తెరవాలని ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ‘‘హార్మూజ్‌ను తెరిచేందుకు మీకిచ్చిన గడువు ఏప్రిల్ 6తో ముగుస్తోంది. ఆలోపే ఒప్పందానికి రండి. లేదంటే భారీ దాడులతో మీకు అక్షరాలా నరకం చవిచూపిస్తాం’’అంటూ బెదిరింపులకు దిగారు. అయితే, ఇరాన్ శక్తిసామర్థ్యాలు గొప్పవంటూ ఈ సందర్భంగా ట్రంప్ అంగీకరించడం విశేషం. ‘ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకదానితో 32 రోజులుగా మేం సైనిక పోరాటం చేస్తున్నాం’అని ఆయన చెప్పుకొచ్చారు. -
సీక్వెల్‌కు నో.. ఆయనతో నటించడం కష్టం: హీరోయిన్
దక్షిణాది చిత్ర పరిశ్రమలోని చాలా బోల్డ్ నటీమణల్లో ఆండ్రియా ఒకరు. కథానాయకిగా పలు చిత్రాల్లో నటించినా, ఇప్పుడు ఎలాంటి చాలెంజింగ్ పాత్రలు అయినా చేయడానికి రెడీ అనే నటి. ఇటీవల నిర్మాతగా కూడా మారి తాజాగా లెజెండ్ శరవణన్ కథానాయకుడిగా నటించిన లీడర్ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో నటించారు. ఇకపోతే చాలాకాలం క్రితం సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన చిత్రం ఆయిరత్తిల్ ఒరువన్(యుగానికి ఒక్కడు). ఇందులో ఆండ్రియా, రీమాసేన్ హీరోయిన్గా నటించారు. యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ధనుష్ హీరోగా ఆయిరత్తిల్ ఒరువన్ చిత్రానికి సీక్వెల్ చేస్తానని దర్శకుడు సెల్వరాఘవన్( Selvaraghavan) ఆ మధ్య ప్రకటించారు. అయితే ఆ తర్వాత దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు. ఆ చిత్ర తొలి భాగంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటించిన ఆండ్రియా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయిరత్తిల్ ఒరువన్–2 చిత్రం గురించి మాట్లాడింది. పార్ట్-1లో నటించిన అనుభవంతో ఆ తర్వాత తను చేసిన ప్రతి ప్రాజెక్ట్ చాలా సులువుగా అనిపించిందని తెలిపింది. సినిమా షూటింగ్ సమయంలో సెల్వరాఘవన్ చెప్పిన టైమింగ్ ప్రకారం ఏదీ జరగదని చెప్పింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో తాను పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతమంటూ పేర్కొంది. కాబట్టి మళ్లీ ఆయనతో సినిమా చేయడం తన వల్ల కాదని పేర్కొంది. షూటింగ్ సమయంలో తాను అనుభవించిన మానసిక, శారీరక ఒత్తిడిని ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె గుర్తుచేసుకుంది. తర్వాత ఎలాంటి పాత్ర వచ్చినా సరే చాలా ఈజీగా నటించగలిగానని పేర్కొంది. ఆ చిత్రానికి సీక్వెల్ రూపొందవచ్చు, లేకపోవచ్చు కానీ, సీక్వెల్ తాను నటిస్తానని మాత్రం ఆశించవద్దని క్లారిటీ ఇచ్చింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించడం చాలా కష్టమని ఆండ్రియా పేర్కొంది. -
త్వరలో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రవాహం!
ముంబై: నకిలీ అప్లికేషన్లు(యాప్స్)తో స్టాక్ మార్కెట్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. దీంతో మదుపరుల రక్షణార్థం గూగుల్, మెటా తదితర టెక్నాలజీ దిగ్గజాలు ఆర్థిక నియంత్రణ సంస్థలతో కలసి పనిచేయాలని సూచించారు.త్వరలోనే మరోసారి స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రవాహానికి వీలున్నట్లు అంచనా వేశారు. వెరసి మార్కెట్లో వాటాదారులందరికీ రక్షణ కల్పింపంచవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా యూనిక్ ఇన్వెస్టర్ల సంఖ్య 14 కోట్లను తాకినట్లు వెల్లడించారు. మరోపక్క మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 423 లక్షల కోట్లకు చేరినట్లు తెలియజేశారు. వెరిఫైడ్ యాప్ లేబుల్‌ను గూగుల్ ప్రవేశపెట్టిన సందర్భంగా పాండే ఈ అంశాలను ప్రస్తావించారు. -
బంగారం ధరలు: వారమంతా పరుగులు.. ఇప్పుడేమో ఇలా..
దేశంలో గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు పసిడి ధరలు (Today Gold Rate) వరుసగా రెండో రోజూ నిలకడగా ఉన్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరల్లో (Today Silver Rate) కూడా ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గర్భసంచి జారడం అంటే...?
సాధారణంగా మహిళల్లో మధ్యవయసు దాటిన కొందరిలో ‘గర్భసంచి జారడం’ అనే మాట వినిపిస్తుంటుంది. మహిళల పొత్తికడుపులో గర్భసంచి అంటూ అందరూ సామాన్యంగా పిలిచే యుటెరస్‌తో పాటు పెద్దపేగు, మూత్రపు సంచి లాంటివి కూడా ఉంటాయి. ఇవి కాస్తంత జారిపోయి యోని పైభాగం మీద ఒత్తిడి కలిగిస్తూ మహిళల్లో తీవ్రమైన నొప్పినీ, ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇలా పొత్తికడుపులోని యుటెరస్, పెద్దపేగు, మూత్రపు సంచి (బ్లాడర్) వంటి దేహ భాగాలు యోని పైభాగంలోకీ లేదా ఒక్కోసారి యోనిలోనికి జారిపోవడాన్నే వైద్యపరిభాషలో ‘పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్’ అని పేర్కొంటారు. అవి ఎందుకలా జారతాయో, అప్పుడు ఏం చేయాలో చూద్దాం. నిజానికి మహిళల్లో తమ పొత్తికడుపులోని అవయవాలన్నీ చాలా దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి. పొత్తికడుపులోపల ఉండే గర్భసంచి వంటి అనేక అంతర్గత అవయవాలన్నీ ‘పెల్విక్ ఫ్లోర్’ అని పిలిచే ఓ పొర లాంటి కండరంపై ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆ ‘పెల్విక్ ఫ్లోర్’ ఆ అంతర్గత అవయవాలను మోస్తూ ఉంటుంది.ప్రొలాప్స్కు మరికొన్ని కారణాలు పొత్తికడుపు అవయవాలు ఇలా కిందికి జారడానికి చాలా అంశాలు కారణమవుతాయి. ఉదాహరణకు వయసు పెరగడం వల్ల పెల్విక్‌ఫ్లోర్ కండరం బలహీనపడటం అనే ముఖ్యకారణంతో పాటు...→ బిడ్డలకు జన్మనివ్వడం (ఛైల్డ్ బర్త్) → రుతుక్రమం ఆగిపోవడం (మెనోపాజ్) → బరువు పెరగడం (ఒబేసిటీ) → తీవ్రమైన మలబద్ధకం (క్రానిక్ కాన్స్టిపేషన్)తో ముక్కడం వల్ల కొందరిలో గర్భసంచి తొలగింపు ఆపరేషన్ (హిస్టరెక్టమీ) జరగడం... వంటి అంశాలు ప్రొలాప్స్కు కారణమవుతాయి. నివారణపెల్విక్ ప్రొలాప్స్ నివారణ చాలా పరిమితమైన మేరకే సాధ్యమవుతుంది. పెల్విక్ ఫ్లోర్ కండరాన్ని బలోపేతం చేసే ‘కెగెల్స్ ఎక్సర్సైజెస్’ అని పిలిచే పొత్తికడుపు వ్యాయామాలను చేయడం ద్వారా కొంతవరకు ఈ పరిస్థితిని నివారించవచ్చు. మలబద్ధకాన్ని