వర్తమానాన్ని పట్టుకోలేము!
ప్రముఖుల ఉత్తరాలు
అహ్మద్నగర్కోట,
15 జూన్ 1943.
ప్రియ మిత్రమా!
అరబ్ దేశానికి చెందిన వేదాంతి అబుల్ అలామొ అర్రీ... మన జీవితమునంతటిని మూడే మూడు దినములలో చుట్టివేసినాడు.
గడిచిన దినము అనగా... నిన్న.
గడుచుచున్న దినము అనగా... ఈ రోజు.
రానున్న దినము అనగా... రేపు.
అసలీ వర్తమానం అనే కాలమెక్కడ ఉన్నది? వర్తమానం అనేది భూత, భవిష్కత్కాలాల రూపము మాత్రమేగాని ప్రత్యేక వర్తమానం అన్నది లేదు.
వర్తమానం అనేది ఎంత వేగంతో వచ్చి వెళ్లునంటే, మనం దాన్ని వెంబడించి పట్టుకోలేము. మనం దానిని సమీపించి పట్టుకొనే లోపు తన ప్రకృతిని వెంటనే మార్చివేయును. అప్పుడు అది భూతకాలమో లేక భవిష్యత్కాలమో అయిపోవును. వర్తమానమన్నది ఇక ఉండనే ఉండదన్నమాట.
మనం పట్టుకోదలచినదేమో వర్తమానం. కానీ మన చేతికందేది మాత్రం భూతకాలమే! ఈ కారణం వలన కాబోలు అబుల్తాలిబ్ కలీం అనే కవికి జీవితమనేది రెండే రెండు రోజులదిగా కనిపించింది. అందుకే ఇలా రాశాడు... ‘జీవితం... ఇది రెండు రోజుల కంటే మించినది కాదు. నీకేమని చెప్పను ఈ రెండు రోజులెట్లు గడిచినవని! ఒక దినము దీనియందును, దానియందును మనసు లగ్నం చేయుటలో పోయినది. రెండవరోజు వాటి నుండి మనసును మరల్చుటతో గడిచిపోయినది.’
- దేశసేవకు, సాహిత్యసేవకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలామ్. ఆయన అహమద్నగర్ జైలులో ఉన్నప్పుడు తన మిత్రుడు సదర్యార్ జంగ్కు ఎన్నో ఉత్తరాలు రాశారు. అవి ‘గుబారే ఖాతీర్’ పేరుతో పుస్తకంగా వచ్చాయి. ఆ లేఖలను ‘తలపుల దుమారం’ పేరుతో దేవులపల్లి రామానుజరావు తెలుగులోకి అనువదించారు.