మెమన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు, ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో మరణశిక్ష పడిన యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనకు విధించిన మరణశిక్షను పునస్సమీక్షించాలని ఆయన పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. జస్టిస్ ఎ.ఆర్.దవే సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఆయన వినతిని తోసిపుచ్చింది. మెమన్‌కు విధించిన మరణశిక్షను ఖరారు చేసింది. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో మెమన్‌కు మరణశిక్ష పడింది. అయితే అతనికి ఈ శిక్ష అమలును 2014 జూన్‌లో సుప్రీంకోర్టు నిలిపేసింది.
కోర్టు తాజాగా అతని విన్నపాన్ని తిరస్కరించడంతో ఉరిశిక్ష అమలుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు మెమన్ ముందున్న అవకాశాలు తగ్గిపోయాయి. తన రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించడానికి వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానంలో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయడం, అనంతరం రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోవడం వంటి అవకాశాలు మాత్రమే మిగిలివున్నాయి.