నివారించేందుకు ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం, మంచి విసర్జక అలవాట్లు (గుడ్ టాయిలెట్ హ్యాబిట్స్... అంటే రోజూ ఒకేవేళకు మలవిసర్జనకు వెళ్లడం), స్థూలకాయాన్ని నివారించుకోవడం అంటే బరువు పెరగకుండా జాగ్రత్తపడటం, బరువైన వస్తువుల్ని అకస్మాత్తుగా ఎత్తకుండా జాగ్రత్తగా ఉండటం వంటి వాటితో పెల్విక్ ప్రొలాప్స్ను కొంతమేర నివారించవచ్చు. జారడం ( ప్రొలాప్స్) అంటే ఏమిటి, ఎందుకలా జరుగుతుందంటే...? మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కండరం బలహీనపడుతుంది. ఆ క్రమంలో ఒక్కోసారి పొత్తికడుపులో ఉండే అంతర్గత అవయవాలు ‘బలహీనపడ్డ’ ఆ పెల్విక్‌ఫ్లోర్ నుంచి జారి... యోనిలోకి గానీ లేదా యోని పైభాగంలోకి వచ్చేస్తాయి. ఇలా జారి కిందకు రావడాన్నే ‘్రపొలాప్స్’అంటారు. ఏ అవయవం జారిందో దాన్ని బట్టి ఆ జారిన ప్రక్రియకు ( ప్రొలాప్స్కు) ఆ పేరు పెడతారు. ఉదాహరణకు గర్భసంచి జారితే దాన్ని ‘యుటిరైన్ ప్రొలాప్స్’ అనీ, పెద్దపేగు జారితే ‘బవెల్ ప్రొలాప్స్’ అనీ, మూత్రపు సంచి జారితే ‘బ్లాడర్ ప్రొలాప్స్’ అని చెబుతుంటారు. సాధారణంగా వీటన్నింటినీ కలిపి ‘పెల్విక్ ఆర్గాన్స్’గా పేర్కొంటారు కాబట్టి అవి జారినప్పుడు... అలా జరడాన్ని ‘పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్’ అనే ఒక్క మాటతో సూచిస్తుంటారు. నిజానికి ఇవేవీ ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టే సమస్యలు కాదు. అయితే ఇలా జారడం వల్ల ఒక్కోసారి తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. కొన్నిసార్లు తీవ్రంగా నొప్పి కూడా వస్తుంటుంది.చికిత్సకొన్ని జీవనశైలి మార్పులు అనుసరిస్తూ కొంతమందిలో హార్మోన్ చికిత్స ఇవ్వడం ద్వారా ఈ కండిషన్‌ను డాక్టర్లు చక్కదిద్దడం జరిగినప్పటికీ... ఇలాంటి చర్యలతో అంతగా ఫలితం లేనప్పుడు జారిన అవయవాన్ని / అవయవాలను తిరిగి వాటి వాటి స్థానాల్లో అమర్చేలా శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. చాలా సందర్భాల్లో శస్త్రచికిత్సతో ఆయా అవయవాలను వాటి స్థానాల్లో తిరిగి అమర్చడం మాత్రమే ప్రొలాప్స్కు శాశ్వత చికిత్సగా చెప్పవచ్చు.డా‘‘ సరోజ బానోతు, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ -
మర్యాదగా ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం..!
