ఫెడ్ దెబ్బ ..రుపీ ఢమాల్!
ముంబై: ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలతో దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి కుదేలైంది. డాలరుతో పోలిస్తే వరుసగా రెండో రోజూ బలహీనపడింది. బుధవారం నాటి నష్టాలను కొనసాగిస్తూ ఈ ఉదయం 17 పైసలకు పైగా కోల్పోయి రూ.68.25 ని తాకింది. ప్రస్తుతం స్వల్పంగా కోలుకుని 12 పైసల నష్టంతో 68.20 వద్ద ట్రేడవుతోంది. బుధవారం నాటి ముగింపు 13 పైసలు నష్టంతో 68.08గా నమోదైంది.
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్శన్ జానెట్ యెలెన్ వడ్డీ రేట్ల పెంపునకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయన్న వ్యాఖ్యలతో డాలరుకు ఉత్సాహమొచ్చింది. దీంతో ఇటీవల స్వల్పంగా బలహీన పడ్డ డాలర్ మళ్లీ పుంజుకుంది. యెన్, యూరో వంటి కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ తాజాగా 101ను అధిగమించింది. దిగుమతిదారులనుంచి డాలర్ డిమాండ్ పుంజుకోవడం రూపాయి విలువను ప్రభావితం చేసిందని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు దేశీ ఈక్విటీ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ఫ్లాట్ ఆరంభమైనా, లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. అటు ఎంసీఎక్స్ మార్కెట్ లో పత్తడి ధరలు కూడా వెలవెలబోతున్నాయి. పది గ్రా. రూ.188 నష్టపోయి రూ. 28,603 వద్ద ఉంది.