‘వర్సిటీ’ ఏర్పాటుకు తణుకే బెటర్!
తణుకు టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయబోయే యూనివర్సిటీని తణుకు పట్టణంలో ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా ప్రజలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చినట్లవుతుందని జిల్లాకు చెందిన పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలగా తణుకులోని ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలకు అకడమిక్ డెరైక్టర్‌గా, నోడల్ కళాశాలగా వ్యవహరిస్తోంది. జిల్లాలోని డిగ్రీ కళాశాలకు సంబంధించి అన్ని విద్యా విషయాలకు ఈ కళాశాల మార్గదర్శకంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడే వర్సిటీని ఏర్పాటు చేయడం సముచితంగా వుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పీజీ సెంటర్‌ను తన్నుకుపోయిన గూడెం
2003లో అప్పటి యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ సింహాద్రి అధ్యక్షతన సమావేశమైన వర్సిటీ పాలకమండలి వర్సిటీ పరిధిలోని విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో పీజీ సెంటర్లు ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. జిల్లాలోని తణుకు ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని అప్పటి వర్సిటీ పాలకమండలి సభ్యులు గుబ్బల తమ్మయ్య, ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ తీర్మానం చేయించారు. అయితే పీజీ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన 40 ఎకరాల భూమి లభ్యం కాకపోవడంతో 2004లో అప్పటి జిల్లా కలెక్టర్ తాడేపల్లిగూడెంలో ఏయూ పీజీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో వర్సిటీ అయినా దక్కించుకోవాలని తణుకు ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు.