బిజినెస్మెన్ తల నరికేందుకు వెళుతూ..
న్యూఢిల్లీ: బుర్ద్వాన్ రైల్వే స్టేషన్ లో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న ఇస్లామిక్ స్టేట్ సానుభూతి పరుడి గురించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ వ్యాపార వేత్త తల నరికేందుకు అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఆ దిశగానే తాను పావులు కదుపుతున్నట్లు చెప్పాడు. ఈ వివరణను ఎన్ఐఏ అధికారులు ఓ వీడియో రూపంలో రికార్డు చేశారు.
అనుమానిత ఉగ్రవాది కదలికలు ఉన్నాయని, అతడు ఓ దారుణం సృష్టించేందుకు వెళ్లాలనని ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక ప్రకారం తరలిన ఎన్ఐఏ అధికారులు అబు ముసా అనే వ్యక్తిని బుధవారం బుర్ద్వాన్ రైల్వే స్టేషన్ లో ఓ పాస్ట్ ప్యాసింజర్ రైలులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అతడితోపాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడిని విచారించిన అధికారులకు ఈ విషయం చెప్పాడు. అతడు షపీ అర్మార్ అలియాస్ యూసఫ్ అల్ హిందీ అనే బంగ్లాదేశ్ కు చెందిన ఐసిస్ రిక్రూటర్ నుంచి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పాడు. కాగా, ఆ వ్యాపార వేత్త వివరాలు మాత్రం అధికారులు గుట్టుగా ఉంచారు. నిందితుడి వద్ద పొడవైన కత్తితోపాటు ఓ పెన్సిల్ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు.