102 Not Out
-
చహర్ స్పిన్ కు తల్లఢిల్లీంది
న్యూఢిల్లీ: రాహుల్ చహర్ మాయాజాలానికి ఢిల్లీ క్యాపిటల్స్ చిక్కింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 40 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా (26 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు), డి కాక్ (27 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడగా, రబడ 2 వికెట్లు తీశాడు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులే చేసి ఓడింది. శిఖర్ ధావన్ (22 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే మెరుగ్గా ఆడాడు. రాహుల్ చహర్ (3/19) స్పిన్‌తో అలరించాడు. హార్దిక్ పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఓపెనర్ల శుభారంభం... టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 57 పరుగులు చేసింది. కానీ ఆరంభం చాలా స్లోగా నడిచింది. 3 ఓవర్లు ముగిసినా 16 పరుగులే చేయగలిగింది. మోరిస్ వేసిన నాలుగో ఓవర్‌తో ముంబై పుంజుకుంది. రోహిత్ శర్మ ఫోర్ కొట్టగా, డి కాక్ 4, 6 బాదాడు. ఆ ఓవర్లో 16 పరుగులొచ్చాయి. కీమో పాల్ ఆరో ఓవర్లో ఓపెనర్లు చెరో సిక్సర్ బాదడంతో జట్టు స్కోరు 50 దాటింది. పుంజుకుంటున్న దశలో అమిత్ మిశ్రా... రోహిత్ (22 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్)ను ఔట్ చేశాడు. మరుసటి ఓవర్లో కటింగ్ (2)ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చడంతో ముంబై ఇన్నింగ్స్ గాడితప్పింది. వికెట్లున్నా స్కోరు పరుగెత్తదేమీ! డి కాక్కు సూర్యకుమార్ జతయ్యాడు. కానీ మెరుపుల జోరే లేని ఇన్నింగ్స్‌ను డి కాక్ రనౌట్ మరింత ఇబ్బంది పెట్టింది. 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 75/3. అంటే పవర్ ప్లే తర్వాత 4 ఓవర్లలో 18 పరుగులే చేయగలిగింది. తర్వాత వికెట్ పతనం లేకపోయినా స్కోరు మాత్రం పెరగలేదు. మరో 4 ఓవర్లు ఆడితేగానీ 100 పరుగులు చేయలేకపోయింది. 16వ ఓవర్లో సూర్యకుమార్ (27 బంతుల్లో 26; 2 ఫోర్లు) నిష్క్రమించడంతో హార్దిక్, కృనాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. పాండ్యా బ్రదర్స్ ఆఖరి మెరుపులు... పాండ్యా బ్రదర్స్ ఉన్నప్పటికీ 16, 17 ఓవర్లలోనూ పెద్దగా పరుగులేమీ రాలేదు. కీమో పాల్ వేసిన 18 ఓవర్లో వేగం పుంజుకుంది. కృనాల్ ఒక ఫోర్ కొడితే... హార్దిక్ వరుసగా 4, 6 బాదాడు. ఇద్దరు కలిసి 17 పరుగులు పిండుకున్నారు. తర్వాత మోరిస్ బౌలింగ్‌లోనూ హార్దిక్ 6, 4 కొట్టాడు. రబడ వేసిన ఆఖరి ఓవర్లో హార్దిక్ 6 కొట్టి ఔట్కాగా... కృనాల్ 2 బౌండరీలతో పోరాడే స్కోరు అందించాడు. వేగంగా మొదలై అంతలోనే పతనమై... లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా (24 బంతుల్లో 20; 2 ఫోర్లు) మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్లో పృథ్వీ షా, రెండో ఓవర్లో ధావన్ రెండేసి ఫోర్లతో వేగం పెంచారు. మలింగ మూడో ఓవర్లోనూ శిఖర్ 2 బౌండరీలు బాదాడు. జయంత్ యాదవ్ తర్వాతి ఓవర్లో శిఖర్ భారీ సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు. 