మళ్లీ కోర్టుకెక్కనున్న ‘ఆశీర్వాద్’
బాలీవుడ్ తొలి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నాకు ఎంతో ఇష్టమైన 'ఆశీర్వాద్' బంగ్లా మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ముంబయి బాంద్రాలోని ఇదే బంగ్లాలో రాజేశ్ ఖన్నా 2012 జూలై 18న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించిన తర్వాత వారసత్వం కింద కుమార్తెలు ట్వింకిల్, రింకీ ఖన్నాలకు ఆ ఆస్తి సంక్రమించింది. వారు ఇప్పుడు ఆ బంగ్లాను నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్తకు విక్రయించినట్లు సమాచారం.
నాలుగు దశాబ్దాలకు పైగా ఆ ఇంట్లో నివసించిన అనుబంధంతో ఆశీర్వాద్‌ను మ్యూజియంగా మార్చాలని ఖన్నా ఆశించారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం తన కూతుళ్లదేనని మరణానికి కొన్నేళ్ల ముందు ఆయన చెప్పారు. ప్రస్తుతం వరదాన్ ఆశీర్వాద్‌గా పిలుస్తున్న ఆ ఇంటిని ఆల్ కార్గో లాజిస్టిక్స్ చైర్మన్ శశికిరణ్ శెట్టి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
కాగా బంగ్లా ఆస్తిలో తనకు వాటా ఉంటుందని, రాజేశ్ ఖన్నా తనకు కూడా భర్తేనని ఆయన సహచరి అనితా అద్వానీ గతంలో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఖన్నా కుటుంబ సభ్యులకు ఆమె లీగల్ నోటీసులు పంపించారు కూడా. డింపుల్ ఖన్నాతో విడిపోయిన అనంతరం రాజేశ్ ఖన్నా ఎనిమిదేళ్లు అనితా అద్వానీతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఖన్నా మృతి చెందిన అనంతరం ఆయన ఇంటిని మ్యూజియంగా మార్చాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే.. అనితా అద్వానీకి ఇందులో ఎలాంటి సంబంధం లేదని రాజేశ్ ఖన్నా భార్య డింపుల్, కూతుళ్లు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా వాదిస్తూ వచ్చారు. ఆశీర్వాద్ బంగ్లా తమ పేరు మీద ఉందని, అందుకే అమ్మకానికి పెట్టినట్లు వారు చెబుతున్నారు. దాంతో ఆశీర్వాద్ బంగ్లా అమ్మకం చెల్లదని పేర్కొంటూ అనితా అద్వానీ మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఇదే వివాదంలో కోర్టులో తనకు అనుకూలంగానే తీర్పు వచ్చిందన్నారు. అయితే కాకాజీ కుటుంబీకులు న్యాయస్థానంపై గౌరవం ఉంచకుండా బంగ్లాను విక్రయించాలనుకోవటం సరికాదన్నారు. దీనిపై తాను తుది వరకూ పోరాడతానకి అనితా అద్వానీ స్పష్టం చేశారు.
సముద్రానికి అభిముఖంగా 603 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం రూ.90 కోట్ల వరకు పలుకుతుందని మార్కెట్ వర్గాల కథనం. అయితే ఎవరైనా థర్డ్ పార్టీ.. యాజమాన్య హక్కును కోరడానికి సంబంధించి జారీ చేసిన 14 రోజుల నోటీసు గడువు ముగిసిన తర్వాతే ఈ కొనుగోలు ఒప్పందం పూర్తి అవుతుంద నేది విశ్వసనీయ వర్గాల కథనమని టైమ్స్ ఆఫ్ ఇండియూ పేర్కొంది. 60వ దశకం చివర్లో మరో బాలీవుడ్ దిగ్గజం రాజేంద్రకుమార్ నుంచి ఈ భవనాన్ని కొనుగోలు చేసిన రాజేశ్‌ఖన్నా 80వ దశకంలో దాన్ని పునర్నిర్మించారు.