పోటీ పరీక్షలకు... ఆలివ్‌బోర్డ్!
► 30 రకాల పోటీ పరీక్షలకు స్టడీ మెటీరియల్స్
► సిలబస్‌లతో పాటూ వీడియో పాఠాలు, బృంద చర్చలు
►2 నెలల్లో ఐటీ కోర్సుల సిలబస్ అందుబాటులోకి
►10 లక్షల మంది యూజర్లు; 70 శాతం టౌన్లలోనే
►‘స్టార్టప్ డైరీ’తో ఆలివ్‌బోర్డ్ సీఈఓ అభిషేక్ పాటిల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్చిలో పరీక్షలవగానే... అంతా కుస్తీలు పట్టేది ప్రవేశ, పోటీ పరీక్షలతోనే. కోచింగ్ సెంటర్లు, ట్యుటోరియల్స్ చుట్టూ తిరుగుతుంటారు కూడా. కాకపోతే టెక్నాలజీ చేతికొచ్చాక ఇదంతా అవసరం లేదంటోంది ఆలివ్‌బోర్డ్. ఏకంగా 30 రకాల పోటీ పరీక్షలకు స్టడీ మెటీరియల్‌తో పాటు... ఆన్లైన్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్స్... వంటివన్నీ అందజేస్తోందీ సంస్థ. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఉపయోగించుకుంటున్న ఆలివ్‌బోర్డ్ సేవల గురించి ఆలివ్‌బోర్డ్.కామ్ సీఈఓ అభిషేక్ పాటిల్ ఏమంటారంటే...
నాలుగు గోడల మధ్య కూర్చొని చదివే రోజులు పోయాయి. పైగా కోచింగ్ సెంటర్లకు వెళ్లడం అన్ని వర్గాలకూ కుదరదు.ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని ఉద్యోగార్థులకైతే మరీనూ. ఇదే ఆలివ్‌బోర్డ్ ప్రారంభానికి కారణమైంది. అందుబాటు ధరల్లో, నాణ్యమైన స్టడీ మెటీరియ ల్స్ అందించడమే లక్ష్యంగా మరో స్నేహితుడు సతీష్ కుమార్‌తో కలిసి 2012 ఆగస్టులో బెంగళూరు కేంద్రంగా ఆలివ్‌బోర్డ్‌ను ప్రారంభించాం.
10 లక్షల మంది యూజర్లు..: ప్రస్తుతం ఆలివ్‌బోర్డ్‌లో 10 లక్షల మంది యూజర్లున్నారు. వీరిలో 2 లక్షల మంది యాక్టివ్. 70 శాతం మంది విద్యార్థులు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల వారే. ఏడాదిలో ఈ సంఖ్యను కోటికి చేర్చాలని లకి‡్ష్యంచాం. ఆలివ్‌బోర్డ్ సేవలను డెస్క్‌టాప్, ల్యాప్‌ట్యాప్స్‌లతో పాటూ యాప్ ద్వారా స్మార్ట్ఫోన్లలోనూ వినియోగించొచ్చు. దీంతో విద్యార్థులు ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా తరగతులకు హాజరుకావచ్చు. ప్రిపేరయ్యే వీలూ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్‌లతో ఒకే సమయంలో దేశవ్యాప్తంగా ఇతర విద్యార్థులతో పోటీపడొచ్చు.
వీడియో పాఠాలు కూడా..
ఎంబీఏ, బ్యాంకింగ్, ప్రభుత్వ ఉద్యోగాల ప్రవేశ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌లు, స్టడీ మెటీరియల్స్ ఉంటాయి. ఐబీపీఎస్, ఐపీపీబీ ఆఫీసర్స్, క్యాట్, సీమ్యాట్, స్నాప్, యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ వంటి 30కి పైగా పోటీ పరీక్షల సిలబస్‌లున్నాయి. అన్నీ సిలబస్‌లలో కలిపి సుమారు 10 కోట్లకు పైగా ప్రశ్నలున్నాయి. కోర్సులు, మెటీరియల్స్ ఎంపికను బట్టి ధరలు రూ.349–3,999 వరకూ ఉంటాయి. స్టడీ మెటీరియల్స్ మాత్రమే కాదు వీడియో పాఠాలు, ప్రత్యక్ష బృంద చర్చలు, కస్టమైజ్డ్ స్టడీ ప్లానర్స్, ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్, విశ్లేషణలు వంటి సేవలన్నీ ఉంటాయి.
6 నెలల్లో నిధుల సమీకరణ..
ప్రస్తుతం మా సంస్థలో 28 మంది ఉద్యోగులున్నారు. త్వరలో మరో 60 మందిని నియమిస్తాం. ఏటా రెట్టింపు ఆదాయాన్ని నమోదు చేస్తున్నాం. గతేడాది ఏప్రిల్‌లో ఇండియా ఎడ్యుకేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫం డ్ (ఐఈఐఎఫ్) నుంచి నిధులు సమీకరించాం. 6 నెల ల్లో మరికొంత ఫండింగ్ చేస్తాం. వీటితో ఐటీ కంపెనీ ల ప్రాంగణ నియామకాల కోసం పలు ఐటీ కోర్సుల శిక్షణ మెటీరియల్స్‌నూ అందుబాటులోకి తెస్తాం.