రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
పాలమూరు : ఎంతో మంది త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కరువు మండలాల్లో రైతులకు ఎలాంటి సాయం అందటం లేదన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నాయని విమర్శించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు రూ.1,400కోట్లకుగాను సగమైనా రుణాలు ఇవ్వలేకపోయాయన్నారు.
రుణమాఫీ కింద విచ్చిన డబ్బులను బ్యాంకర్లు మిత్తికి జమ చేసుకుంటున్నారన్నారు. రెండున్నరేళ్లలో 2,560 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కేఎల్‌ఐకి కేవలం రూ.243కోట్లు మాత్రమే ఖర్చు చేసి రూ.మూడు వేల కోట్లని టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రూ.1,700కోట్లతో ఈ ప్రాజెక్టును టీడీపీ హయాంలోనే మంజూరు చేశామన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 19, 20వ తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో ‘రైతు నిరసన దీక్ష’ చేపట్టనున్నామన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై దాటవేసే ధోరణిలో వ్యవహరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సిములు, ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎం.చంద్రశేఖర్, సీతాదయాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఇన్చార్జి ఎన్.పి.వెంకటేష్, ప్రచార కార్యదర్శి మాల్యాద్రిరెడ్డి, నాయకులు బాలయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.