రెండేళ్ల బాలుడిని మాంత్రికుడంటూ..
ఇది హృదయవిదారక దృశ్యం. కఠినాత్ములకు కూడా కన్నీళ్లు తెప్పించే చిత్రం. అన్న పానీయాలు లేకుండా అలమటిస్తూ గత 8 నెలలుగా వీధుల్లో తిరుగుతున్న రెండేళ్ల బాలుడి దైన్యం. వీధికుక్కలా చెత్తకుప్పల్లో దొరికే ఎంగిలి మెతుకులు తింటూ బక్కచిక్కిన బాలుడికి ఓ సామాజిక కార్యకర్త నీళ్లు తాగిస్తున్న దృశ్యం.
పిల్లాడిలో మాంత్రికుడి లక్షణాలు ఉన్నాయంటూ తల్లిదండ్రులు ఈ బాలుడిని రోడ్డున పడేశారు. స్థానికులు కూడా పట్టించుకోలేదు. వీధిలో దొరికే కుళ్లిన ఎంగిలి మెతుకులు తినడం వల్ల పిల్లాడి కడుపులో పురుగులు కూడా పుట్టుకొచ్చాయి. 'ఆఫ్రికన్ చిల్డ్రన్స్ ఎయిడ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్' వ్యవస్థాపకురాలు, డానిష్ మహిళ అంజ రింగ్రెన్ లవెన్కు జనవరి 31వ తేదీన ఈ పిల్లాడు తారసపడ్డాడు. పిల్లాడి పరిస్థితిని గమనించిన ఆమె వెంటనే బాలుడికి నీళ్లు తాపించి, కొంత తాజా ఆహారం అందించి సమీపంలోని ఆస్పత్రిలో చేర్చింది.
ఆస్పత్రిలో పిల్లాడి కడుపు నుంచి పురుగులను తొలగించిన వైద్యులు ప్రతిరోజు పిల్లాడికి రక్తమార్పిడి చేస్తున్నారు. ఎర్ర రక్త కణాలు అభివృద్ధి చెందేవరకు ఇలా చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. వైద్య ఖర్చులు భారీగా ఉంటుండంతో డానిష్ మహిళ లవెన్ విరాళాల కోసం సోషల్ వెబ్సైట్ 'ఫేస్బుక్'ను ఆశ్రయించారు. పిల్లాడి పరిస్థితిని వివరించేందుకు వరుస ఫొటోలను పోస్ట్ చేశారు. ఆదివారం నాటికి ఆమెకు ఆరున్నర కోట్ల రూపాయలు విరాళంగా అందాయి. వాటిని పిల్లాడి వైద్యం కోసం ఖర్చు చేస్తానని, మిగిలిన డబ్బులను పిల్లల వైద్యశాలను నిర్మించడం కోసం వెచ్చిస్తానని లవెన్ వివరించారు. ప్రస్తుతం పిల్లాడు కోలుకుంటున్నారని, ముఖాన నవ్వు కూడా విరిసిందని, తన కుమారుడితో ఆడుకుంటున్నాడని అమె తెలిపారు.
నైజీరియాలో వేలాదిమంది పిల్లలను క్షుద్రపూజలు చేసే మాంత్రికులుగా భావించి హింసిస్తారని, వీధిల్లో వదిలేస్తారని ఆమె చెప్పారు. అలాంటి అనాథ పిల్లలను ఆదుకొని, వారికి విద్యాబుద్ధులు చెప్పించేందుకే తమ ఫౌండేషన్ కృషి చేస్తోందని ఆమె తెలిపారు. ఆమె భర్త డేవిడ్ ఇమాన్యుయేల్ కూడా ఫౌండేషన్ పనులను చూసుకోవడంలో ఆమెకు సహకరిస్తున్నారు.