Falaknuma Das
-
మరో రీమేక్‌లో ‘ఫలక్‌నుమా దాస్’
మలయాళ సినిమా అంగమలై డైరీస్‌ను తెలుగులో ‘ఫలక్‌నుమా దాస్’గా తెరకెక్కించిన విశ్వక్ సేన్.. హీరోగా, దర్శకుడిగా మంచి విజయం సాధించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో మరో క్రేజీ రీమేక్‌కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన రొమాంటిక్ కామెడీ ‘సోనుకి టిటుకి స్వీటి’ తెలుగు రీమేక్ కోసం విశ్వక్‌ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. కార్తీక్ ఆర్యన్, సన్ని సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు లవ్ రంజన్ దర్శకుడు. ఈ బాలీవుడ్ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ, విశ్వక్ సేన్ హీరోగా తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
‘పాగల్’గా ‘ఫలక్‌నుమా దాస్’
టాటా బిర్లా మధ్యలో లైలా, మేం వయసుకు వచ్చాం, సినిమా చూపిస్తా మామా లాంటి సినిమాలు అందించిన లక్కీ మీడియా బ్యానర్, రీసెంట్ గా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ హుషారు తో మరో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ ఇప్పుడు మరో క్రేజీ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇటీవల ఫలక్నమా దాస్‌తో సక్సెస్‌ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్ తో కలిసి ‘పాగల్’ అనే కొత్త చిత్రం నిర్మించనున్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్. ఈ మూవీతో నరేష్ రెడ్డి కుప్పిలి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. క్రేజీ లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి మొదలుకానుంది. ఈ సందర్బంగా నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ.. ‘ఫలక్ నమా దాస్ లాంటి సూపర్ హిట్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన హీరో విశ్వక్ సేన్‌తో మా లక్కీ మీడియా బ్యానర్ నెక్ట్ ప్రాజెక్ట్ చేయడం హ్యాపీగా ఉంది. మా గత చిత్రం హుషారు సక్సెస్ మాకు మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి, కొత్త వాళ్ళను ఇంట్రడ్యూస్ చేయడానికి మంచి ఉత్సాహన్నిచ్చింది. ఈ మూవీ తో మా బ్యానర్ ద్వారా నరేష్ రెడ్డి కుప్పిలి అనే మరో యంగ్ డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. తను చెప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్‌కు అందరం బాగా కనెక్ట్ అయ్యాం.ఈ పాగల్ మూవీ బెస్ట్ లవ్ స్టొరీ అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. మిగతా వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’ అన్నారు. దర్శకుడు నరేష్ రెడ్డి కుప్పిలి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ -
‘త్వరలో సీక్వెల్‌తో షాక్ ఇస్తాం’
వన్మయి క్రియేషన్స్ పతాకంపై కరాటే రాజు సమర్పణలో విశ్వక్ సేన్ సినిమాస్ మరియు టెర్రమర పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. మాస్ కా దాస్ టాగ్ లైన్‌తో విశ్వక్ సేన్ నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ... ‘హైదరాబాద్ లోని 118 లొకేషన్స్‌లో తీసిన ఈ సినిమా అందరి మన్ననలు పొందుతూ సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతోంది. దాదాపు రెండు సంవత్సరాలుగా స్క్రిప్ట్ వర్క్ చేసి ఎంతో కష్టపడి విశ్వక్ ఈ ప్రాజెక్ట్‌ను చేసాడు. ఆ కష్టం ఇప్పుడు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చింది. 