విశాఖపట్టణం: ‘మీరు స్వామివారి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం’ అంటూ అర్చకులు గద్దిస్తుంటే, భక్తులు బిత్తరపోయారు. నిష్కల్మషమైన భక్తితో కొండెక్కిన తమను ‘దొంగలు’ అనడమేమిటి? పైగా చేతులకు తాళ్లు కట్టి బంధించడమేమిటి? అని ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. కానీ, అదంతా ’దొంగ–పోలీస్’ ఆటలా సాగే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టమని తెలిసి చివరకు ఆనంద డోలికల్లో మునిగిపోయారు. View this post on Instagram A post shared by Shyam Cherry (@simhachalamupdates)అసలేం జరిగింది? సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ‘వినోదోత్సవం’ కనువిందుగా జరిగింది. గురువారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో (వేట ఉత్సవం) స్వామివారి ఉంగరం పోయిందని, అది భక్తులే తీశారని అర్చకులు సరదాగా నిలదీసే ఘట్టమే ఈ ఉత్సవ విశేషం. బంధీలుగా వీఐపీలు.. సామాన్యులు రాజగోపురం వద్ద స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి ఏడు పరదాల చాటున వేంజేసి ఉండగా.. ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు స్వామివారి దూతగా మారి.. చేతిలో కర్ర, తాడు పట్టుకుని భక్తులను బంధించి తీసుకువచ్చారు. గాజువాకకు చెందిన వ్యాపారవేత్త సాగర్, ఇంజనీరింగ్ విద్యార్ధి ప్రణతి, విశాఖకు చెందిన ఫిజియోథెరపిస్టు రేషి్మ, విజయనగరానికి చెందిన ఆమె సోదరి భార్గవి, ఒడిశాలోని జాజ్పూర్కి చెందిన ప్రభుత్వ వైద్య విద్యార్థులు, శ్రీహరిపురానికి చెందిన భరత్, హేమ, తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కుమారుడు సిద్ధార్థ, కోడలు నిత్య, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జర్నలిస్టుల సంఘం జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, పలువురు నూతన దంపతులతోపాటు దేవస్థానం ఈవో జె.వెంకటరావు దంపతులను కూడా వదలకుండా తాళ్లతో బంధించి స్థానాచార్యుల ముందు ప్రవేశపెట్టారు. సీసీ కెమెరా సాక్ష్యం ఉంది.. ఇచ్చేయండి స్థానాచార్యులు రాజగోపాల్ భక్తులను ప్రశ్నించిన తీరు అత్యంత సహజంగా సాగింది. ‘మీరు దొంగతనం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉన్నాయి’ అని ఆయన గర్జించడంతో భక్తులు హడలిపోయారు. భక్తుల చేతికి ఉన్న ఉంగరాలు చూపిస్తూ.. ‘ఇదే స్వామివారి ఉంగరం’ అని అర్చకులు నిలదీయడంతో చాలామంది భక్తులు ఆవేశంతో, మరికొందరు బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ట్విస్ట్ ఏమిటంటే: అందరినీ బంధించిన ప్రధానార్చకుడిని, అందరినీ ప్రశ్నించిన స్థానాచార్యుడిని, ఏఈవోలను కూడా చివర్లో తాళ్లతో బంధించడం ఈ ఉత్సవంలో హైలైట్‌గా నిలిచింది. పరదా వెనుక దొరికిన ‘నిజమైన’ దొంగ భక్తుల విచారణ ముగిసిన తర్వాత, స్వామివారి పల్లకీకి ఉన్న ఏడు పరదాలను ఒక్కొక్కటిగా తొలగించారు. ఆశ్చర్యంగా ఆఖరి పరదా చాటునే స్వామివారి ఉంగరం లభ్యమైంది. అంటే దొంగ మరెవరో కాదు.. ఆ స్వామివారే అని తేలడంతో భక్తులంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. తమను దొంగలుగా పట్టుకోవడం కూడా ఆ నృసింహుడి లీలగా భావించి భక్తులు పులకించిపోయారు. -
సమ్మక్క పూజారి కుమారుడి కాలు తొలగింపు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన రాణా రమేశ్ కుమారుడు ఏడేళ్ల యువిన్ రెండు కాళ్లపై ఇటీవల గద్దెల ప్రాంగణంలో రాతిశిల పడటంతో తీవ్ర గాయాలుకాగా, శుక్రవారం వైద్యులు ఎడమకాలిని తొలగించారు. వారం రోజులక్రితం యువిన్ గద్దెల ప్రాంగణం వద్దకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లగా సారలమ్మ గద్దె వద్ద ఓ రాతిశిల బాలుడి కాళ్లపై పడింది. దీంతో రెండు కాళ్లు విరిగిపోగా, వెంటనే కుటుంబ సభ్యులు హనుమకొండలోని గార్డియన్ హాస్పిటల్‌కి తరలించారు. ఎడమ కాలికి శస్త్రచికిత్స నిర్వహించినప్పటికి బాగుకాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో వైద్యులు కాలుని తొలగించారు. కుడి కాలికి సర్జరీ చేసి రాడ్డు వేశారు. ఇటీవల సీతక్క బాలుడిని పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మేడారం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో బాలుడికి సంబంధించి వైద్య ఖర్చులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