6 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 48/0. అదేంటో... చిత్రంగా పవర్ ప్లేతో పాటే చక్కని ఆరంభం ముగిసింది. వేగంగా పతనం మొదలైంది. తన వరుస ఓవర్లలో రాహుల్ చహర్ మొదట ధావన్‌ను, తర్వాత పృథ్వీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (3)లను ఔట్ చేశాడు. ఈ మధ్యలోనే కృనాల్ బౌలింగ్‌లో మున్రో (3) నిష్క్రమించాడు. 48/0తో ఉన్న స్కోరు కాస్తా 11 ఓవర్లలో 65/4గా మారింది. హిట్టర్ రిషభ్ పంత్ (7)ను బుమ్రా పెవిలియన్ చేర్చడంతో ఢిల్లీ లక్ష్యఛేదనకు దూరమైంది. ఓపెనర్ల తర్వాత ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ (11; 1 సిక్స్), అక్షర్ పటేల్ (23 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 3 బంతుల వ్యవధిలోనే వీళ్లిద్దరితో పాటే కీమో పాల్ (0) కూడా ఔట్ కావడంతో వరుసగా మూడు విజయాల తర్వాత ఢిల్లీకి మరో పరాజయం ఎదురైంది. -
‘102 నాట్ అవుట్’ మూవీ రివ్యూ
శ్వాస ఆగినప్పుడు మాత్రమే మరణించాలి. జీవితాన్ని ఆస్వాదించిన తీరు చావునూ సెలబ్రేట్ చేస్తుంది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్..ప్రేమ, ఆప్యాయతలు భిక్ష కాకూడదు.. మనల్ని మనం ప్రేమించుకోవాలి.. 102 నాట్ అవుట్ సినిమా చూపించిన ఫిలాసఫీ. 102 .. ఇన్నింగ్లోకి దత్తాత్రేయ వఖారియా (అమితాబ్ బచ్చన్) 102 ఏళ్ల యువకుడు. నిత్యం ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతుంటాడు. 102 ఏళ్లకు మించి బతికి రికార్డ్ సృష్టించాలనుకుంటాడు. దత్తాత్రేయకు పూర్తి విరుద్ధం అతని కొడుకు బాబూలాల్ (రిషీ కపూర్). అతనికి 75 ఏళ్లు. ఎలాంటి సంతోషం.. ఉత్సాహమూ లేకుండా నిర్లిప్తంగా జీవితాన్ని వెళ్లదీస్తుంటాడు. పైగా తండ్రి అలా చిన్నపిల్లాడిలా ఉండడం బాబూలాల్‌కు చిరాగ్గా ఉంటుంటుంది. కొడుకు తీరుతో తనకూ నిరుత్సాహం కలుగుతోందని బాబూలాల్‌ను వృద్ధాశ్రామంలో చేర్పించాలనుకుంటాడు దత్తాత్రేయ. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. కొడుకును తండ్రి వృద్ధాశ్రమంలో చేర్పంచడమేంటని షాక్ అవుతాడు బాబూలాల్. అలవాటైన దుప్పటి, అలవాటైన బాత్రూమ్.. ఇలా కొన్ని అలవాట్లు ఒక్క రోజు తారుమారవుతేనే ఆపసోపాలు పడే బాబూలాల్ శేష జీవితమంతా వృద్ధాశ్రమంలో గడపాలనే ఊహకే వణికిపోతాడు. తనను ఆశ్రమానికి పంపే ఆలోచనను మానుకొమ్మని తండ్రిని బతిమాలుకుంటాడు. అయితే తాను పెట్టే అయిదు షరతులను ఒప్పుకోమంటాడు దత్తాత్రేయ. ఒప్పుకుంటాడు. ఆ అయిదు షరతులు కూడా జీవితం మీద ఆసక్తి కోల్పోయిన కొడుకును తిరిగి జీవితం పట్ల ఆకర్షితుడిని చేయడానికేనన్నమాట. నాలుగో షరతు పూర్తయ్యే సరికి ఆ విషయం బాబూలాల్కూ అర్థమవుతుంది. అయిదో షరతు.. అమెరికాలో ఉంటున్న బాబూలాల్ కొడుకు అమోల్‌ను ఇంటికి రానివ్వద్దని చెప్పడం. అక్కడ బాబూలాల్ తండ్రిని విభేదిస్తాడు. ‘‘నీ కొడుకు కేవలం ఆస్తి కోసమే నీ దగ్గరకు వస్తున్నాడు