7 రోజుల్లో 7కోట్ల 50 లక్షలు వసూలు చేసింది అని చెప్పడానికి సంతోష పడుతున్నా. ఇంత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఈ చిత్రంలో సెకండ్ ఆఫ్ ల్యాగ్ ఎక్కువైందని అంటున్నారు. అందుకే కొత్తగా ఎడిటింగ్ చేసాము. ఆ ల్యాగ్‌ను తీసేసి సరికొత్తగా ప్రెసెంట్ చేస్తున్నాము. రేపటి నుంచి ఇది అమలు అవుతుంది. 50 థియేటర్స్‌తో పాటు మల్టిప్లెక్స్‌లు కూడా పెరుగుతున్నాయి. ఇక మా నెక్స్ట్ చిత్రం ఫలక్‌నుమా దాస్ 2 భారీ క్యాస్టింగ్ తో మరోసారి మీ ముందుకు వస్తా’మని తెలిపారు. నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ.. ‘శివ సినిమాలో యాదగిరి, చందమామ సినిమాలో పాత్రల తరువాత అంత మంచి పేరు మళ్లీ ఈ ఫలక్‌నుమా దాస్‌లో చేసిన పాత్రకు వచ్చింది. మలయాళంలో వచ్చిన ‘అంగమాలై’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే.. ఎక్కడా రీమేక్ అనే విషయం గుర్తుకు రాదు. జస్ట్ ఆ చిత్రాన్ని ఇన్సిపిరేషన్గానే తీసుకొని ఎంతో క్లారిటీతో పక్కాగా సినిమాను తెరకెక్కించి నటించాడు విశ్వక్ సేన్. అతను పడిన కష్టం ఫలించి ఇంత పెద్ద రిజల్ట్‌ను ఇచ్చింది. టీమ్ అందరికీ కంగ్రాట్స్’ అన్నారు. హీరో మరియు ఈ చిత్ర దర్శకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ఎన్నో అవాంతరాలు వచ్చాయి. ఎన్నో జరిగాయి కానీ ఎవరూ ఏమీ చేయలేకపోయారు. సినిమా అప్పటి నుంచి ఇప్పటిదాకా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఇకపై కూడా అవుతూనే ఉంటుంది. నా టీమ్ కో ఆపరేషన్, కష్టం లేకపోతే సినిమా సక్సెస్ టాక్ వచ్చేది కాదు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ఈ ఫలక్‌నుమా దాస్‌తో ధమ్కీ ఇచ్చా. నా నెక్స్ట్ సినిమాతో షాక్ ఇస్తా’ అన్నారు. -
‘ఫలక్‌నుమా దాస్’ మూవీ రివ్యూ
టైటిల్ : ఫలక్‌నుమా దాస్ జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : విశ్వక్ సేన్, సలోని మిశ్రా, హర్షిత గౌర్, తరుణ్ భాస్కర్ సంగీతం : వివేక్ సాగర్ దర్శకత్వం : విశ్వక్ సేన్ నిర్మాత : కరాటే రాజు వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ఫలక్‌నుమా దాస్ ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ సూపర్ హిట్ అయిన అంగమలై డైరీస్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ తో భారీ హైప్ ను క్రియేట్ చేసింది. వీటికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్రబృందం చేసిన అతి కూడా తోడైంది. ఏకంగా ఈ చిత్రాన్ని తెలుగులో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన శివ చిత్రంతో పోల్చారు. మరి చిత్ర యూనిట్ హీరో కం దర్శకుడు చేసిన హడావిడి వారు చెప్పినట్టుగా ఈ చిత్రం నిజంగానే మరో శివ అనిపించుకుందా? దర్శకుడిగా మారిన హీరోని విజయం వరించిందా? ఓ సారి చూద్దాం. కథ : ఫలక్‌నుమా లోని దాస్ (విశ్వక్ సేన్) అనే కుర్రాడి చుట్టూ తిరుగుతుంది ఈ కథ. దాస్ చిన్నప్పట్నుంచి ఆ ఏరియా లోని శంకర్ అనే దాదాని చూసి పెరుగుతాడు. పెద్దయ్యాక శంకర్ లా అవ్వాలని కలలు కంటాడు. చిన్నప్పుడే ఓ గ్యాంగ్‌ని కూడా తయారు చేసుకుంటాడు. ఈ చోట గ్యాంగ్ కు శంకరన్న సపోర్ట్ కూడా ఇస్తాడు. స్కూల్ ఏజ్ లోనే శంకర్ గ్యాంగ్ తో తింటూ తిరుగుతూ సరదాగా గడిపేస్తుంటారు. కాలేజీలో అడుగుపెట్టాక ప్రేమ, గొడవలతో దాస్ జీవితం గడుస్తుండగా శంకర్ హత్యకు గురవుతాడు. రవి, రాజు అనే వ్యక్తులు శంకర్‌ను హత్య చేస్తారు. శంకర్ హత్యతో గ్యాంగ్ ఒంటరి అయిపోతుంది. అప్పటి వరకు హాయిగా బతికిన ఈ గ్యాంగ్‌కు కష్టాలు మొదలవుతాయి. వీటి నుంచి బయట పడటానికి ఒక బిజినెస్ చేద్దామని ఫలక్‌నుమా ఏరియాలో మటన్ షాప్ ప్రారంభిస్తారు. అప్పటికే మటన్ బిజినెస్ లో రవి, రాజుదే పైచేయి ఉంటుంది. కానీ దాస్ బిజినెస్ స్టార్ చేశాక వారి బిజినెస్ స్లో అవుతుంది. దాస్ గ్యాంగ్ తమ వ్యాపారానికి అడ్డు వస్తుందని రవి, రాజు గొడవకు దిగుతారు. ఆ గొడవలో దాస్ మటన్ షాప్ పై నాటు బాంబు వేస్తారు. ఇక అప్పటి నుంచి మొదలైన గొడవలు ఓ హత్యకు దారి తీస్తాయి. దాస్ నాటు బాంబు విసరడంతో ఓ వ్యక్తి చనిపోతాడు. ఇక అప్పటినుంచి దాస్ జీవితం మారిపోతుంది. ఆ కేసు నుంచి బయట పడడానికి దాస్ గ్యాంగ్ చాలా ప్రయత్నిస్తుంది. చివరకు దాస్ ఆ కేసు నుంచి బయట పడ్డాడా? బయటపడడానికి చేసిన ప్రయత్నాలేంటి? అనేది మిగతా కథ. నటీనటులు : తెలంగాణ యాసతో పక్కా హైదరాబాది కుర్రాడిలా దాస్ పాత్రలో విశ్వక్ సేన్ పర్వాలేదనిపించాడు. ఆ పాత్రకు తగ్గట్టు భాషను యాసను బాడీ లాంగ్వేజ్ ను మెయింటైన్ చేశాడు. అయితే ఎమోషనల్ సీన్స్‌లో మాత్రం తేలిపోయాడు. భావోద్వేగాలను సరిగా పండించలేకపోయాడు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఏ ఒక్కరూ మెప్పించలేకపోయారు. లుక్స్ పరంగా నటన పరంగా ప్రేక్షకులను అలరించలేక పోయారు. దర్శకుడి నుంచి నటుడిగా మారిన తరుణ్ భాస్కర్ మంచి పాత్రలో కనిపించాడు. ఓ దర్శకుడు నటుడిగా మారితే ఎంతగా మెప్పించగలరో చూపించాడు. సైదులు పాత్రలో తరుణ్ జీవించాడనే చెప్పాలి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాండు పాత్ర గురించి, ఉత్తేజ్ ఈ పాత్రను తన అనుభవంతో అవలీలగా చేసేసాడు. మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు బాగానే ఆకట్టుకున్నారు. విశ్లేషణ : మలయాళంలో సూపర్ హిట్ అయిన అంగమలై డైరీస్ రీమేక్ రైట్స్‌ను కొనుక్కొని మరీ దర్శకుడు అవతారం ఎత్తి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు విశ్వక్. అయితే ఇదేమీ కొత్త కథ కాదు. బస్తి గొడవలు గ్యాంగ్ వార్స్ అల్లరి చిల్లరిగా తిరిగే హీరో, హీరో చుట్టూ నలుగురు స్నేహితులు ఈ కాన్సెప్ట్ తో మనం ఎన్నో సినిమాలు చూసేసి ఉన్నాం. తెలుగు ప్రేక్షకులకు ఇది రొటీన్ కథ లాగే అనిపిస్తుంది. దర్శకుడిగా విశ్వక్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఒరిజినల్ కథకు మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి ఆకట్టుకునేలా తెరపై చూపించలేకపోయాడు. తెరపై ఎంతసేపు గొడవలు పడటం, బూతులు తిట్టుకోవడం, తాగడం, తిరగడం ఇవే కనబడుతూ ఉంటాయి. కథానాయికల పాత్రలకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. ప్రేక్షకుడికి గుర్తుండిపోయేలా ఏ ఒక్కరూ కనిపించలేదు.. నటించలేదు. ప్రతీ సన్నివేశంలో దర్శకుడి అనుభవలేమి కనబడుతుంది. అనవసరమైన సన్నివేశాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇందులో సాగదీస్తూ తీసిన సన్నివేశాలు ప్రేక్షకుడికి అసహనాన్ని కలిగిస్తాయి. నటుడిగా పరవాలేదనిపించిన విశ్వక్ దర్శకుడిగా మెప్పించలేకపోయాడు. కేవలం బోల్డ్ డైలాగ్స్‌ను నమ్ముకొని సినిమా చేశారన్న భావన కలుగుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివతో పోల్చారు