వివేక స్రష్ట ముహమ్మద్ (స)
ఐదు రోజులు గడిచినా సమస్య ఓ కొలిక్కి రాలేదు. ఎవరికివారు ‘హజ్రె అస్వద్’ను ప్రతిష్టించే హక్కు తమకే ఉందని పట్టుబట్టారు. ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. రణరంగానికి రంగం సిధ్ధమైంది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కరవాలాలు ఒరల్లోంచి సర్రున బయటికి కొచ్చాయి...అంతలో.. ‘ఆగండి’ అంటూ మారు మోగిందో కంఠం.
అందరూ గిర్రున తిరిగి ఎవరా అని చూశారు. ఆ పెద్దమనిషి ఖుైరె ష్ తెగలోని కురు వృద్ధుడు. అబూ ఉమయ్యాబిన్ ముగీరా. అందరూ అతన్ని గౌరవిస్తారు. ఆయన మాట ఎవరూ కాదనరు. అందరూ అతని వైపు ప్రశ్నార్ధకంగా చూశారు.
‘గౌరవోన్నతుల విషయంలో మీరు ఎవరూ ఎవరికీ తక్కువ కారు. అంతా సమాన హోదా కలిగిన వారే. దైవ గృహంలో అనవసర రక్తపాతం మంచిదికాదు. విచక్షణా జ్ఞానంతో ఆలోచించండి. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తేకండి. నా సలహా ఏమిటంటే, సఫా ద్వారం నుండి మొట్టమొదట ఎవరైతే కాబాగృహంలోకి అడుగు పెడతారో వారిని న్యాయనిర్ణేతగా ఎంచుకోండి. అతను చెప్పిన తీర్పుకు కట్టుబడి ఉండండి.’ అన్నాడు పెద్దాయన ఉమయ్యా.
‘ఈ సలహా మాకు సమ్మతమే’ అన్నారు అందరూ ముక్తకంఠంతో. తరువాత కొంత సమయం గడిచి పోయింది. అందరూ ఊపిరి బిగబట్టి సఫా ద్వారంవైపే చూస్తున్నారు. అంతలో వారి ఉత్కంఠకు తెరలేపుతూ ఓ అందమైన యువకిశోరం ఆ ద్వారం గుండా కాబాలో అడుగుపెట్టాడు. అంతా ఒక్కసారిగా ‘అమీన్.. అమీన్.. ముహమ్మద్ .. ముహమ్మద్.. అమీన్ ’ అంటూ ఆనందంతో ఎగిరి గంతేసినంత పనిచేశారు.
ఎంత నమ్మకం..! ఎంత విశ్వసనీయత..!! మక్కా మాత్రమేకాదు, మొత్తం అరేబియా వెదికినా అలాంటి నిజాయితీ పరుడు, సత్యసంధుడు, విశ్వసనీయుడు మరొకరు దొరకరు. ఆయన ఎలాంటి తీర్పుచెప్పినా ప్రజలు దాన్ని కిమ్మనకుండా శిరసావహించవలసిందే. చూడాలిక ఈ విషయంలో ఆయన తీర్పు ఎలా ఉండబోతోందో..!
ముహమ్మద్ (స)కు ఏమీ అర్ధంగాక అయోమయంగా చూశారు. అంతలో వివిధ తెగలకు చెందిన అగ్రనాయకులంతా ఆయన చుట్టూ మూగి, సమస్యను వివరించి, పరిష్కరించమని విన్నవించుకున్నారు.
వెంటనే ముహమ్మద్ దుప్పటిలాంటి ఒక వస్త్రం తెప్పించి నేలపై పరిచారు. తానే స్వయంగా ‘హజ్రెఅస్వద్’ దానిపైన పెట్టారు. తరువాత పోటీ పడుతున్న అన్నితెగలనుండీ ఒక్కొక్క నేతను పిలిచి అందరితో దుప్పటి చెంగుల్ని పట్టించారు. అన్నితెగలవారూ ‘హజ్రె అస్వద్’ను పట్టుకొని అమర్చవలసిన చోటుకి తెచ్చారు. తరువాత ముహమ్మద్ తన స్వహస్తాలతో కాబా గోడలో దాన్ని అమర్చారు. అనంతరం కాబానిర్మాణం దిగ్విజయంగా పూర్తయింది. - మహమ్మద్ ఉస్మాన్‌ఖాన్