అక్టోబరులో అకాడమీ వేడుక
లాస్ ఏంజిల్స్‌లో ఈ ఏడాది అక్టోబరులో జరగనున్న నాలుగో అకాడమీ మ్యూజియమ్ గాలా వేడుకలో దర్శకుడు క్వెంటిన్ టరంటినో, నటుడు పాల్ మెస్కల్, నటి రీటా మోరెనో అవార్డులు అందుకోనున్నారు. వాంటేజ్ అవార్డుకు మెస్కల్, ఐకాన్ అవార్డు కోసం మోరెనో, ల్యూమినరీ అవార్డుకు క్వెంటిన్ను ఎంపిక చేశారు. ‘‘తరాలుగా ప్రపంచవ్యాప్త సినిమాకు సేవలందిస్తూ, ఆర్టిస్టులకు, ఫిల్మ్ మేకర్స్‌కు ప్రేరణగా నిలుస్తున్న ఈ ముగ్గురినీ ఈ ఏడాది సత్కరించనున్నాం. అక్టోబరు 19న ఈ వేడుక జరుగుతుంది’’ అని అకాడమీ మ్యూజియమ్ గాలా అధ్యక్షురాలు అమీ హోమ్మా పేర్కొన్నారు. కాగా ఈ అకాడమీ మ్యూజియమ్ గాలా అవార్డులను విరాళాల సేకరణ కోసం ఆరంభించారు. 2021లో ఈ మ్యూజియమ్ ఆరంభమైంది. గడచిన మూడేళ్లుగా అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఈ వేడుక నుంచి లభించిన నగదును స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందిస్తారు. ఇక లాస్ ఏంజిల్స్‌లో ఉన్న ఈ మ్యూజియమ్‌లో సినిమాల కోసం ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ వాడిన ప్రత్యేకమైన దుస్తులు, ఆయుధాలు, ఇతర వస్తువులను సందర్శనకు ఉంచారు.