గాని.. ప్రేక్షకుడికి ఏ స్థాయిలోనూ అలాంటి ఫీలింగ్ కలగదు. యూత్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం ఆ వర్గం ప్రేక్షకుల్ని కొంతమేరకు ఆకట్టుకోవచ్చు. వివేక్ సాగర్ అందించిన సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేదు. అయితే కొన్ని సన్నివేశాల్లో అందించిన నేపధ్య సంగీతం మాత్రం బాగుంది. కెమెరామెన్ హైదరాబాద్ ఆర్కిటెక్చర్ తో పాటు ఇక్కడి బస్తీల పరిస్థితులను అక్కడి వాతావరణాన్ని తన కెమెరాలో బాగానే బంధించాడు. ఎడిటర్ ఇంకా కత్తెరకు పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఈ బలాలు బలహీనతలు చెప్పుకోకుండా ఉంటేనే బావుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ జాబితాను మనం తీస్తే అన్ని బలహీనతలే కనిపిస్తాయి. -బండ కళ్యాణ్, ఇంటర్ నెట్ డెస్క్. -
ఊహకి అందని కథ
‘‘మంచి ఫిల్మ్‌మేకర్ అవ్వాలని యానిమేషన్ నేర్చుకున్నా. డైరెక్షన్, యాక్టింగ్ రెండిటిలోనూ ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా. నటించడం, దర్శకత్వం చేయడం కష్టం అనిపించలేదు కానీ, ప్రొడక్షన్ చాలా కష్టం’’ అని విశ్వక్ సేన్ అన్నారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. డి.సురేశ్‌బాబు సమర్పణలో విశ్వక్ సేన్ సినిమాస్, టెర్రనోవా పిక్చర్స్ బ్యానర్స్‌పై వాజ్ఞ్మయి క్రియేషన్స్ కరాటే రాజు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘నేను జర్నలిజం స్టూడెంట్‌ని. రెండు సబ్జెక్టులు బ్యాలెన్స్ ఉన్నాయి. ఫిల్మ్ మేకర్ అవ్వాలని ఉందని మూడో తరగతిలోనే మా అమ్మానాన్నలకు చెప్పాను. వారు నన్ను ప్రోత్సహించడంతో ఎక్కువ మురిపెం చేస్తున్నారంటూ మా బంధువులు తిట్టారు. అయినా నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. ‘వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది’ సినిమాల్లో నటించాను. ‘ఫలక్‌నుమా దాస్’ నా మూడో చిత్రం. ఈ సినిమాకి నేనే డైలాగులు రాశాను. ఇందులోని భావోద్వేగాలను నాకంటే బాగా ఎవరూ పండించలేరనిపించి నేనే హీరోగా నటించాను. ఇది పక్కా ఎమోషనల్ ఫిల్మ్. కుటుంబం, స్నేహం నేపథ్యంలో ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుంది? అన్నది ఎంతో మేధాశక్తి ఉన్నవారు కూడా ఊహించలేరు. ఎందుకంటే ఇది రెగ్యులర్ సినిమా కాదు. సాధారణంగా ఫలక్‌నుమా అనగానే అందరికీ అందమైన ప్యాలెస్ గుర్తుకొస్తుంది. కానీ, దాని వెనక ఉన్న బస్తీ గుర్తుకురాదు. ఆ బస్తీలోని ఎన్నో అందమైన ప్రదేశాలను మా సినిమాలో చూపించాం. 2005–2009 నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఈ కథతో కొందరు నిర్మాతలను కలిస్తే చేయడం కుదరదన్నారు.. మరికొందరు డైలాగులు మార్చమన్నారు. తీరా టీజర్ రిలీజ్ అయ్యాక సినిమా మేమే కొంటామని ముందుకొచ్చారు. తెలుగులో అంతర్జాతీయ స్థాయి సినిమాలు రావాలన్న ఆలోచన సురేశ్బాబుగారిది. ‘ఫలక్‌నుమా దాస్’ సినిమా చూడకుండా కేవలం టీజర్ చూసి మాపై నమ్మకంతో ఈ చిత్రం విడుదల చేస్తున్నారాయన. ప్రస్తుతం నేను ‘కార్టూన్’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నా. ఆ తర్వాత నాని నిర్మాతగా కొత్త దర్శకుడు శైలేష్‌తో ఓ సినిమాలో నటించబోతున్నా. డైరెక్షన్‌కి ఓ ఏడాది గ్యాప్ ఇస్తున్నా. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లో ఓ సినిమా తెరకెక్కిస్తా’’ అన్నారు. -
