అక్షయ్‌హరిప్రసాద్‌కుమార్
ఉత్తరప్రదేశ్‌లోని ఖైరాహి గ్రామం. ఆ గ్రామానికి పెద్ద హరిప్రసాద్. గ్రామపెద్ద ఆలోచనలు ఊరి గురించే సాగాలి, అలాగే సాగుతుంటాయి కూడా. మామూలుగా అయితే ఊరి చెరువు ఎలా ఉంది, పంటకాలువల పూడిక ఎప్పుడు తీయాలి, రోడ్లెలా ఉన్నాయి, వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా, స్కూలు భవనం పెచ్చులు రాలకుండా పటిష్టంగా ఉందా లేదా, టీచర్లు అందరూ వస్తున్నారా, పాఠాలు చక్కగా చెబుతున్నారా, పిల్లలకు పోలియో వ్యాక్సిన్లు వేయిస్తున్నారా లేదా... ఇంత వరకే సాగుతుంటాయి. అయితే హరిప్రసాద్ ఆలోచనలు మరింత ముందుకెళ్లాయి. స్కూలుకి టీచర్లు సక్రమంగా వచ్చేలా చూడటంతోనే సరిపోదు, పిల్లలు కూడా వచ్చేలా చూడాలి. అప్పుడే పిల్లలకు నాలుగు అక్షరాలు వస్తాయి అనుకున్నాడు. పిల్లల హాజరు మీదకు మళ్లింది హరిప్రసాద్ దృష్టి. తొమ్మిది, పది తరగతుల్లో ఆడ పిల్లలు తరచూ స్కూలు ‘ఎగ్గొట్టేస్తున్నారు’. నిజమే, హాజరు పట్టీ చూసిన హరిప్రసాద్‌కు కలిగిన తొలి అభిప్రాయం అదే. ‘ఒక్కొక్కరు అన్నేసి రోజులు బడికి రాకపోతే మీరేమీ పట్టించుకోరా, రోజూ పాఠాలు వినాలని చెప్పాల్సిన మీరే ఏమీ పట్టనట్లు ఊరుకుంటే ఎలా’ అని టీచర్లను అడిగాడు.
అప్పుడు తెలిసింది!
ఆ ప్రశ్నకు టీచర్ల దగ్గర సమాధానం లేదు. ‘ఇదే ప్రశ్న మేమూ అడుగుతున్నాం. ఆ అమ్మాయిలు మాత్రం నోరు విప్పడం లేదు. ఎంత గట్టిగా అడిగినా, నిలదీసినా కూడా మౌనాన్ని వీడడం లేదు’ అని నిస్సహాయతను వ్యక్తం చేశారు హెడ్మాస్టర్. ‘బహుశా రుతుక్రమం ఇబ్బందులు కావచ్చు, మేమెలా మాట్లాడగలం? ప్రతి నెలలోనూ నాలుగైదు రోజులు సెలవులను చూసీచూడనట్లు వదిలేయక తప్పడం లేదు’ సైన్స్ టీచర్ మెల్లగా చెప్పారు. ఆమె ఊహ నిజమే!
తండ్రుల సమావేశం
హరిప్రసాద్ వెంటనే స్కూల్లోనే ఒక చిన్న గదికి ఎరుపు రంగు వేసి అందులో శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉంచాడు. ‘వీటిని వాడుకోండి, ఈ సమస్య కోసం పాఠాలు మానుకోవద్దు, రోజూ స్కూలుకి రండి’ అని టీచర్లతో చెప్పించాడు. అంతటితో ఊరుకోకుండా ఆ స్కూల్లో చదువుకుంటున్న అమ్మాయిల తండ్రులతో స్వయంగా మాట్లాడాడు. ‘రుతుక్రమం కళంకం కాదు, దేహధర్మం. ఆ రోజుల్లో ఒక పక్కన ఉండిపోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. బడికి పంపడమూ తప్పు కాదు. పిల్లలకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇంట్లో కంటే మెరుగ్గా ఉంటాయి స్కూల్లో. అమ్మాయిలను అన్ని రోజుల్లోనూ స్కూలుకి పంపించండి’ అని వారు సమాధానపడే వరకు చెప్పారు. హరిప్రసాద్ ఆరోగ్యశాఖలో స్వచ్ఛందంగా పని చేస్తుంటారు. యునిసెఫ్ నిర్వహిస్తున్న ‘ప్రాజెక్ట్ గరిమ’లో కూడా క్రియాశీలకంగా పని చేస్తుంటారు. దాంతో ఆరోగ్యశాఖ ఈ స్కూల్లో చదువుకుంటున్న అమ్మాయిలకు అవసరమైనన్ని నాప్కిన్స్ని సప్లయ్ చేస్తోంది. ఆ ప్రయత్నంతో టీచర్లలో కూడా ఉత్సాహం వచ్చింది. అప్పటికే బడి మానేసిన 35 మంది అమ్మాయిల తల్లిదండ్రులను ఒప్పించి, ఆ అమ్మాయిలను తిరిగి స్కూల్లో చేర్చుకున్నారు స్కూల్ హెడ్మాస్టర్.
లోకల్ ప్యాడ్‌మ్యాన్
హరిప్రసాద్ ఇదంతా ఎటువంటి ఆర్భాటం లేకుండా చాలా మామూలుగా చేసేశారు. కానీ ఆ ఊరి యువకులు మాత్రం అతడికి మారుపేరు పెట్టేశారు. శానిటరీ ప్యాడ్ పట్ల అవగాహన కల్పించడానికి అక్షయ్ కుమార్ నటించిన ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమాతో పోల్చి ఆ పేరే పెట్టేశారు. హరిప్రసాద్‌ను అదే సంగతి అడిగితే ‘ఆ సినిమా గురించి నాకు తెలియదు. యువకులంతా ఆ సినిమా పేరుతో పిలుస్తున్నారు’ అని నవ్వేస్తారాయన.
ఖైరాహీ పాఠశాలలోని ఈ ఎరుపు రంగు గదిలో శానిటరీ నేప్కిన్స్ సిద్ధంగా ఉంటాయి. బాలికల గైర్హాజరీని తగ్గించేందుకు హరిప్రసాద్ ఈ ఏర్పాటు చేశారు. ఆ గదికి ప్రత్యేకంగా ఎరుపు రంగును వేయించింది కూడా ఆయనే!
– మంజీర