రేషన్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు
ఆచంట : ఆచంట నియోజకవర్గంలోని ఆచంట, పెనుమంట్ర మండలాల్లో గురువారం పలు రేషన్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆచంటలో 6,8 నంబర్ల దుకాణాల్లో అక్రమ నిల్వలు గుర్తించారు. ఇక్కడ 890 లీటర్ల అదనపు కిరోసిన్ ఉన్నట్టు గుర్తించారు. రేషన్ డీలరు అందుబాటులో లేకపోవడంతో బియ్యం నిల్వ చేసిన గదిని సీజ్ చేశారు. ముందుగా పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామంలో 22, 24, 25 రేషన్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి నిల్వల్లో తేడాలు ఉన్నట్టు గుర్తించారు. వీటిపై 6 ఏ కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ తహసిల్దార్ వి.శైలజ, ఎస్సై వి.సీతారామరాజు, ఏవో ఎం.శ్రీనివాస్ కుమార్, ఏజీ జె.జయప్రసాద్ పాల్గొన్నారు. విజిలెన్స్ ఎస్పీ వి.సురేష్‌బాబు ఆదేశాల మేరకు దాడులు నిర్వహించామని చెప్పారు.