17 పంటలకు పెట్టుబడి రాయితీ
– వేరుశనగ పంట నష్టానికి రూ.903.37 కోట్లు
– మిగతా 16 రకాల పంటకు రూ.129.05 కోట్లు
అనంతపురం అగ్రికల్చర్ : పెట్టుబడి రాయితీలో అధికశాతం వేరుశనగ రైతులకే కేటాయించారు. ఖరీఫ్–2016లో దెబ్బతిన్న పంటలకు పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ) కింద రూ.1,032.42 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెల్సిందే. అందులో అత్యధికంగా వేరుశనగ పంట నష్టానికి రూ.903.37 కోట్లు కేటాయించారు. మిగతా 16 రకాల పంటలకు రూ.129.05 కోట్లు ఇవ్వనున్నారు. స్కేల్ ఆఫ్ రిలీఫ్ (పంట నష్ట ఉపశమనం) ప్రకారం పంటల వారీగా పరిహారం వర్తింపజేశారు. వేరుశనగకు హెక్టారుకు రూ.15 వేలు, పత్తికి రూ.15 వేలు, కంది, పొద్దుతిరుగుడు, పెసలు, అలసంద, ఉలవకు రూ.10 వేలు, మొక్కజొన్నకు రూ.12 వేలు, ఆముదానికి రూ.8 వేలు, జొన్న, సజ్జకు రూ.6 వేల ప్రకారం పరిహారం వర్తింపజేశారు.
పంట సాగు విస్తీర్ణాన్ని బట్టి రైతులకు పరిహారం ఇచ్చినట్లు చెబుతున్నా... చాలా మండలాల్లో అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తలొగ్గారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 5 ఎకరాలకు రూ.30 వేలు పరిహారం ఇవ్వాల్సి ఉండగా చాలా చోట్ల బాగా కుదించినట్లు రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక పంటల వారీగా ఇన్పుట్ లెక్కలు అధికారులు తయారు చేశారు. మొత్తమ్మీద చూస్తే 7,17,235 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతినగా 6,25,050 మందికి రూ.1,032.42 కోట్ల పరిహారాన్ని మంజూరు చేశారు. ఇందులో వేరుశనగ పంట 6.02 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్నట్లు పరిగణించిన అధికారులు 5,00,854 మంది రైతులకు రూ.903.37 కోట్ల పరిహారాన్ని లెక్క వేశారు. మిగతా 16 రకాల పంటలు 1,14,983 హెక్టార్లలో దెబ్బతినగా 1,24,196 మంది రైతులకు రూ.129.05 కోట్లు వర్తింపజేస్తూ జాబితాలు సిద్ధం చేశారు.
గత ఖరీఫ్‌లో చేపట్టిన ఈ–క్రాప్ బుకింగ్ ఆధారంగా పంటల వారీగా నష్టం అంచనా వేసినట్లు చెబుతున్నారు. క్రాప్ బుకింగ్ చేయని ప్రాంతాల్లో రైతుల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని క్షేత్రస్థాయిలో ధ్రువీకరించిన తర్వాత జాబితాలో చేర్చినట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రెండు, మూడు మండలాల్లో పొలాలు ఉండి పంటలు వేసి నష్టపోయినా పరిహారం మాత్రం ఒక మండలంలో గరిష్టంగా రెండు హెక్టార్లకు వచ్చేలా ఆధార్‌నంబర్‌ను అనుసం«ధానం చేస్తున్నారు. ఈనెల 24న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో విడతల వారీగా కాకుండా ఇన్పుట్ సబ్సిడీ పరిహారం మొత్తం ఒకేసారి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే జాబితాలు మాత్రం విడతల వారీగా ట్రెజరీకి సమర్పించి పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని సమాచారం. ఆధార్, 1–బీ, రైతు పేరు, బ్యాంకు అకౌంట్ నంబర్ నమోదులో పొరపాట్లకు అవకాశం ఉండటంతో ఈ సారి కూడా మిస్‌మ్యాచింగ్ సమస్య వేధించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే రైతులు ఒకటికి పది సార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.
పంటల వారీగా ఇన్పుట్ నష్టం వివరాలిలా...
పంట దెబ్బతిన్నవిస్తీర్ణం (హెక్టార్లలో) మంజూరైన పరిహారం రైతుల సంఖ్య
వేరుశనగ 6,02,252 903,37,80,750 5,00,854
కంది 59,238 59,23,83,600 64,728
మొక్కజొన్న 9,195 11,49,39,750 15,351
ప్రత్తి 31,109 46,66,35,000 29,510
ఆముదం 5,968 4,05,84,984 5,032
పొద్దుతిరుగుడు 1,937 1,93,77,700 1,909
జొన్న 3,562 2,42,22,416 3,622
సోయాబీన్ 626 62,60,000 546
ఉలవ 806 80,60,500 772
మినుము 899 89,98,500 840
కొర్ర 1,327 66,85,650 1,553
సజ్జ 152 10,31,492 150
ఉలవ 86 8,61,400 96
రాగి 25 1,67,484 49
సీసం (నువ్వులు) 32 2,20,116 27
మెస్తా (గోంగూర) 03 13,400 04
అలసంద 05 57,900 07