రూ.300కే.. యాప్‌తో వ్యాపారం!
► ఆఫ్‌లైన్ సంస్థలు, ఆన్లైన్ కస్టమర్లను కలిపే వేదిక గుడ్‌బాక్స్
► గుడ్‌బాక్స్ యాప్‌లో వందలాది మినీ యాప్స్
► చాట్ చేస్తూ ఉత్పత్తుల కొనుగోలు, లావాదేవీలూ జరిపే అవకాశం
► ప్రస్తుతం 14 వేల వర్తకులు; 2 లక్షల యాప్స్ డౌన్లోడ్
► రూ.19 కోట్ల నిధుల సమీకరణ పూర్తి
► ‘స్టార్టప్ డైరీ’తో గుడ్‌బాక్స్ ఫౌండర్ అబే జకారియా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒక్క యాప్‌తో ఒకే ప్రయోజనం. మరి, బోలెడు ప్రయోజనాలు కావాలంటే బోలెడు యాప్స్ కావాలి!! అన్ని యాప్స్‌ను ఒక్క స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకుంటే మెమొరీ కూడా సరిపోదేమో? మరెలా?! ఒకే ఒక్క యాప్‌లో స్థానిక వర్తకులందరి మినీ యాప్స్ ప్రత్యక్షమైతే? ఎంచక్కా మనకేది కావాలంటే ఆ యాప్‌ను ఓపెన్ చేసి వినియోగించుకోవచ్చు కదూ!! ఇంతకీ ఆ మెగా యాప్ ఏంటంటారా? అదే.. ‘గుడ్‌బాక్స్’! ఇంతకీ మరి మినీ యాప్‌ను డెవలప్ చేయాలంటే అయ్యే ఖర్చెంతో తెలుసా.. నెలకు రూ.300! ఆశ్చర్యంగా ఉంది కదూ!! ఇంకెందుకు ఆలస్యం గుడ్‌బాక్స్ కథేంటో దాని వ్యవస్థాపకుడు అబే జకారియా మాటల్లోనే తెలుసుకుందాం!!
ఈ రోజుల్లో యాప్ అభివృద్ధి, టెస్టింగ్ కోసం ఎక్కడికెళ్లినా ఎంతలేదన్నా రూ.3 లక్షలపైనే చార్జీ చేస్తున్నారు. దీంతో చిన్న, మధ్యతరహా వ్యాపారులు ఆన్లైన్ వ్యాపారానికి దూరంగా ఉంటున్నారు. దీనికి పరిష్కారం చూపించటం కోసమే రెడ్‌బస్‌లో టాప్ లెవల్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి సొంతంగా స్టార్టప్ పెట్టాలని నిర్ణయించుకున్నా.
అయితే ఆ ఆలోచన కేవలం తక్కువ ధరకు యాప్‌ను అభివృద్ధి చేయడంతోనే సరిపోదు. ఒకే యాప్‌లో స్థానిక వర్తకులందరి మినీ యాప్స్ కూడా ఉంటే అటు కస్టమర్లకూ వినియోగంగా ఉంటుందని నిర్ణయించుకున్నా. స్నేహితులు మయాంక్, మహేశ్, ఆనంద్, నితిన్ చంద్ర, మోహిత్ మహేశ్వరీ, చరణ్ శెట్టిలతో కలిసి 2015 జూన్‌లో బెంగళూరు కేంద్రంగా గుడ్‌బాక్స్.ఇన్ను ప్రారంభించాం.
చాట్ చేస్తూ ఆర్డర్..
గుడ్‌బాక్స్ మెగా యాప్‌లో వందలాది మినీ యాప్స్ నిక్షిప్తమై ఉంటాయి. ఇందులో 2 రకాల యాప్స్ ఉంటాయి. 1. పార్టనర్ యాప్, 2. కన్సూమర్ యాప్. పార్టనర్ యాప్‌లో వర్తకులు వారి ఉత్పత్తులను డిస్ప్లే చేసుకోవచ్చు. ఆర్డర్లను తీసుకోవచ్చు. కన్జ్యూమర్ యాప్‌లో.. కస్టమర్లు యాప్‌ను ఓపెన్ చేయగానే స్థానికంగా ఉండే అన్ని రకాల వర్తకుల యాప్స్ కనిపిస్తుంటాయి. అందులో కావాల్సిన యాప్‌ను ఎంచుకొని నేరుగా వర్తకులతో చాట్ చేస్తూ ఆర్డర్లు ఇవ్వొచ్చు. రాయితీలూ పొందొచ్చు. కావాలంటే నేరుగా అక్కడి నుంచే ఆన్లైన్ లావాదేవీలూ జరపొచ్చు కూడా. ప్రస్తుతం 2 లక్షల మంది కస్టమర్లు గుడ్‌బాక్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు.
3 రకాల సబ్స్క్రిప్షన్స్..
గుడ్‌బాక్స్ యాప్ అభివృద్ధికి నెలకు రూ.300, రూ.600, రూ.1,200లు 3 రకాల సబ్స్క్రిప్షన్ మోడల్స్ ఉన్నాయి. సబ్‌స్క్రిప్షన్‌ను బట్టి యాప్ ఫీచర్లలో తేడాలుంటాయి. ఉదాహరణకు బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌లో వర్తకులు ఉత్పత్తుల డిస్కౌంట్స్, రివార్డు పాయింట్ల వంటివి ఇచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 వేల మంది ఎస్ఎంఈలు నమోదయ్యారు. ఇందులో కిరాణా, గ్రాసరీ, లాండ్రీ, రెస్టారెంట్, ఎలక్ట్రానిక్ కంపెనీలు, ఎన్జీవోలు, సెలూన్లు వంటివెన్నో ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు 1,000 లావాదేవీలు జరుగుతున్నాయి. ఇందులో 40 శాతం పేమెంట్ గేట్‌వే లావాదేవీలే. ప్రతి లావాదేవీ మీద 1.99 శాతం కమీషన్‌గా తీసుకుంటాం. ప్రతి నెలా 30 శాతం వ్యాపారం వృద్ధి చెందుతుంది.
రూ.19 కోట్ల నిధుల సమీకరణ..
ప్రస్తుతం మా కంపెనీలో 75 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు రూ.19 కోట్ల నిధులను సమీకరించాం. మణిపాల్ గ్రూప్, నెక్సెస్ వెంచర్ పార్టనర్స్, ట్యాక్సీ4ష్యూర్ కో–ఫౌండర్ అప్రమేయ రాధా కృష్ణన్, రెడ్‌బస్ కో–ఫౌండర్ చరణ్ పద్మరాజులు ఈ పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం రూ.10 కోట్లుగా ఉన్న గ్రాస్ మర్చండేజ్ వ్యాల్యూ (జీఎంవీ).. ఈ ఏడాది ముగింపులోగా రెండింతలకు, 25 వేల మంది వ్యాపారుల నమోదు లక్ష్ష్యించాం.