పెంచుకున్న పాము కాటేసి చంపింది
కౌలాలంపూర్, మలేసియా : ప్రముఖ స్నేక్ విస్పరర్ అబు జరిన్ హుస్సేన్(33) పాము కాటుతో మరణించారు. మలేసియాకు చెందిన ఆయన రెండు నాగుపాములను చిన్నప్పటి నుంచి పెంచుతున్నారు. నాగులతో కలసి జిమ్ చేయడం, సెల్ఫీలు తీసుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి చర్యలతో ఆయన పాపులర్ అయ్యారు.
అయితే, శుక్రవారం ఓ పామును కిస్ చేయబోయిన హుస్సేన్ను అది కాటేసి, తీవ్రంగా గాయపర్చింది. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో 20 గంటలకు పైగా మృత్యువుతో పోరాడిన హుస్సేన్ శనివారం కాలకూట విషానికి బలయ్యారు. పాములతో కలసి చేసిన కొంటె చేష్టలనూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ హుస్సేన్ ప్రాచుర్యం పొందారు.
అత్యంత విషపూరిత పాములకు మలేసియా ప్రసిద్ధిగాంచింది. దాదాపు 26 రకాల విషపూరిత పాములు అక్కడ ఆవాసం ఉంటున్నాయి.