తెలుగు సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లబోతోంది
‘‘ఫలక్‌నుమా దాస్’ సినిమా మొదలైన పది నిమిషాల వరకు ఇదేం సినిమా? అనే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ తర్వాత ప్రేక్షకులు సినిమా మూడ్ లోకి వెళ్తారు. అంతగా కనెక్ట్ చేసేస్తుంది’’ అని హీరో నాని అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. కరాటే రాజు సమర్పణలో విశ్వక్ సేన్ సినిమాస్, టెర్రనోవా పిక్చర్స్ బ్యానర్స్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాని మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడం, నా ‘వాల్‌పోస్టర్’ ప్రొడక్షన్ బేనర్లో నెక్ట్స్ విశ్వక్ సేన్ చేయబోతుండటం, ‘ఫలక్‌నుమాదాస్’ సినిమా నాకు చూపించడం వల్లే ఈ ఫంక్షన్‌కి వచ్చాను. ప్రివ్యూ థియేటర్లోనే ఎంజాయ్ చేశామంటే, ప్రేక్షకులు ఎంత ఎంజాయ్ చేస్తారు? ఈ చిత్రంలో అందరూ బాగా నటించారు. అన్నింటినీ మించిన పెర్ఫార్మెన్స్ తరుణ్ భాస్కర్‌ది. తరుణ్ ఇక డైరెక్షన్ మానేయొచ్చు. యాక్టర్‌గా కంటిన్యూ చేస్తే డైరెక్టర్ కంటే 3 రెట్లు ఎక్కువ సంపాదించొచ్చు. ఏడాదిలో ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండవు. అందుకు నాదీ గ్యారెంటీ. ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్నవారిని చూస్తుంటే మన తెలుగు సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లబోతోందనిపిస్తోంది’’ అన్నారు. హీరో, డైరెక్టర్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘సినిమా నేపథ్యం లేకున్నా సినిమాల్లోకి రావచ్చనే ధైర్యం నానీ అన్న వల్లే వచ్చింది. నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు అందరూ భయపెట్టారు. నాకు ఎలానూ బ్యాక్‌గ్రౌండ్ లేదు.. ఏదైనా జరిగితే బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోవాలనుకున్నా. కానీ, అలా జరగదనే ఈ సినిమా తీశా. టీజర్‌కే బ్యాగ్ ప్యాక్ చేసుకునే చాన్స్ లేకుండా చేశారు’’ అన్నారు. ‘‘నన్ను యాక్టర్‌ను చేసినందుకు విశ్వక్‌కి థ్యాంక్స్. విజయ్ దేవరకొండ, విశ్వక్‌కు మధ్య వ్యక్తిత్వంలో పోలికలు ఉన్నాయి. సెట్లో అందరినీ ప్రేమగా చూసుకుంటారు’’ అన్నారు తరుణ్ భాస్కర్. కరాటే రాజు, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, సహ నిర్మాత మీడియా 9 మనోజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నాని నిర్మాణంలో యంగ్ హీరో
టాలీవుడ్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని, నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్‌ను స్థాపించి ‘అ!’ సినిమాను నిర్మించిన నాని.. అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. అయితే అ! సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాకపోవటంతో వెంటనే మరో సినిమాను నిర్మించలేదు. కాస్త గ్యాప్ తరువాత మరో చిత్రాన్ని నిర్మిస్తున్నట్టుగా ప్రకటించాడు నాని. విశ్వక్సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఫలక్నామా దాస్ ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా వచ్చిన నాని నిర్మాతగా తన రెండో సినిమాను ప్రకటించాడు. విశ్వక్సేన్ తో తన బ్యానర్లో రెండో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఈ సినిమాలో విశ్వక్ కేవలం హీరోగా నటిస్తాడా లేక దర్శకత్వం కూడా తానే చేస్తాడా అన్న విషయం తెలియాల్సి ఉంది.