తప్ప ప్రేమతో కాదు’’ అని వాదిస్తాడు దత్తాత్రేయ. ‘‘నేను నీలాగ కాదు.. నా ప్రేమకు షరతుల్లేవ్. నా కొడుకును రానివ్వకుండా చేయలేను’’ అని స్పష్టం చేస్తాడు బాబూలాల్. ‘‘సరే.. నా కొడుకు మీద నీ కొడుకు గెలవకుండా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు’’ అనుకుంటాడు దత్తాత్రేయ. అసలు ఈ స్పర్థ ఎందుకు వస్తుందీ తండ్రీకొడుకుల మధ్య? బాబూలాల్ జీవితం పట్ల ఎందుకంత నిరాసక్తంగా ఉంటాడు? ఈ రెండిటికీ సమాధానం.. బాబూలాల్ కొడుకు అమోల్æ. ఆ నేపథ్యం.. అమోల్.. బాబూలాల్, చంద్రికల ఏకైక సంతానం. అల్లారుముద్దుగా పెంచుకుంటారు. వాడు ఎంబీఏ చదవడానికి అమెరికా వెళ్లిపోయి అక్కడే ఉద్యోగం వెదుక్కొని, అమ్మాయినీ చూసుకొని, పెళ్లీ చేసుకొని సెటిల్ అయిపోతాడు. చదువుకునేటప్పుడు డబ్బు అవసరం ఉన్నప్పుడు తప్ప మిగిలిన ఏ విషయానికీ బాబూలాల్‌కు ఫోన్ చేయడు.. ఇంకే వివరమూ చెప్పడు. చివరకు తల్లి (బాబూలాల్ భార్య) అలై్జమర్స్‌తో బాధపడుతూ అన్నీ మరిచిపోయి కేవలం కొడుకు పేరును మాత్రమే వల్లిస్తూ.. వాడికోసం తపిస్తూ మరణశయ్య మీదున్నా.. చూడడానికి రాడు. లీవ్ దొరకలేదని తప్పించుకుంటాడు. చనిపోయినా రాడు. కారణం లీవ్ లేదని. అస్తికలు కలపడానికీ రాడు.. కారణం లీవ్ ఇవ్వలేదని. అలా కాలం గడిచిపోతుంది. కొడుకు కోసం.. వాడి ప్రేమ కోసం.. వాడి చల్లని మాట కోసం తపిస్తూ ఉంటాడు బాబూలాల్. చివరకు తనే కొడుకు దగ్గరకు వెళ్దామని ‘‘నేను రానా నాన్నా’’ అని నోరువిడిచి అడిగినా.. ‘‘మేమిద్దరం బిజీ.. నువ్వు ఒక్కడివే బోర్ అయిపోతావ్. మళ్లీ ఎప్పుడైనా .. హోప్ యూ అండర్‌స్టాండ్’’ అని ఫోన్ పెట్టేస్తాడు కొడుకు. మనవడు, మనవరాలు పుట్టినా వాళ్ల ఫోటోలు కూడా పంపడు. ఎప్పుడో ఆర్నెల్లకో.. యేడాదికో ఒకసారి ఫోన్ చేసి రెండు నిమిషాలు పొడిపొడిగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. తన ప్రతి నిస్సహాయతకు ‘‘హోప్ యు అండర్‌స్టాండ్’’ అంటుంటాడు. కొడుకుతో గడపాలని.. వాడి పిల్లలతో ఆడాలని ఆరాటపడి.. బెంగతో కుంగిపోతుంటాడు బాబూలాల్. తన కళ్లముందే కొడుకు అలా కృషించిపోతుంటే దత్తాత్రేయ తండ్రి గుండె విలవిల్లాడుతుంది. ఈలోపే తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు తేలుతుంది. తను పోతే ఇక కొడుకును పట్టించుకునే దిక్కుండదు. తనున్నప్పుడే కొడుకుకు బతుకు పట్ల ఆశ పెంచాలని.. వృద్ధాశ్రమం నెపంతో అయిదు షరతులను పెట్టి అతనిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాడు. కాని అయిదో షరతు దగ్గర అలా తేడా వస్తుంది. మనవడి అసలు రూపాన్నీ కొడుకుకు చూపించాలని .. ఎప్పుడూ బిజీ అని చెప్పే మనవడికి ఫోన్ చేసి త్వరగా రావాలని.. ఆస్తి గురించి మాట్లాడాలని చెప్తాడు. వెంటనే వచ్చేస్తానని మనవడు అంటాడు. అలా ఆస్తి గురించే మనవడు వస్తున్నాడు తప్ప తండ్రి, తాత మీద ప్రేమతో కాదని కొడుకు దగ్గర ప్రూవ్ చేస్తాడు దత్తాత్రేయ. ఈ క్రమంలోనే తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉందన్న విషయాన్నీ కొడుకుకు చెప్తాడు. అప్పుడు బాబూలాల్ తండ్రిని పూర్తిగా అర్థం చేసుకుంటాడు. తండ్రి జీవనశైలిని వారసత్వంగా.. అమెరికా నుంచి వచ్చిన కొడుకును ఇంటికి రానివ్వకుండా ఎయిర్పోర్ట్నుంచే వెనక్కి పంపేయడమే కాదు.. ఇంకెప్పటికీ రావద్దని కరాఖండిగా చెప్పేస్తాడు బాబూలాల్. దత్తాత్రేయ ఆఖరి క్షణాలనూ అంతే ఆనందంగా గడిపేట్టు చూసుకుంటాడు. ‘‘నేను 102 దాటలేకపోయా.. కానీ నువ్వు ఆ రికార్డ్బద్దలు చేయాలని’’ కొడుకు చెప్తాడు. శ్వాస వదులుతాడు. తండ్రి జీవన శైలిని వారసత్వంగా తీసుకుంటాడు బాబూలాల్. దత్తాత్రేయ ఎంత ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాడో.. తనూ అలాగే ఆస్వాదిస్తుంటాడు... తనని తాను ప్రేమించుకుంటూ.. చుట్టూ ఉన్నవాళ్లకు ప్రేమను పంచుతూ! బంధాలు అంచిందే అనుబంధాలు చిక్కగా ఉంటే సంతోషమే. కాలం వాటిని పలుచగా అయ్యేట్టు చేసినా డీలా పడాల్సిన పనిలేదు. మనకు మనం ఎప్పుడూ మిగలాలి.. మనల్ని మనం ఎప్పుడూ ప్రేమించుకోవాలి! జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి... మరణం వరకూ బతకాలి.. బతుకులో మరణాన్ని వెదుక్కోకూడదు.. కష్టసుఖాల్నీ ఇష్టపడుతూ ప్రయాణం సాగించాలి ఉల్లాసంగా... అదే జీవనపరమార్థం.. 102 నాట్ అవుట్.. హోప్ యు అండర్‌స్టాండ్!! – శరాది -
103 ఏళ్ల బామ్మ వీడియో పోస్ట్ చేసిన అమితాబ్
-
103 ఏళ్ల బామ్మ వీడియో వైరల్
సాక్షి, ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘102 నాటౌట్’.. గుజరాతీ నాటకం ఆధారంగా ఉమేశ్ శుక్లా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బిగ్‌బీ అమితాబ్ 102 ఏళ్ల వృద్ధుడి పాత్ర పోషిస్తున్నారు. ఆయన కుమారుడిగా 70 ఏళ్ల వ్యక్తిగా మరో సీనియర్ నటుడు రిషీ కపూర్ నటించారు. మే 4న ఈ మూవీ విడుదల చేసేందుకు యూనిట్ సిద్దంగా ఉంది. అయితే మూవీపై స్పందిస్తూ 103 ఏళ్ల బామ్మ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. రెండున్నర దశాబ్దాల తర్వాత అమితాబ్, రిషీ కపూర్ కలిసి నటిస్తున్న చిత్రమిది. T 2791 - A heartwarming greeting from this lovely lady .. may God bless her !! Thank you ..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👣👣👣👣👣👣https://t.co/T7TCtc6GwS — Amitabh Bachchan (@SrBachchan) 30 April 2018 బామ్మ చేసిన పోస్టును అమితాబ్ తన ఫేస్బుక్, ట్విటర్లో పోస్ట్ చేస్తూ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. 'ఆల్ ది బెస్ట్ అమితాబ్.. నువ్వు 102 నాటౌట్ అయితే నేను 103 నాటౌట్ అంటూ' బామ్మ పోస్ట్ చేసిన వీడియోను అమితాబ్ తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. 103 ఏళ్ల వయసులో బామ్మ అంత యాక్టీవ్ ఉంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'ఈ లవ్లీ లేడీ మాకు విషెస్ తెలిపారు. ఆమెను దేవుడు చల్లగా చూడాలంటూ' అమితాబ్ పోస్టు చేయగా వీడియో వైరల్ అవుతోంది. మూవీకి భలేగా ప్రమోషన్ లభించిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.